నిఫ్టీ-500 సంస్థల్లో 18% నారీశక్తి: ఐఐఏఎస్‌

కంపెనీల బోర్డుల్లో లింగ వైవిధ్యం నెమ్మదిగా పెరుగుతోందని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌) నివేదిక వెల్లడించింది.

Published : 04 Dec 2022 02:40 IST

దిల్లీ: కంపెనీల బోర్డుల్లో లింగ వైవిధ్యం నెమ్మదిగా పెరుగుతోందని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌) నివేదిక వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈలో నమోదైన అగ్రశ్రేణి 500 కంపెనీల బోర్డుల్లో ఈ ఏడాది మార్చి నాటికి మహిళా డైరెక్టర్ల సంఖ్య 18 శాతానికి చేరినట్లు వెల్లడించింది. ‘కార్పొరేట్‌ ఇండియా: వుమెన్‌ ఆన్‌ బోర్డ్స్‌’ పేరుతో ఐఐఏఎస్‌ చేసిన అధ్యయనంలోని అంశాలు ఇలా..

* అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్‌ బోర్డు రూముల్లో మహిళా ప్రాతినిధ్యం సరాసరిన 24 శాతానికి చేరింది. భారత్‌లోనూ కంపెనీ బోర్డుల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
* భారత్‌లో 2014లో చూస్తే బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు 6 శాతమే. 2019కి 14 శాతానికి చేరింది. ప్రస్తుతం నిఫ్టీ-500 కంపెనీల్లో మహిళా డైరెక్టర్ల వాటా 17.6 శాతానికి చేరింది.
* మహిళా డైరెక్టర్లు పెరుగుతున్నా, కొత్త నియామకాలు గత మూడేళ్ల నుంచి 1 శాతమే వృద్ధి చెందాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారత్‌లో లింగ వైవిధ్యం 30 శాతం లక్ష్యానికి చేరడానికి 2058 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
* ఈ ఏడాది మార్చి ఆఖరుకు నిఫ్టీ-500 కంపెనీల్లో 4,694 మంది డైరెక్టర్లు ఉండగా, అందులో 827 మంది (17.6 శాతం) మహిళలు ఉన్నారు.
* అంతర్జాతీయ సరాసరి కంటే మెరుగ్గా ఐరోపా, ఉత్తర అమెరికాల్లో 34.4 శాతం, 28.6 శాతం చొప్పున మహిళా డైరెక్టర్లున్నారు. దేశం వారీగా చూస్తే ఫ్రాన్స్‌ 2021లో ఏకంగా 44.5 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.
* 2022 మార్చి 31 నాటికి నిఫ్టీ-500 కంపెనీల బోర్డుల్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళా డైరెక్టర్లు ఉన్న కంపెనీలు 48.6 శాతం ఉన్నాయి. 2021 మార్చి 31 నాటికి 45 శాతంగానే ఉన్నాయి. 2020 మార్చి 31 నాటికి 44 శాతంగా ఉన్నాయి.
* 159 కంపెనీల బోర్డుల్లో ఏకంగా 20 శాతం పైనే మహిళా డైరెక్టర్ల వాటా ఉంది. 2021లో ఈ సంఖ్య 146గా ఉంది.
* బోర్డుల్లో మహిళల సగటు వయసు 58.7 సంవత్సరాలుగా ఉంది. 2020లో సగటు వయసు 56 ఏళ్లు. పురుషుల సగటు వయసు 62.3 ఏళ్లు (2020లో వీరి సగటు వయసు 61 ఏళ్లు).
* బోర్డుల్లో మహిళలే ఛైర్‌పర్సన్లుగా ఉన్న నిఫ్టీ-500 కంపెనీలు 22. సీఈఓలుగా 25 మంది, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల హోదాలో 62 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని