గ్లాండ్‌ ఫార్మాలో వాటా విక్రయించనున్న ఫోసున్‌ ఫార్మా?

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లాండ్‌ ఫార్మాలో వాటాను, ఆ సంస్థ ప్రమోటర్‌గా ఉన్న చైనా సంస్థ ఫోసున్‌ ఫార్మా విక్రయించనున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారమైంది.

Published : 30 Nov 2022 02:28 IST

7.71 శాతం పెరిగిన షేరు ధర

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లాండ్‌ ఫార్మాలో వాటాను, ఆ సంస్థ ప్రమోటర్‌గా ఉన్న చైనా సంస్థ ఫోసున్‌ ఫార్మా విక్రయించనున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారమైంది. దీంతో బీఎస్‌ఈలో గ్లాండ్‌ ఫార్మా షేరు ధర ఆకర్షణీయంగా పెరిగింది. సోమవారం ముగింపు ధర రూ.1745 కాగా, మంగళవారం ఒక్కరోజే 7.71 శాతం (రూ.134.60) పెరిగి రూ.1879 వద్ద ముగిసింది. 

నీ గ్లాండ్‌ ఫార్మాలో ఫోసున్‌ ఫార్మాకు దాదాపు 58 శాతం వాటా ఉంది. కేకేఆర్‌ అనే పీఈ (ప్రైవేట్‌ ఈక్విటీ) సంస్థ నుంచి గ్లాండ్‌ఫార్మాలో మెజార్టీ వాటాను 2017లో కొనుగోలు చేసిన ఫోసున్‌ ఫార్మా, ఆ తర్వాత పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చి తన వాటా కొంత తగ్గించుకుంది. అయినా ఇప్పటికీ మెజార్టీ వాటా ఫోసున్‌ ఫార్మా చేతిలో ఉంది. తన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా గ్లాండ్‌ ఫార్మా వాటా విక్రయించే అంశాన్ని ఫోసున్‌ పరిశీలిస్తోందని కొంతకాలంగా ప్రచారంలో ఉంది. వాటా విక్రయ వ్యవహారం త్వరలో ఖరారు కానుందని మార్కెట్‌లో వార్త లొచ్చాయి. కానీ గ్లాండ్‌ ఫార్మా మాత్రం ఈ విషయం తన దృష్టికి రాలేదని పేర్కొంది. ‘వాటా విక్రయిస్తున్నట్లు కానీ, అటువంటి ఆలోచన ఉన్నట్లు కానీ ప్రమోటర్లకు నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు’ అని గ్లాండ్‌ ఫార్మా స్పష్టం చేసింది. అందువల్ల ఈ విషయంపై ఇప్పుడు తాము చెప్పేదేమీ లేదని వివరించింది.

‘సెనెగ్జి గ్రూపు’ కొనుగోలుకు ఒప్పందం

గ్లాండ్‌ ఫార్మా, సింగపూర్‌లోని తన అనుబంధ సంస్థ అయిన గ్లాండ్‌ ఫార్మా ఇంటర్నేషనల్‌ పీటీఈ ద్వారా , సెనెగ్జి గ్రూపులో 100 శాతం వాటా కొనుగోలుకు ‘పుట్‌ ఆప్షన్‌ ఒప్పందం’ కుదుర్చుకుంది. ఈ లావాదేవీ విలువ 120 మిలియన్‌ యూరోల  (దాదాపు రూ.1,000 కోట్ల) వరకు ఉండొచ్చు. సెనెగ్జి గ్రూపు సీడీఎంఓ (కాంట్రాక్టు అభివృద్ధి, మందుల తయారీ) విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. స్టెరైల్‌ లిక్విడ్‌, లయోఫిలైజ్డ్‌ ఫిల్‌-ఫినిష్డ్‌ ఔషధాలను, కొన్ని కేన్సర్‌ మందులను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థకు బెల్జియంలో ఒకటి, ఫ్రాన్స్‌లో 3 యూనిట్లున్నాయి. 1,372 మంది ఉద్యోగులు  పనిచేస్తున్నారు. 2021 కేలండర్‌ ఏడాదిలో 184 మిలియన్‌ యూరోల ఆదాయాన్ని ఈ సంస్థ నమోదు చేసింది. సీడీఎంఓ వ్యాపార కార్యకలాపాలను విస్తరించే యత్నాల్లో ఉన్నట్లు, ముఖ్యంగా ఐరోపాలో ఆదాయాలు పెంచుకునే ఆలోచన చేస్తున్నట్లు గ్లాండ్‌ ఫార్మా వివరించింది. సెనెగ్జి గ్రూపును కొనుగోలు చేయడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించే అవకాశం కలుగుతుందని గ్లాండ్‌ ఫార్మా వివరించింది. ఆప్తమాలజీ జెల్‌, సూది అవసరం లేని ఇంజెక్షన్లు, హార్మోన్ల విభాగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం తమకు లభిస్తుందని, దీర్ఘకాలిక వృద్ధి నమోదు చేసేందుకు అవకాశం కలుగుతుందని గ్లాండ్‌ ఫార్మా సీఈఓ శ్రీనివాస్‌ సాదు అన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని