ఎయిరిండియాలో విస్తారా విలీనం

ఒకప్పుడు తన గూటి నుంచి ఎగిరిపోయి, మళ్లీ ఈ ఏడాది ఆరంభంలో తన ఆధీనంలోకి వచ్చిన విమానయాన సంస్థ ఎయిరిండియాను.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా టాటా గ్రూపు తొలి అడుగు వేసింది.

Published : 30 Nov 2022 02:27 IST

2024 మార్చికి పూర్తయ్యే అవకాశం
విలీన సంస్థలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 25.1% వాటా
కార్యకలాపాల విస్తరణకు మరిన్ని పెట్టుబడులు
టాటా గ్రూపు వెల్లడి 

ఒకప్పుడు తన గూటి నుంచి ఎగిరిపోయి, మళ్లీ ఈ ఏడాది ఆరంభంలో తన ఆధీనంలోకి వచ్చిన విమానయాన సంస్థ ఎయిరిండియాను.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా టాటా గ్రూపు తొలి అడుగు వేసింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి నిర్వహిస్తున్న పూర్తిస్థాయి సేవల సంస్థ విస్తారాను ఎయిరిండియలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది

* * * * * *

దిల్లీ: దేశీయ విమానయాన రంగంలో మరో అతిపెద్ద విలీనానికి రంగం సిద్ధమైంది. ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నట్లు టాటా గ్రూపు మంగళవారం ప్రకటించింది. విస్తారా.. టాటా గ్రూపు (51%), సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (సియా) (49%)ల సంయుక్త సంస్థ. విలీనానంతర ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా ఉండనుంది. నియంత్రణ పరమైన అనుమతులు లభిస్తే.. 2024 మార్చి కల్లా విలీన ప్రక్రియ పూర్తి కావచ్చన్నది అంచనా. ‘విస్తారా, ఎయిరిండియా విలీనం అవుతాయి. ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నాం. విలీనానంతర సంస్థలో మా వాటా 25.1 శాతంగా ఉంటుంద’ని సియా తెలిపింది. 2022-23, 2023-24లలో ఎయిరిండియా కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఒకవేళ మరిన్ని నిధులు అవసరమైతే.. సమకూర్చేందుకు సియా, టాటాసన్స్‌ అంగీకరించాయి. అంటే విలీన సంస్థలో సియాకు 25.1 శాతం ఉంటుంది కనుక, ఆ వాటా మేరకు అదనంగా సమకూర్చాల్సిన మొత్తం రూ.5,020 కోట్లుగా ఉండొచ్చని అంచనా. విలీనానంతరం ఈ మొత్తం చెల్లిస్తామని సియా తెలిపింది.

‘‘విలీనానంతరం 218 విమానాలతో అంతర్జాతీయ సర్వీసుల్లో దేశీయ అగ్రగామి విమానయాన సంస్థగా, దేశీయ సర్వీసులపరంగా రెండో దిగ్గజ సంస్థగా ఎయిరిండియా అవతరిస్తుంది’’

టాటా గ్రూపు

‘‘ఎయిరిండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయాణంలో విస్తారా, ఎయిరిండియా విలీనం ఓ కీలక మైలురాయి.’’

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌

‘విస్తారా గత ఎనిమిదేళ్లలో అనుకున్నదాని కంటే ఎక్కువగా విజయవంతం అయ్యింది. అందువల్ల ఎయిరిండియాకు పునర్‌వైభవాన్ని తీసుకొచ్చే మా ప్రయత్నానికి విస్తారా విలీనం మరింత ఉత్తేజాన్ని నింపుతుంది. అంతర్జాతీయ విమానయాన సంస్థగా వేగంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది’

క్యాంప్‌బెల్‌ విల్సన్‌, సీఈఓ, ఎయిరిండియా

‘విలీనం పూర్తయ్యేందుకు సమయం పడుతుంది. ఈ పరిణామ క్రమంలో మా వ్యాపార కార్యకలాపాలు యథాతథంగానే కొనసాగుతాయి’

వినోద్‌ కన్నన్‌, సీఈఓ, విస్తారా

* * * * * *

టాటా గ్రూపులో ప్రస్తుతం 4 విమానయాన సంస్థలు

1) ఎయిరిండియా
2) ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌
3) ఎయిరేషియా ఇండియా
4) విస్తారా

* ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లను ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసింది.
* 2015లో విస్తారా (సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
* 2014 నుంచి ఎయిరేషియా ఇండియా నడుస్తోంది. (ఎయిరేషియా భాగస్వామ్యంతో ప్రారంభమైనా ఇప్పుడు 100 శాతం వాటా టాటాలకే ఉంది.)

మార్కెట్‌ వాటాలో రెండో స్థానం

అక్టోబరులో ప్రయాణికులను చేరవేయడంలో, దేశీయంగా ఇండిగో 56.7% మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంటే, విస్తారా (9.2%) రెండో స్థానంలో ఉంది. ఎయిరిండియా, ఎయిరేషియా ఇండియా మార్కెట్‌ వాటాలు 9.1%, 7.6 శాతంగా ఉన్నాయి. విస్తారా విలీన ఫలితంగా ఎయిరిండియా మార్కెట్‌ వాటా 18.3 శాతానికి చేరుతుంది.

కొనేళ్ల కల.. విస్తారా

భారత్‌లో సంయుక్త విమానయాన సంస్థను నెలకొల్పేందుకు టాటా గ్రూపు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు  1994లో ప్రయత్నించాయి. మళ్లీ 2000 సంవత్సరంలో ఎయిరిండియాలో వాటాల కొనుగోలుకు చూసినా, సఫలం కాలేదు. విమానయాన రంగంలో విదేశీ సంస్థల పెట్టుబడులపై ఆంక్షలను భారత ప్రభుత్వం 2012లో ఎత్తివేయడంతో.. టాటా, సియా మళ్లీ జట్టుకట్టి, 2013లో  అనుమతులు పొందాయి. 2013లో ఇరు సంస్థలు ‘టాటా సియా ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌’ అనే సంయుక్త సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ద్వారానే 2015లో ‘విస్తారా’ విమానాలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ‘అపరిమిత విస్తరణ’ అని అర్థ్ధం వచ్చే ‘విస్తార్‌’ అనే సంస్కృతి పదం ఆధారంగా.. ‘విస్తారా’ పేరు పెట్టాయి.
* ప్రస్తుతం విస్తారా 43 దేశీయ, విదేశీ గమ్యస్థానాలకు రోజూ 260కి పైగా విమాన సర్వీసులు నడుపుతోంది. విస్తారా వద్ద 54 విమానాలు, 4,500 మందికి పైగా సిబ్బంది ఉన్నారు.

దేశీయ విపణిపై 2 సంస్థల ఆధిపత్యం

ఎయిరిండియా, విస్తారాల విలీనం అనంతరం.. దేశీయ విమానయాన విపణిలో ద్వంద్వ (రెండు సంస్థల చేతిలో) ఆధిపత్య ధోరణి నెలకొంటుందని విమానయాన కన్సల్టెన్సీ, పరిశోధనా సంస్థ కాపా ఇండియా తెలిపింది. ఎయిరిండియా, ఇండిగోల మధకచ తీవ్ర పోటీ నెలకొంటుందని.. ఈ రెండు సంస్థల మొత్తం మార్కెట్‌ వాటా 75- 80 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ఈ విలీనం విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తుందని.. పూర్తి వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది.

విలీనానంతరం..

* అక్టోబరు విమాన ప్రయాణికుల్లో వాటా పరంగా చూస్తే విస్తారా (9.2%), ఎయిరిండియా (9.1%)కు.. ఎయిరేషియా ఇండియా (7.3%) మార్కెట్‌ వాటా కలిపితే మొత్తం టాటా గ్రూప్‌ మార్కెట్‌ వాటా 25.9 శాతానికి చేరుతుంది. ఇండిగో 57.3% తో మొదటిస్థానంలోనే ఉంటుంది.
* ఎయిరిండియాకు 165 విమానాలు, విస్తారాకు 53 విమానాలు ఉన్నాయి. విలీనానంతరం ఈ సంఖ్య 218కు చేరుతుంది.
* సెప్టెంబరు చివరినాటికి అంతర్జాతీయ సర్వీసుల్లో ఎయిరిండియా, విస్తారాల మార్కెట్‌ వాటా 24 శాతంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో ఈ వాటాను 30 శాతానికి పెంచుకోవాలన్నది ఎయిరిండియా లక్ష్యం.
* విలీనానంతర సంస్థకు సంబంధించి బ్రాండింగ్‌, యూనిఫార్మ్‌, సర్వీసుల వివరాలను టాటా గ్రూపు వెల్లడించలేదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు