సంక్షిప్త వార్తలు (6)
కార్యాలయ స్థలాల రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ద్వారక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంకురాల కోసం మాదాపూర్‌లో కొత్త కో-వర్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది.
అంకురాల కోసం ద్వారక ప్రైడ్ కో-వర్కింగ్ కార్యాలయం
ఈనాడు, హైదరాబాద్: కార్యాలయ స్థలాల రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ద్వారక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంకురాల కోసం మాదాపూర్‌లో కొత్త కో-వర్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. 620 సీట్లు ఉన్న ద్వారక ప్రైడ్ ప్రారంభంతో మొత్తం 13 ప్రాజెక్టులు, 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి తెలిపారు. కంపెనీ డైరెక్టర్ దీప్నా రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. స్విగ్గీ, తాన్లా, మెడికవర్ హాస్పిటల్స్, ష్నైడర్, రామ్‌ఇన్ఫో వంటి 100కు పైగా కంపెనీల కార్యాలయాలు ద్వారకా ప్రాజెక్టుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. 2024 నాటికి ఆరు కొత్త ప్రాజెక్టులను 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభిస్తామని, దీంతో మొత్తం 5.2 లక్షల చ.అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో మరో 4,500 సీట్ల సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించారు. ఐటీ రంగంలోని సంస్థలకు అనువైన విధంగా సీట్లను సర్దుబాటు చేస్తున్నామని దీప్నా రెడ్డి తెలిపారు. మహిళా వ్యవస్థాపకులకు రాయితీలనూ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారి కాలంలో హైదరాబాద్ ఆఫీసు స్థలాలకు గిరాకీ తగ్గినా, ఇప్పుడు హైబ్రిడ్ పని విధానం వల్ల ఐటీతో పాటు ఇతర సంస్థలూ కో-వర్కింగ్ కేంద్రాల వైపు మొగ్గు చూపిస్తున్నాయని తెలిపారు.
భారత్ బయోటెక్- ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ లావాదేవీకి సీసీఐ అనుమతి
దిల్లీ: షేరు కొనుగోలు ఒప్పందం ద్వారా ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఈఈజీసీ)లో షేర్లను భారత్ బయోటెక్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. పోటీతత్వంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపే ముప్పు లేకపోవడంతో ఈ లావాదేవీకి ‘గ్రీన్ చానెల్’ మార్గంలో సీసీఐ అనుమతి ఇచ్చింది. సీసీఐ వెబ్‌సైట్‌లో ఈ అనుమతి అంశాన్ని ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్.. టీకాలు, బయోథెరపాటిక్స్ తయారీలో ఉండగా; ఈఈజీసీ విషయానికొస్తే యార్న్, ఫ్యాబ్రిక్, దుస్తుల వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్‌లో 14.45% వాటా విక్రయం
దిల్లీ: బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పీఎల్‌సీ (గతంలో సీడీసీ గ్రూప్ పీఎల్‌సీ) సోమవారం రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్‌లో 14.45% వాటాను విక్రయించింది. బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా జరిగిన ఈ విక్రయ విలువ రూ.1,078 కోట్లు. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు), దేశీయ మ్యూచువల్ ఫండ్ ఈ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ బల్క్ డీల్ డేటా ప్రకారం తెలుస్తోంది. సగటున ఒక్కో షేరును రూ.735-735.55 ధరతో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ విక్రయించింది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ షేరు 1.75% క్షీణించి రూ.750.75 వద్ద ముగిసింది.
3 నెలల గరిష్ఠానికి సేవల పీఎంఐ
నవంబరులో 56.4 పాయింట్లు
దిల్లీ: భారత సేవల రంగం నవంబరులో 3 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) గత నెలలో 56.4 పాయింట్లుగా నమోదైంది. అక్టోబరులో ఇది 55.1 పాయింట్లుగా ఉంది. గత 16 నెలలుగా ఈ రంగ పీఎంఐ 50 పాయింట్ల పైనే నమోదవుతోంది. పీఎంఐ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, కింద ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ‘దేశీయంగా బలమైన గిరాకీ ఉండడం, కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిలో వేగం, సేవల రంగంలో ఉద్యోగాల సృష్టి వంటివి పీఎంఐ పెరగడానికి దోహదం చేశాయ’ని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనామిక్స్ అసోసియేట్ పాలియానా డి లిమా వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఎంజీ మోటార్స్ కమ్యూనిటీ ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మూడు ప్రదేశాల్లో కమ్యూనిటీ ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఎంజీ మోటార్ ఇండియా ప్రారంభించింది. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలైన ఎన్‌సీసీ అర్బన్ వన్, రెయిన్‌బో విస్టాస్, మైహోమ్ జ్యూవెల్ ఈ కేంద్రాలను నెలకొల్పింది. ‘ఎంజీ ఛార్జి’ అనే కార్యక్రమంలో వీటిని ఏర్పాటు చేసినట్లు ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించింది. విద్యుత్తు వాహనాలకు ఆదరణ కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఇప్పటికే జీయో-బీపీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేగాక వివిధ ప్రదేశాల్లో ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తోంది. ఎంజీ మోటార్ ఇండియా గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న యూనిట్లో కార్లు ఉత్పత్తి చేస్తోంది. ఎంజీ హెక్టర్, ఎంజీ జడ్‌ఎస్ ఈవీ, ఎంజీ గ్లోస్టర్ మోడళ్లను వినియోగదార్లకు అందిస్తోన్న సంగతి తెలిసిందే.
* జులై-సెప్టెంబరు 2022లో రూ.38.32 లక్షల కోట్ల విలువైన 2300 కోట్ల డిజిటల్ చెల్లింపు లావాదేవీలు జరిగినట్లు ఫిన్‌టెక్ సంస్థ వరల్డ్‌లైన్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది.
* బహిరంగ విపణిలో 1.2 లక్షల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీలో తన వాటాను 5.003 శాతానికి ఎల్‌ఐసీ చేర్చుకుంది.
* ఎస్‌బీఐ పర్సనల్ బ్యాంకింగ్ రుణాలు (అధిక విలువ గృహ రుణాలు మినహా) రూ.5 లక్షల కోట్ల స్థాయిని అధిగమించాయని ఛైర్మన్ దినేశ్ కుమార్ వెల్లడించారు.
* భారత్‌లో 2023 జూన్ నాటికి మరో 200 మంది ఉద్యోగులను నియమించుకుంటామని లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డ్ ముఖ్య సాంకేతిక అధికారి (సీటీఓ) ప్రదీప్ దేశాయ్ వెల్లడించారు.
* బయోకాన్ బయోలాజిక్స్ ఎండీ, సీఈఓగా శ్రీహాస్ తంబేను నియమితులయ్యారు..
* 450 మెగావాట్ల సామర్థ్యంతో మూడో హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్‌ను రాజస్థాన్‌లో ఏర్పాటు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ఎనర్జీ వెల్లడించింది.
* జేఎస్‌డబ్ల్యూ రీన్యూ ఎనర్జీ 450 మెగావాట్ల పవన ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో తమిళనాడులో 27 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది.
* డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, అతని సోదరుడు ధీరజ్‌లకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు చేయడంపై సీబీఐ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
* ఎండీగా వినోద్ ఆర్.తంతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గిరీశ్ ఆర్.తంతి, డైరెక్టర్‌గా ప్రణవ్ టి.తంతిల నియామకానికి వాటాదార్ల అనుమతి తీసుకోవాలని సుజ్లాన్ ఎనర్జీ బోర్డు నిర్ణయించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు
-
Politics News
Mekapati Chandrasekhar Reddy: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత
-
India News
Modi: ‘బ్లూ జాకెట్’తో ‘గ్రీన్’ మెసేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ..!
-
World News
Chinese Spy Balloon: భారత్‌పై చైనా బెలూన్ గూఢచర్యం..!