సంక్షిప్త వార్తలు

ప్రయాణికుల వాహన తయారీ సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది.

Updated : 29 Nov 2022 01:59 IST

2025 నాటికి  రూ.65,000 కోట్ల పెట్టుబడులు
ప్రయాణికుల వాహన తయారీ సంస్థల ప్రణాళిక: ఇక్రా
  

దిల్లీ: ప్రయాణికుల వాహన తయారీ సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గిరాకీకి తగ్గట్లు ఆయా సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాల్ని పెంచుకునేందుకు ఈ నిధులు వెచ్చించబోతున్నట్లు తెలిపింది. సెమీ కండక్టర్ల కొరత తీరడంతో, ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రయాణికుల వాహనాలకు గిరాకీ బాగా పెరిగిందని పేర్కొంది. ప్రయాణికుల వాహన పరిశ్రమ టోకు విక్రయాల పరిమాణం 2022-23 ఆర్థిక సంవత్సరం ఆఖరుకు 37-38 లక్షలకు చేరొచ్చని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21-24 శాతం వృద్ధి చెందినట్లు అవుతుందని వివరించింది.


డేటా కేంద్రాల నిధి కోసం రూ.8,200 కోట్ల సమీకరణ!

ముంబయి: డేటా కేంద్రాల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,200 కోట్లు) నిధుల్ని కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ అనుబంధ సంస్థ కోటక్‌ ఆల్టర్నేటివ్‌ అసెట్స్‌ సమీకరించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కోటక్‌ డేటా సెంటర్‌ ఫండ్స్‌ ప్లాట్‌ఫామ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా గత శుక్రవారం శుభంకర్‌ దాస్‌ను ఎంపిక చేసిన సంగతి విదితమే. నిధుల సమీకరణ ప్రణాళికను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


సిగ్నేచర్‌ గ్లోబల్‌ రూ.1,000 కోట్ల ఐపీఓకు అనుమతులు

దిల్లీ: రూ.1,000 కోట్ల వరకు సమీకరించే నిమిత్తం స్థిరాస్తి సంస్థ సిగ్నేచర్‌ గ్లోబల్‌(ఇండియా) ప్రతిపాదించిన పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు సెబీ అనుమతులు ఇచ్చింది. రుణాలను తీర్చడానికి, భూముల కొనుగోళ్లకు ఈ నగదును వెచ్చించనుంది. జులైలో ఈ కంపెనీ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. నవంబరు 24న సెబీ నుంచి పరిశీలక లేఖను అందుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఓకు హోమ్స్‌ఫై రియాల్టీ దాఖలు: ప్రాపర్టీ టెక్‌ అకుంరం హోమ్స్‌ఫై రియాల్టీ.. పబ్లిక్‌ ఇష్యూ వచ్చేందు కోసం ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. సోమవారం ఇది రూ.8.97 కోట్లు సమీకరించింది.


మెటాపై రూ.2,200 కోట్ల జరిమానా

లండన్‌: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాపై ఐర్లాండ్‌ నియంత్రణ సంస్థ 265 మిలియన్‌ యూరోలు (దాదాపు రూ.2,200 కోట్లు) జరిమానా విధించింది. ఐరోపా సమాఖ్య డేటా భద్రత నిబంధనలు ఉల్లంఘించింనందుకు ఈ జరిమానా విధించారు. జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌గా పరిగణించే ఐరోపా సమాఖ్య నిబంధనలను మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఉల్లంఘించిందని, వినియోగదారుల డేటా భద్రతకు ఇది విఘాతమని డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ తెలిపింది.


విస్తరణ దిశగా నెక్స్ట్‌ ఎడ్యుకేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: విద్యా సంస్థలకు సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) సేవలను అందించే నెక్స్ట్‌ ఎడ్యుకేషన్‌ విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈఓ బియాస్‌ దేవ్‌ రాల్హాన్‌ తెలిపారు. వచ్చే మూడు నాలుగేళ్లలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్ల స్థాయికి చేర్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం విద్యా సంస్థలకు అందిస్తున్న సేవలకు తోడుగా నెక్స్ట్‌ 360ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. నెక్స్ట్‌ 360 కోసం ఇప్పటికే 25 పాఠశాలలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకొన్నట్లు వెల్లడించారు. 150కి పైగా స్కూళ్లు తమ పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయన్నారు.


పాత కార్లకు గిరాకీ

2027 నాటికి 16%  వృద్ధి: ఓఎల్‌ఎక్స్‌-క్రిసిల్‌ ఆటో  
ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణాల కోసం వ్యక్తిగత వాహనాలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతుండటంతో పాత కార్లకు గిరాకీ పెరుగుతోందని క్రిసిల్‌ ఆటో-ఓఎల్‌ఎక్స్‌ ఆరో వార్షిక నివేదిక వెల్లడించింది. రాబోయే అయిదేళ్ల కాలంలో ఇది మరింతగా వృద్ధి చెంది 16 శాతం వరకూ వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. కొత్త కార్ల సరఫరా తగ్గడంతో చాలామంది పాత కార్లవైపు మొగ్గు చూపిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. నగరాలు, పెద్ద పట్టణాల నుంచి పాత కార్లకు అధిక గిరాకీ లభిస్తోందని ఓఎల్‌ఎక్స్‌ ఇండియా సీఈఓ అమిత్‌ కుమార్‌ తెలిపారు.


విదేశీ డ్రెడ్జింగ్‌ మార్కెట్లోకి డీసీఐ

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) త్వరలోనే విదేశీ డ్రెడ్జింగ్‌ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ‘విదేశీ జలాల్లోకి అడుగుపెట్టాలని యత్నాలు తలపెట్టాం. ఈ సారీ సాఫల్యం చెందుతామని భావిస్తున్నాం. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు డ్రెడ్జింగ్‌ కాంట్రాక్టును డీసీఐ నిర్వహిస్తోంద’ని నౌకాయాన శాఖ ఆధ్వర్యంలోని ఈ కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. సంప్రదాయ, కొత్త డ్రెడ్జింగ్‌ సేవలను విస్తరించడం ద్వార దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు కార్యకలాపాల ద్వారా ఆదాయాలనూ పెంచుకోవాలని భావిస్తున్నట్లు అందులో తెలిపింది.


సంక్షిప్తాలు

నీ దేశీయ విమానాలు వరుసగా రెండో రోజూ 4 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చడం విశేషం. ఆది వారం(27న) 2739 విమానాల ద్వారా 4,09,831 మందిని; శనివారం(26న) 2767 విమానాల ద్వారా 4,05,963 మందిని తరలించాయి.
బీఎస్‌ఈ ఎండీ, సీఈఓగా సుందరరామన్‌ రామమూర్తి నియామకానికి సెబీ సోమవారం ఆమోదముద్ర వేసింది.
ఫిఫా ప్రపంచకప్‌పై నకిలీ వెబ్‌సైట్లను వినియోగించి సైబర్‌ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని క్లౌడ్‌సెక్‌ సంస్థ సూచిస్తోంది.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) కొత్త అధ్యక్షుడిగా విజేందర్‌ శర్మ, ఉపాధ్యక్షుడిగా రాకేశ్‌ భల్లా ఎంపికయ్యారు.
వ్యాపార పరిష్కారాల కోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌పై టీసీఎస్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించినట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వెల్లడించింది.
భారతీయ అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు 50 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.408 కోట్లు) నిధికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపిందని నెదర్లాండ్‌కు చెందిన సి4డి పార్ట్‌నర్స్‌ వెల్లడించింది.
* దేశీయ విపణిలోకి ద్విచక్ర వాహన టైర్ల శ్రేణిని ‘రీజ్‌’ బ్రాండ్‌ కింద పరిచయం చేస్తున్నట్లు రీజ్‌ మోటో వెల్లడించింది. మహాన్సారియా గ్రూప్‌, ఐరోపా బ్రాండ్‌ మిటాస్‌ల సంయుక్త సంస్థ ఇది.
* మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో మిత్సుయ్‌ సుమిటోమోకు మిగిలి ఉన్న 5.17 శాతం వాటాను మ్యాక్స్‌ ఫిన్‌ సర్వీసెస్‌ కొనుగోలు చేసేందుకు ఐఆర్‌డీఏఐ ఆమోదించింది.
*వాహనాలను తుక్కు కింద మార్చడం కోసం మారుతీ సుజుకీ టొయోత్సుతో జట్టు కట్టినట్లు హోండా కార్స్‌ వెల్లడించింది.
* బ్రెజిల్‌కు చెందిన బౌచ్‌ హెల్త్‌ కంపెనీస్‌ అనుబంధ సంస్థ నుంచి 9 ఉత్పత్తుల హక్కుల్ని కొనుగోలు చేసేందుకు కచ్చితమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు లుపిన్‌ వెల్లడించింది.
* 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థీకృత ఎలక్ట్రికల్‌, కిచెన్‌ అప్లియెన్సెస్‌ పరిశ్రమ 8-10 శాతం మేర వృద్ధి సాధించే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు