భారత విపణిలో స్మార్ట్‌ టీవీలదే ‘ఠీవి’

భారత టీవీల విపణిలో స్మార్ట్‌ టీవీల హవా కొనసాగుతోంది. జులై- సెప్టెంబరు త్రైమాసికంలో వీటి సరఫరాలు 38 శాతం పెరిగాయి.

Published : 03 Dec 2022 01:49 IST

జులై- సెప్టెంబరులో 38% పెరిగిన సరఫరాలు

32- 42 అంగుళాల టీవీలకే అధిక ఆదరణ  

భారత టీవీల విపణిలో స్మార్ట్‌ టీవీల హవా కొనసాగుతోంది. జులై- సెప్టెంబరు త్రైమాసికంలో వీటి సరఫరాలు 38 శాతం పెరిగాయి. పండగ సీజను, కొత్త మోడళ్ల విడుదల, డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు లాంటివి ఇందుకు దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. భారత స్మార్ట్‌ టీవీ విభాగంలో ఇతర అంతర్జాతీయ బ్రాండ్లు అత్యధికంగా 40 శాతం వాటాను కలిగి ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో 38 శాతం వాటాతో చైనా బ్రాండ్లు ఉన్నాయి. భారత బ్రాండ్ల సరఫరాలోనూ వేగవంత వృద్ధి కనిపిస్తోందని నివేదిక వివరించింది. వీటి వాటా రెట్టింపై 22 శాతానికి చేరినట్లు తెలిపింది. ‘చిన్న టీవీల వాటా పెరుగుతోంది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 32-42 అంగుళాల స్మార్ట్‌ టీవీల సరఫరా ఎక్కువగా ఉంది. ఎల్‌ఈడీ డిస్‌ప్లే టీవీల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నప్పటికీ.. ఓఎల్‌ఈడీ, క్యూఎల్‌ఈడీ లాంటి అధునాతన సాంకేతికత డిస్‌ప్లే టీవీలకు ఆదరణ పెరుగుతోంద’ని నివేదిక వివరించింది. క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లేతో మరిన్ని మోడళ్లు విడుదల అవుతాయని తెలిపింది. డాల్బీ ఆడియా, అత్యుత్తమ స్పీకర్‌లు లాంటి ఇతర ప్రత్యేకతలను కూడా ఆయా బ్రాండు సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయని పేర్కొంది.

సమీక్షా త్రైమాసికంలో మొత్తం సరఫరాలో స్మార్ట్‌ టీవీల వాటా రికార్డు స్థాయైన 93 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. రూ.20,000 లోపు ధరల శ్రేణిలో మరిన్ని మోడళ్లు వస్తే.. ఈ వాటా పెరిగే అవకాశం ఉందని వివరించింది.

మొత్తం సరఫరాలో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల వాటా 35 శాతానికి పెరిగింది. ప్రధాన ఇ-కామర్స్‌ సంస్థలన్నీ ఇటీవలి పండగ సీజను సమయంలో ప్రోత్సాహకాలు, డిస్కౌంట్లను అందించడం ఇందుకు తోడ్పడింది.

జులై- సెప్టెంబరులో స్మార్ట్‌టీవీ విపణిలో షియోమీ బ్రాండు 11 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో శామ్‌సంగ్‌ (10%), ఎల్‌జీ (9%) ఉన్నాయి.

ఏడాదిక్రితంతో పోలిస్తే వన్‌ప్లస్‌ టీవీల సరఫరాల్లో 89 శాతం వృద్ధి ఉండగా.. మొత్తం స్మార్ట్‌టీవీల సరఫరాలో 8.5 శాతం వాటాను సొంతం చేసుకుంది.

దేశీయ బ్రాండ్‌ అయిన వీయూ సరఫరాల వాటా రెట్టింపునకు పైగా పెరిగింది. అత్యధిక పోటీ ఉండే స్మార్ట్‌టీవీ విపణిలోకి అడుగు పెట్టేందుకు పలు కొత్త దేశీయ బ్రాండ్లు ఆసక్తిని కనబరుస్తున్నాయని నివేదిక వివరించింది.

స్మార్ట్‌టీవీల విభాగంలో వన్‌ప్లస్‌, వీయూ, టీసీఎల్‌లు అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లు అని నివేదిక పేర్కొంది. రియల్‌మీ, హయర్‌ కూడా అత్యుత్తమ 10 బ్రాండ్లలో స్థానం సంపాదించాయి.

కొత్త మోడళ్లు.. అది కూడా రూ.20,000- 30,000 ధరల శ్రేణిలో విడుదల చేయడం ద్వారా ఎల్‌జీ మళ్లీ మూడో స్థానాన్ని పొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని