రెండేళ్లలో రూ.81,000 కోట్ల పెట్టుబడులు

2020 ప్రారంభం నుంచి దేశంలో డేటా కేంద్రాల్లో ఏర్పాటుకు 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.81,000 కోట్ల) పెట్టుబడులు వచ్చాయని స్థిరాస్తి సలహాదారు కొలియర్స్‌ ఇండియా నివేదిక పేర్కొంది.

Published : 04 Dec 2022 02:40 IST

డేటా కేంద్రాలపై కొలియర్స్‌ ఇండియా నివేదిక

దిల్లీ: 2020 ప్రారంభం నుంచి దేశంలో డేటా కేంద్రాల్లో ఏర్పాటుకు 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.81,000 కోట్ల) పెట్టుబడులు వచ్చాయని స్థిరాస్తి సలహాదారు కొలియర్స్‌ ఇండియా నివేదిక పేర్కొంది. దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరగడంతో, డేటా కేంద్రాలకు గిరాకీ అధికమైందని వెల్లడించింది. ‘డేటా సెంటర్‌: స్కేలింగ్‌ అప్‌ ఇన్‌ గ్రీన్‌ ఏజ్‌’ పేరిట ఈ నివేదికను వెలువరించారు. ప్రస్తుతం భారత డేటా కేంద్రాల సామర్థ్యం 10.3 మిలియన్‌ చదరపు అడుగులు కాగా.. 2025కు ఈ సామర్థ్యం రెట్టింపై, 20 మిలియన్‌ చదరపు అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఏడు అగ్రగామి నగరాలు- ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్‌కతాల్లో దాదాపు 770 మెగావాట్‌ డేటా కేంద్రాల సామర్థ్యం ఉంది. గత రెండేళ్లలో డిజిటలీకరణ, క్లౌడ్‌ వినియోగం ద్వారా డేటా వినియోగం పెరిగిందని, రాష్ట్రాలు రాయితీపై భూమి, స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలతో డేటా కేంద్రాల నిర్వాహకులను ఆకర్షిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

* ముంబయిలో ఎక్కువ సంఖ్యలో డేటా కేంద్రాలు (49 శాతం) ఉన్నాయి. ల్యాండింగ్‌ స్టేషన్‌, సబ్‌మెరైన్‌ కేబుల్‌ అనుసంధానత ఇందుకు దోహదపడుతున్నాయి. దిల్లీ-ఎన్‌సీఆర్‌ (17 శాతం), బెంగళూరు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
* భారత్‌కు విస్తరించాలని అంతర్జాతీయ డేటా కేంద్రాల ఆపరేటర్లు చూస్తున్నారు. కార్పొరేట్లు, స్థిరాస్తి డెవలపర్లు, ప్రైవేట్‌-ఈక్విటీ ఫండ్ల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. అధిక డేటా వినియోగం, సానుకూల ప్రభుత్వ విధానాలతో గత 2-3 ఏళ్లలో ఈ రంగంలోకి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.
* అత్యవసర సమయాల్లో రికవరీ సైట్లుగా వాడుకునే ఎడ్జ్‌ డేటా సెంటర్లు నెలకొల్పేందుకు విజయవాడ, నాగ్‌పుర్‌, రాయ్‌పుర్‌, కోచి, పట్నా, మంగళూరు వంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారని నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని