సంక్షిప్త వార్తలు (7)
మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను జనవరి నుంచి పెంచాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు శుక్రవారం పేర్కొంది.
మారుతీ కార్ల ధరల పెంపు
దిల్లీ: మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను జనవరి నుంచి పెంచాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు శుక్రవారం పేర్కొంది. ముడి పదార్థాల వ్యయాలు పెరిగినందున ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు, ఏప్రిల్ 2023 నుంచి కఠిన ఉద్గార బీఎస్-6 ప్రమాణాలను చేరుకునేందుకు ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. అన్ని మోడళ్లపై ధరలు పెరుగుతాయని ప్రకటించినా, పెంపు ఏ మేరకు ఉంటుందనేది వెల్లడించలేదు.
* నవంబరు నెలలో వాహనాల ఉత్పత్తి 5 శాతం మేర పెరిగి 1,52,786కు చేరినట్లు మారుతీ తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో వాహనాల ఉత్పత్తి 1,45,560గా నమోదైందని పేర్కొంది.
మహీంద్రా.. 19,000 వాహనాలు వెనక్కి
దిల్లీ: ఎక్స్‌యూవీ700, స్కార్పియో-ఎన్ వాహనాల్లో బెల్ హౌసింగ్లోని రబ్బర్ విడిభాగాన్ని సవరించేందుకు సుమారు 19,000 వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ఈ ఏడాది జులై 1 నుంచి నవంబరు 11 మధ్య అసెంబుల్ చేసిన 12,566 ఎక్స్‌యూవీ700, 6,618 స్కార్పియో-ఎన్ వాహనాల్లో లోపాన్ని సరిదిద్దాల్సి ఉందని పేర్కొంది. సంబంధిత వినియోగదార్లకు వ్యక్తిగతంగా సమాచారం ఇస్తామని కంపెనీ తెలిపింది.
రూ.300 కోట్లతో ఉత్పత్తి సామర్థ్య పెంపులో టీజీవీ శ్రాక్
ఈనాడు, హైదరాబాద్: పలు రకాలైన ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేసే సంస్థ టీజీవీ శ్రాక్ లిమిటెడ్ (గతంలో శ్రీ రాయలసీమ అల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ లిమిటెడ్) రూ.300 కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించిన విస్తరణ ప్రణాళిక ప్రకారం కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం 270 టన్నుల మేరకు పెరుగుతుంది. అదేవిధంగా క్లోరోమీథేన్ ఉత్పత్తుల సామర్థ్యాన్ని మరో 100 టన్నుల వరకూ పెంచుతారు. ఈ విస్తరణకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోవాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.
ఎస్బీఐ రూ.10,000 కోట్ల సమీకరణ
ముంబయి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన మొట్టమొదటి మౌలిక బాండ్ల జారీ ద్వారా శుక్రవారం రూ.10,000 కోట్లు సమీకరించింది. దేశీయ బ్యాంక్ చేపట్టిన అతిపెద్ద మౌలిక బాండ్ల విక్రయం ఇదే కావడం విశేషం. మౌలిక రంగ, అందుబాటు గృహ విభాగంలో రుణాలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ మౌలిక బాండ్ల ఇష్యూకు 3.27 రెట్ల స్పందన వచ్చిందని, దాదాపు రూ.16,366 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయని, పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని ఇది సూచిస్తోందని ఎస్బీఐ వెల్లడించింది. 10 ఏళ్ల గడువు ఉండే ఈ బాండ్లకు 7.51 శాతం వార్షిక వడ్డీని ఎస్బీఐ చెల్లించనుంది. దేశానికి, ఎస్బీఐకు మౌలిక రంగ అభివృద్ధి చాలా కీలకమైన అంశమని, తాజా బాండ్ల విక్రయం ఇందుకు దోహదపడుతుందని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖరా పేర్కొన్నారు.
రేట్ల పెంపు తగ్గించాలి
ఆర్బీఐని కోరిన అసోచామ్
దిల్లీ: ఈ ఏడాది మే నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 190 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేటును పెంచింది. ఇకపై రేట్ల పెంపును తగ్గించాలని పరిశ్రమ సమాఖ్య ఆర్బీఐని కోరింది. లేదంటే ఆర్థిక వ్యవస్థ రికవరీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 3 రోజుల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమై నిర్ణయాలు బుధవారం(7న) వెలువడనున్నాయి. కొత్త రేటు పెంపు గరిష్ఠంగా 25-35 బేసిస్ పాయింట్ల మేర ఉండేలా చూడాలని ఆర్బీఐ గవర్నర్‌కు అసోచామ్ లేఖ రాసింది. పరిశ్రమ ముందున్న పలు సవాళ్లను కూడా అందులో ప్రస్తావించినట్లు సమాచారం.
* విద్యుత్ వాహనాల కొనుగోలుకు తీసుకునే రిటైల్ రుణాలను ప్రాధాన్య రంగ రుణాలుగా గుర్తించి తక్కువ వడ్డీ రేటుకే వాటిని అందించేలా చూడాలని అసోచామ్ సూచించింది. సెప్టెంబరు 30న చివరిసారిగా ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతున్నా.. లక్ష్యిత 2-6 శాతం శ్రేణికి ఎగువనే ఇంకా నమోదవుతుండటం గమనార్హం.
గూగుల్ పే, ఫోన్ పేలకు ఊరట
30% పరిమితి నిబంధన గడువు పెంపు
దిల్లీ: డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో 30 శాతం పరిమాణ పరిమితిని (వాల్యూమ్ క్యాప్) పాటించేందుకు డిసెంబరు 31, 2024 వరకు అంటే రెండేళ్లపాటు గడువును పొడిగిస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) శుక్రవారం వెల్లడించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలలో భారీ వాటా(30 శాతానికి మించి)ను కలిగి ఉన్న గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించవచ్చు. మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో 30 శాతానికి మించి ఒక థర్డ్ పార్టీ యాప్ కలిగి ఉండరాదని 2020 నవంబరులో ఎన్పీసీఐ పరిమితి విధించిన సంగతి విదితమే. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పొడిగించారు. తాజాగా మళ్లీ రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఎన్పీసీఐ తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది.
సీసీఎల్ ప్రోడక్ట్స్ బోర్డులో అమూల్ మాజీ ఎండీ
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీసీఎల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌లో అమూల్ మాజీ ఎండీ భరత్‌కుమార్ మహేంద్రభాయ్ వ్యాస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని సీసీఎల్ ప్రోడక్ట్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సీసీఎల్ ప్రోడక్ట్స్ ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తి, ఎగుమతి కార్యకలాపాల్లో నిమగ్నమైన విషయం తెలిసిందే. భరత్ కుమార్ దాదాపు 39 ఏళ్ల పాటు అమూల్‌లో పనిచేశారు. ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)లో డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. ఆయనకు ఉన్న విశేష అనుభవం, నాయకత్వ లక్షణాల దృష్ట్యా తమ బోర్డులోకి డైరెక్టర్‌గా తీసుకున్నట్లు సీసీఎల్ ప్రోడక్ట్స్ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!