SBI: డిజిటల్‌ లావాదేవీలకు ఇ-మెయిల్‌ ఓటీపీ: ఎస్‌బీఐ

సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇ-మెయిల్‌ ఓటీపీని ప్రవేశ పెట్టింది.

Updated : 01 Dec 2022 09:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇ-మెయిల్‌ ఓటీపీని ప్రవేశ పెట్టింది. ఖాతాదారులు డిజిటల్‌ లావాదేవీలు చేసినప్పుడు అధీకృత ఇ-మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేస్తేనే లావాదేవీ పూర్తవుతుంది. ‘మీ డిజిటల్‌ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించండి. దీనికోసం ఇ-మెయిల్‌ ఓటీపీ నోటిఫికేషన్‌ అందుకునేందుకు, వెంటనే సదుపాయాన్ని యాక్టివేట్‌ చేసుకోండి’ అని ఎస్‌బీఐ ట్విటర్‌లో వెల్లడించింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించే ఖాతాదారులందరూ ప్రొఫైల్‌ విభాగంలో, హైసెక్యూరిటీ అవకాశాల నుంచి ఈ సేవలను యాక్టివేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది.  ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు చెప్పాల్సిందిగా బ్యాంకు నుంచి ఎలాంటి ఫోన్లూ రావని, వినియోగదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

పీఎన్‌బీ: ఏటీఎంలో నుంచి నగదు తీసుకోవాలనుకున్న ప్రతిసారీ ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్‌ నెంబరుకు వచ్చే వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని నమోదు చేయాల్సి ఉంటుందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తెలిపింది. ఖాతాదారులు తమ డెబిట్‌ కార్డుతో నగదు తీసుకోవాలంటే.. పిన్‌తో పాటు, ఓటీపీ కూడా నమోదు చేయాల్సిందే. డిసెంబరు 1 నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇప్పటికే ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదార్లు ఏటీఎం నుంచి రూ.10వేలకు మించి నగదు తీయాలనుకుంటే ఓటీపీ నమోదును తప్పనిసరి చేసింది.

డిజిటల్‌ రుణాలకు కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి :ఆర్‌బీఐ

ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకునే ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. వడ్డీ రేట్లను నిర్ణయించడం మొదలు, రుణాల వసూలు విషయంలో రికవరీ ఏజెంట్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసే అంశాలు ఇందులో ఉన్నాయి. రుణ మొత్తాన్ని జమ చేసినప్పుడు, వాటిని తిరిగి చెల్లించేటప్పుడు ఖాతాదారుడి ఖాతా, నియంత్రణ పరిధిలోని సంస్థల (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ) మధ్యే నేరుగా లావాదేవీలు జరగాలి. రుణ సేవలను అందించే సంస్థల (ఎల్‌ఎస్‌పీ) పూల్‌ ఖాతా నుంచి నిర్వహించకూడదని పేర్కొంది. ఎల్‌ఎస్‌పీలకు బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలే రుసుములు చెల్లించాలని, రుణగ్రహీతకు వీటితో సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు ఆగస్టులో ఇచ్చిన మార్గదర్శకాలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని