టెలికాం మౌలిక వసతుల రంగంలోకి మెటా

సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్‌, దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌లు సంయుక్తంగా టెలికాం మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సోమవారం ప్రకటించాయి.

Published : 06 Dec 2022 04:07 IST

ఎయిర్‌టెల్‌తో కలిసి పెట్టుబడులు

దిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్‌, దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌లు సంయుక్తంగా టెలికాం మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సోమవారం ప్రకటించాయి. దేశంలో అధిక వేగంతో కూడిన డేటా, డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న గిరాకీని అందుకునేందుకు ఈ పెట్టుబడులు వినియోగిస్తామని తెలిపాయి. నెట్‌వర్క్‌లను నిర్మించడానికి సర్వీస్‌ ప్రొవైడర్లతో ఆదాయాన్ని పంచుకోవాలని టెలికాం ఆపరేటర్ల డిమాండ్‌ నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ఎయిర్‌టెల్‌, మెటా సంయుక్తంగా అంతర్జాతీయ అనుసంధానిత మౌలిక వసతులు, సీపాస్‌ (కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫామ్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) ఆధారిత కొత్త తరం డిజిటల్‌ పరిష్కారాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపాయి. దేశంలోని వర్థమాన వినియోగదార్లు, సంస్థల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి దోహదం చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా మెటా, ఎస్‌టీసీ (సౌదీ టెలికాం కంపెనీ)లతో ఎయిర్‌టెల్‌ జట్టు కట్టనుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సబ్‌సీ కేబుల్‌ సిస్టమ్‌ 2ఆఫ్రికా పెరల్స్‌ను భారత్‌కు విస్తరించడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేయనుంది. భారత్‌కు 2ఆఫ్రికా పెరల్స్‌ను విస్తరించాలనే ప్రణాళికను మెటా 2021 సెప్టెంబరులోనే ప్రకటించిన సంగతి విదితమే. ఎయిర్‌టెల్‌, మెటా కలిసి ఈ కేబుల్‌ను ఎయిర్‌టెల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ ముంబయి వరకు విస్తరించనున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు