పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో రెండంకెల వృద్ధి

దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు 2021 నవంబరుతో పోలిస్తే గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

Published : 02 Dec 2022 03:45 IST

దిల్లీ: దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు 2021 నవంబరుతో పోలిస్తే గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. వ్యవసాయ రంగం నుంచి లభించిన మద్దతుతో పాటు పండుగల సీజన్‌ అమ్మకాలు ఇందుకు కారణమయ్యాయి. పెట్రోల్‌ విక్రయాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్‌ టన్నులకు చేరాయి. ఏడాది క్రితం నవంబరులో ఈ విక్రయాలు 2.38 మి.టన్నులుగా నమోదయ్యాయి. 2020 నవంబరుతో పోలిస్తే 10.7 శాతం, 2019 నవంబరుతో పోలిస్తే 16.2 శాతం అధికంగా పెట్రోల్‌ విక్రయాలు జరిగాయి.. 2022 అక్టోబరుతో పోల్చినా 1.3 శాతం మేర గిరాకీ పెరిగింది.

* దేశంలో అధికంగా వినియోగించే డీజిల్‌ విక్రయాలు గత నెలలో 27.6 శాతం వృద్ధితో 7.32 మి.టన్నులకు చేరాయి. 2020 నవంబరు విక్రయాలతో పోలిస్తే 17.4 శాతం, 2019 నవంబరు అమ్మకాలతో పోలిస్తే 9.4 శాతం మేర వినియోగం పెరిగింది. నెలవారీగా చూసినా సెప్టెంబరు నుంచి డీజిల్‌ విక్రయాలు బాగా పెరిగాయి. ఈ ఏడాది అక్టోబరు విక్రయాలు 6.25 మి.టన్నులతో పోల్చినా నవంబరులో 17.1 శాతం వృద్ధి నమోదైంది.

* జూన్‌ నుంచి చూసినా అత్యధిక స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు నమోదయ్యాయి. వ్యవసాయ సీజన్‌లో డీజిల్‌కు గిరాకీ బాగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. నీటి పారుదల పంపులు, వ్యవసాయ సంబంధిత అవసరాలకు ట్రక్కుల కోసం అధికంగా డీజిల్‌ను వినియోగించినట్లు పేర్కొన్నాయి.

* వంట గ్యాస్‌ ఎల్‌పీజీ విక్రయాలు 7.8 శాతం వృద్ధితో 2.55 మి.టన్నులకు చేరాయి. 2020 నవంబరుతో పోలిస్తే 8.4 శాతం, 2019 నవంబరుతో పోలిస్తే 13.3 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. 2022 అక్టోబరుతో పోలిస్తే 7.07 శాతం వినియోగం పెరిగి 2.39 మి.టన్నులకు చేరింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని