పెట్రోల్‌, డీజిల్‌ నష్టాలకు పరిహారం ఇవ్వండి

గత 8 నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచకపోవడం వల్ల వాటిల్లిన నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖను చమురు మంత్రిత్వ శాఖ కోరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 03 Dec 2022 01:50 IST

ఆర్థిక శాఖను కోరనున్న చమురు శాఖ

దిల్లీ: గత 8 నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచకపోవడం వల్ల వాటిల్లిన నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖను చమురు మంత్రిత్వ శాఖ కోరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముడి వస్తువుల ధరలు భారీగా పెరగడంతో కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- సెప్టెంబరులో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)లు సంయుక్తంగా రూ.21,201.18 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించాయి. గత కొన్నేళ్లకు సంబంధించి కంపెనీలకు రూ.22,000 కోట్ల ఎల్‌పీజీ రాయితీ బకాయిలు రావాల్సి ఉంది. ఖాతాల్లో వీటిని పరిగణించకపోయి ఉండినట్లయితే నష్టాలు మరింత పెరిగేవి. ఇంధన ధరలను యథాతథంగా కొనసాగించడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల ఆగిందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందిందని, దీంతో నష్టపోయిన చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని ఒక అధికారి పేర్కొన్నారు. ‘పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎటువంటి నియంత్రణ లేదు. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా రోజువారీగా ధరలను నిర్ణయించే స్వేచ్ఛ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఉంది. అయితే ధరలను పెంచరాదని కంపెనీలు సొంతంగా నిర్ణయం తీసుకున్నాయి’ అని అన్నారు.

ఆర్థిఖ శాఖను పరిహారం కోరే ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వాటిల్లే నష్టాలను చమురు శాఖ లెక్కకట్టనుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ ఇంధన విక్రయాలపై మూడు కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ ధరలు దశాబ్దానికి పైగా గరిష్ఠానికి చేరినప్పటికీ.. ఏప్రిల్‌ 6 నుంచి ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.

2020 జూన్‌ నుంచి రెండేళ్లలో వంటగ్యాస్‌ను రాయితీపై విక్రయించడం వల్ల వచ్చిన నష్టాలకు ప్రభుత్వం అక్టోబరులో రూ.22,000 కోట్ల సాయాన్ని మంజూరు చేసింది. చమురు శాఖ రూ.28,000 కోట్లు కోరినప్పటికీ.. రూ.22,000 కోట్లు మాత్రమే వచ్చాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు