జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రూ.1,250 కోట్ల నిధుల సమీకరణ

జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) మార్పిడి రహిత డిబెంచర్లు (ఎన్‌సీడీ) జారీ చేయడం ద్వారా రూ.1,250 కోట్ల నిధుల్ని సమీకరించే ప్రణాళికలో ఉన్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.

Published : 05 Dec 2022 03:43 IST

హైదరాబాద్‌: జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) మార్పిడి రహిత డిబెంచర్లు (ఎన్‌సీడీ) జారీ చేయడం ద్వారా రూ.1,250 కోట్ల నిధుల్ని సమీకరించే ప్రణాళికలో ఉన్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఈ నిధుల్ని 2024 ఏప్రిల్‌ లేదా 2026 ఫిబ్రవరిలో గడువు తీరబోయే అమెరికా డాలర్‌ బాండ్లకు ముందస్తుగా చెల్లింపులు చేసేందుకు వినియోగించే అవకాశం ఉందని తెలిపింది. 2022 సెప్టెంబరు 30 నాటికి జీహెచ్‌ఐఏఎల్‌కు (అనుబంధ సంస్థలతో కలిపి) రూ.7,050 కోట్ల రుణాలున్నాయి. ఇందులో 950 మిలియన్‌ డాలర్ల బాండ్లు ఉన్నాయి. ఇవి 2024 ఏప్రిల్‌, 2026 ఫిబ్రవరి, 2027 అక్టోబరులో గడువు తీరనున్నాయని ఇండియా రేటింగ్స్‌ వివరించింది. ప్రతిపాదిత రూ.1,250 కోట్ల ఎన్‌సీడీలకు ఇండ్‌ ఏఏ/స్టేబుల్‌ రేటింగ్‌ను ఇచ్చింది.

* జీహెచ్‌ఐఏఎల్‌ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయానికి 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉండగా, దీన్ని 3.4 కోట్లకు చేర్చాలని భావిస్తోంది. 2023 మార్చి నాటికి విస్తరణ కార్యకలాపాలు పూర్తవుతాయని తెలుస్తోంది. టెర్మినల్‌ విస్తరణకు రూ.6,600 కోట్ల మేర మూలధనాన్ని వెచ్చిస్తోంది. ఇందులో రూ.4,530 కోట్లు రుణాలు ఉన్నాయి.

* 2022 అక్టోబరు నాటికి హైదరాబాద్‌ విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు కొవిడ్‌ పూర్వంతో (2019 అక్టోబరు) పోలిస్తే వరుసగా 95 శాతం, 82 శాతానికి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని