రూ.23 లక్షల కోట్లు కావాలంట!

దేశమంతా ప్రస్తుతం నడిచే ద్విచక్ర, త్విచక్ర వాహనాల స్థానంలో పూర్తిగా విద్యుత్‌తో నడిచే వాహనాలు సమకూర్చుకోవాలంటే 285 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.23 లక్షల కోట్లు) నిధులు అవసరం అవుతాయని నీతి ఆయోగ్‌, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన నివేదిక అంచనా వేసింది.

Published : 04 Dec 2022 02:43 IST

దేశమంతా విద్యుత్‌ ద్వి, త్రిచక్ర వాహనాలకు మారేందుకు
రైడ్‌ హైలింగ్‌, సరకు రవాణా విభాగాలే ముందు
నీతిఆయోగ్‌, డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక

దిల్లీ: దేశమంతా ప్రస్తుతం నడిచే ద్విచక్ర, త్విచక్ర వాహనాల స్థానంలో పూర్తిగా విద్యుత్‌తో నడిచే వాహనాలు సమకూర్చుకోవాలంటే 285 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.23 లక్షల కోట్లు) నిధులు అవసరం అవుతాయని నీతి ఆయోగ్‌, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన నివేదిక అంచనా వేసింది. విద్యుత్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు మారడంలో పట్టణాల్లో వినియోగదార్లకు సరకు రవాణా చేసే వాహన విభాగాలు ముందు వరుసలో ఉన్నాయని పేర్కొంది. ‘విద్యుత్తు వాహనాల అధిక ధర, కొత్త సాంకేతికతలపై నమ్మకం లేకపోవడం, వినియోగించే వాహనాన్ని అమ్మాలంటే ఎంత విలువ వస్తుందనే  అస్పష్టత’ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల కోసం కొనాలనుకునే వారు కూడా వెనుకాడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వాహన విక్రయాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా 70 శాతానికి పైగా ఉంటుంది. 

వృద్ధికి అపార అవకాశాలు

ప్రస్తుతం దేశంలో విద్యుత్తు ద్వి, త్రిచక్ర వాహనాలకు సంబంధించి 45 సర్టిఫైడ్‌ తయారీ సంస్థలున్నాయి. ఈ విభాగ వాహన అమ్మకాలు ఇప్పటివరకు 10 లక్షలను మించాయి. దేశం మొత్తం మీద చూస్తే ద్వి, త్రిచక్ర వాహనానాలు 25 కోట్ల మేర ఉంటాయని అంచనా. ఈ సంఖ్యతో పోలిస్తే, విద్యుత్‌ వాహనాల వాటా ప్రస్తుతం చాలా స్వల్పం. అయితే ఈ విభాగంపై నమ్మకం కుదిరితే, విక్రయాలకు అపార అవకాశాలు లభిస్తాయి. దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 100 శాతం విద్యుదీకరణ సాధించేందుకు 285 బిలియన్‌ డాలర్లు ఎందుకు అవసరం అవుతాయో కూడా డబ్ల్యూఈఎఫ్‌ వివరించింది.

ఖర్చుపై అంచనా ఇలా

* ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ప్రజల ఆదాయాలు, వాహన యజమానుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ద్వి, త్రిచక్ర వాహనాల సంఖ్య 27 కోట్లకు చేరుతుంది. విద్యుత్తు వాహనం కొనేందుకు ద్విచక్ర వాహనానికి సగటున 1000 డాలర్లు లేదా రూ.81,000, త్రిచక్ర వాహనానికి సగటున 3,500 డాలర్ల (రూ.2.8 లక్షలు) పెట్టుబడి అవుతుంది. ఈ లెక్కన 26.4 కోట్ల ద్విచక్ర వాహనాలు, 60 లక్షల త్రిచక్ర వాహనాల (ఇ-రిక్షాలతో కలిపి) కొనుగోలుకు రూ.23 లక్షల కోట్లు అవుతుందని నివేదిక వివరించింది.
* ఇవే కాకుండా ఛార్జింగ్‌ స్టేషన్ల లాంటి మౌలిక వసతుల ఏర్పాటు కోసం మరిన్ని నిధులు అవసరం అవుతాయని తెలిపింది. విద్యుత్‌ వాహనాల ధర ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. వాటి నిర్వహణ వ్యయం తక్కువగానే ఉంటుంది. అందుకే అద్దె (రైడ్‌ హైలింగ్‌), రవాణా (లాస్ట్‌ మైల్‌ డెలివరీ) కోసం పనిచేసే సంస్థలు విద్యుత్‌ వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు నివేదిక వివరించింది. విద్యుత్‌ వాహనాల విభాగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దీర్ఘకాలిక విధానం, మార్గసూచీ అవసరమని విశదీకరించింది. విద్యుత్‌ వాహనాలకు మారేందుకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం కల్పించడం అత్యంత ముఖ్యమని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని