ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ సంస్థకు ప్రణయ్‌రాయ్‌ దంపతుల రాజీనామా

ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌లు ప్రమోటరు గ్రూప్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు.

Published : 01 Dec 2022 01:36 IST

అదానీ టేకోవర్‌ గడువు సమీపిస్తున్నందునే
అయిదో రోజూ రాణించిన షేరు

దిల్లీ: ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌లు ప్రమోటరు గ్రూప్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. ఎన్‌డీటీవీని అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేసుకోవడానికి కొద్ది రోజులే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో, ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటా ఉన్న ఆర్‌ఆర్‌పీఆర్‌ను అదానీ గ్రూప్‌ స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చిన సంగతి విదతమే. ఎన్‌డీటీవీలో ప్రమోటర్లయిన ప్రణయ్‌ (15.94%), రాధికారాయ్‌ (16.32%)లకు కలిపి 32.26 శాతం వాటా ఉంది. ఈ బోర్డు నుంచి వీరు రాజీనామా చేయలేదు. వీరిద్దరు ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ బోర్డుకు రాజీనామా చేశారని ఎక్స్ఛేంజీలకు ఎన్‌డీటీవీ తెలిపింది. ఎన్‌డీటీవీ ఛైర్‌పర్సన్‌గా ప్రణయ్‌రాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా రాధికారాయ్‌ ఉన్నారు.

* ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ బోర్డులో అదానీ గ్రూపు నామినీలైన సుదీప్త భట్టాచార్య, సంజయ్‌ పుగలియా, సెంథిల్‌ సిన్నయ్య చెంగల్వరాయన్‌లను డైరెక్టర్లుగా నియమించినట్లు ఎన్‌డీటీవీ వివరించింది. ఈ రాజీనామాలు, నియామకాలకు ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ బోర్డు అంగీకారం తెలిపింది.

* డిసెంబరు 5న అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ముగియనుంది. ఇప్పటివరకు ఆఫర్‌లో మూడోవంతుకు సమానవైన 53.27 లక్షల షేర్లకు మాత్రమే ఆఫర్లు వచ్చాయి. ఒకవేళ ఆశించిన ఆఫర్లు వస్తే, ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు నియంత్రిత వాటా (55% పైగా) వస్తుంది. అపుడు ఎన్‌డీటీవీ బోర్డు నుంచి కూడా రాయ్‌ దంపతులను బయటకు పంపొచ్చు.

కొనసాగుతున్న ర్యాలీ: ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌డీటీవీ షేరు వరుసగా అయిదో రోజూ లాభాలు పంచాయి. బుధవారం బీఎస్‌ఈలో రోజులో అనుమతించిన గరిష్ఠ పరిమితి (అప్పర్‌ సర్క్యూట్‌) అయిన 5 శాతం పెరిగి రూ.447.70కు చేరింది. ఈ అయిదు రోజుల్లో ఈ షేరు 24.74 శాతం రాణించింది.

------పట్టిక------
ఎన్‌డీటీవీ షేరు ర్యాలీ ఇలా..
సమయం  లాభం(%లో)
5 రోజులు 24.74
30 రోజులు 43.45
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 288.46
గత ఏడాది కాలంలో 481.43
గత మూడేళ్లలో 1513.33

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు