సంక్షిప్త వార్తలు (4)
విమానాశ్రయాల లోపల, వెలుపల అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ సేవలను టెలికాం సంస్థలు నిలిపివేయనున్నాయి.
విమానాశ్రయాల సమీపంలో 5జీ సేవలకు పరిమితులు
దిల్లీ: విమానాశ్రయాల లోపల, వెలుపల అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ సేవలను టెలికాం సంస్థలు నిలిపివేయనున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేయడంతో టెలికాం విభాగం (డాట్) ఈ సేవలపై ఆంక్షలు విధించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి విమానయాన శాఖ బఫర్, భద్రతా జోన్ వివరాలను డాట్‌కు అందించింది. భారత విమానాశ్రయాల్లో రన్‌వే సెంటర్‌లైన్ నుంచి 910 మీటర్లు, రన్‌వే ఇరువైపులా 2.1 కిలోమీటర్ల ప్రాంతంలో 3.3- 3.6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 5జీ బేస్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయొద్దని టెలికాం ఆపరేటర్లను డాట్ ఆదేశించింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, విమానాల ఆల్టీమీటర్లను మార్చిన తర్వాత డీజీసీఏ అనుమతి వస్తే సేవలను పునరుద్ధరించొచ్చని, అయితే ఇందుకు ఎటువంటి గడువు లేదని సమాచారం.
విస్ట్రాన్ ఐఫోన్ ప్లాంట్ టాటా గ్రూప్ చేతికి?
రూ.5,000 కోట్లతో కొనుగోలు చేసే అవకాశం
యాపిల్ సంస్థకు భారత్‌లో ఉన్న దిగ్గజ విక్రేతల్లో ఒకటైన తైవాన్ సంస్థ విస్ట్రాన్ కార్ప్‌తో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. విస్ట్రాన్ కార్ప్‌నకు కర్ణాటకలో ఐఫోన్ అసెంబ్లింగ్ తయారీ ప్లాంట్ ఉంది. దీన్ని రూ.5,000 కోట్లతో కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. విస్ట్రాన్ కార్ప్ 2017 నుంచి మన దేశంలో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. ఒకవేళ ఈ ఒప్పందం పూర్తయితే ఐఫోన్లను దేశీయంగా తయారు చేసే తొలి సంస్థ టాటా గ్రూప్ కానుంది. ప్రస్తుతం తైవాన్‌కు చెందిన తయారీ దిగ్గజాలు విస్ట్రాన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌లు చైనా, భారత్‌లో ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
డిసెంబరు 29 నుంచి భారత్, ఆస్ట్రేలియా ఎఫ్‌టీఏ అమల్లోకి
దిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) డిసెంబరు 29 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంతో వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపై 45- 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.7- 4.1 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని అంచనా. అస్ట్రేలియా-భారత్ ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) అమలుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను భారత ప్రభుత్వం పూర్తి చేసిందని, దీంతో ఎఫ్‌టీఏ అమలుకు మార్గం సుగమమైనట్లు ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ వెల్లడించారు. ఆస్ట్రేలియా సంస్థలు, వినియోగదారులు కొత్త మార్కెట్ అవకాశాలు అందుకోవడానికి ఈ వాణిజ్య ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు కొత్త శకానికి నాందిగా భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ అభివర్ణించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
ప్రయోజనాలివీ: ఆస్ట్రేలియాలో జౌళి, తోళ్లు, ఫర్నీచర్, ఆభరణాలు, యంత్రాలు సహా 6000 విభాగాల్లో భారత ఎగుమతులపై సుంకాలు ఉండవు. భారత ఎగుమతుల్లో దాదాపు 96.4 శాతానికి మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 4-5 శాతం కస్టమ్స్ సుంకం ఉన్న చాలా ఉత్పత్తులకు ఇకపై సుంకాలు విధించరు. 2021-22లో ఆస్ట్రేలియాకు భారత ఎగుమతులు 8.3 బి.డాలర్లుగా, ఆ దేశం నుంచి దిగుమతులు 16.75 బి.డాలర్లుగా నమోదయ్యాయి.
నెల రోజుల పాటు కార్వీ రిజిస్ట్రేషన్ సస్పెన్షన్
దిల్లీ: పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా కార్వీ స్టాక్ బ్రోకింగ్(పీఎమ్ఎస్ కార్వీ)కున్న రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాన్ని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ నెల రోజుల పాటు సస్పెండ్ చేసింది. నియంత్రణపరమైన నిబంధనలను ఉల్లంఘించడం ఇందుకు కారణం. ‘అపరాధ రుసుములు, చట్ట వివాదాల వివరాలు, దర్యాప్తు వివరాలను వెల్లడించడంలో పీఎమ్ఎస్ కార్వీ విఫలమైందని తన ఆదేశాల్లో సెబీ పేర్కొంది. తన వెల్లడి పత్రంలో వాస్తవ విరుద్ధ అంశాలను పేర్కొందని, క్లయింట్లతో ఒప్పంద రద్దు విషయంలో మోడల్ పోర్ట్‌ఫోలియో అగ్రిమెంట్లో పేర్కొన్న నోటీసు గడువు అంశంలో ఏకరూపతను పాటించలేకపోయిందనీ తెలిపింది. ఆడిటర్ల నివేదికలో వ్యత్యాసాలను కనుగొనే విషయంలో; అనుభవం ఉన్న ప్రిన్సిపల్ ఆఫీసర్, కాంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించే విషయంలోనూ విఫలమైందని సెబీ పేర్కొంది. ఇటువంటి చర్యలతో ‘పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ నిబంధనల’ను కార్వీ ఉల్లంఘించిందని, అందువల్లే తక్షణం అమల్లోకి వచ్చేలా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు వివరించింది. 2018 ఏప్రిల్ -2019 మార్చి కాలానికి చేపట్టిన దర్యాప్తును అనుసరించి ఈ ఆదేశాలను వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి
-
Latestnews News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్‌కు వీడ్కోలు
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు