విద్యుత్‌ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్‌ ఎదగొచ్చు

విద్యుత్‌ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అవతరించే సామర్థ్యం భారత్‌కు ఉందని బెర్కెలీ నేషనల్‌ లేబొరేటరీ, యూసీఎల్‌ఏ (యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌) తమ పరిశోధనా నివేదికలో వెల్లడించాయి.

Published : 04 Dec 2022 02:39 IST

బెర్కెలీ- యూసీఎల్‌ఏ విశ్లేషణ

వాషింగ్టన్‌: విద్యుత్‌ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అవతరించే సామర్థ్యం భారత్‌కు ఉందని బెర్కెలీ నేషనల్‌ లేబొరేటరీ, యూసీఎల్‌ఏ (యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌) తమ పరిశోధనా నివేదికలో వెల్లడించాయి. డీజిల్‌తో నడిచే ట్రక్కుల నుంచి విద్యుత్‌ ఛార్జింగ్‌ ట్రక్కుల వైపు మారడం ద్వారా.. 2070 కల్లా శూన్య ఉద్గార లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్‌ మరింత వేగంగా అడుగులు వేయగలుగతుందని పేర్కొన్నాయి. భారత్‌ తన ఇంధన అవసరాల్లో 88 శాతం వరకు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశీయ రవాణా రంగం వినియోగించే మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల్లో సుమారు 60 శాతం వరకు రవాణా ట్రక్కులే వాడుతున్నాయని నివేదిక వివరించింది. డీజిల్‌తో పోలిస్తే విద్యుత్‌ ట్రక్కుల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుందని పేర్కొంది. విద్యుత్‌ వాహనాలకు మారడం ద్వారా చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, గాలి నాణ్యత మెరుగై, 2070 కల్లా శూన్య ఉద్గార లక్ష్యాన్ని సాధించడం భారత్‌కు వీలవుతుందని నివేదిక విశ్లేషించింది. భారత ఇంధన భద్రత మెరుగయ్యేందుకు, వస్తు రవాణా వ్యయం తగ్గేందుకు విద్యుత్తు ట్రక్కులు దోహదం చేస్తాయని బెర్కెలీ ల్యాబ్‌ పరిశోధన శాస్త్రవేత్త నికిత్‌ అభ్యాంకర్‌ తెలిపారు. డీజిల్‌ ట్రక్కుల కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తుతం కిలోమీటరుకు 35 శాతంగా ఉండగా.. విద్యుత్‌ ట్రక్కులతో 9 శాతానికి తగ్గుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని