రోజంతా ఒడుదొడుకులు

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షకు ముందు చమురు, ఐటీ, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.

Published : 06 Dec 2022 04:07 IST

సమీక్ష

ద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షకు ముందు చమురు, ఐటీ, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఒపెక్‌ చమురు ఉత్పత్తిలో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో బ్యారెల్‌ ముడిచమురు 87.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 52 పైసలు కోల్పోయి 81.85 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ లాభపడగా, సియోల్‌ నష్టపోయింది. ఐరోపా సూచీలు బలహీనంగా కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,865.28 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఒకదశలో 62,507.88 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 33.90 పాయింట్లు తగ్గి 62,834.60 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 4.95 పాయింట్లు పెరిగి 18,701.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,591.35- 18,728.60 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.46%, టెక్‌ మహీంద్రా 1.33%, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.73%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.61%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.58%, అల్ట్రాటెక్‌ 0.57% చొప్పున నీరసించాయి. టాటా స్టీల్‌ 3.35%, ఎన్‌టీపీసీ 1.66%, ఎస్‌బీఐ 1.58%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.38%, పవర్‌గ్రిడ్‌ 0.96%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.46% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 2.37%, కమొడిటీస్‌, స్థిరాస్తి (0.74%), బ్యాంకింగ్‌ (0.46%), ఆర్థిక సేవలు (0.35%) రాణించాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, టెలికాం, చమురు-గ్యాస్‌, టెక్‌ నిరాశపరిచాయి. బీఎస్‌ఈలో 1567 షేర్లు నష్టాల్లో ముగియగా, 2043 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 184 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

బులెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో ఎల్‌ అండ్‌ టీకి భారీ ఆర్డరు: నేషనల్‌ హై-స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ నుంచి ముంబయి- అహ్మదాబాద్‌ బులెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో మరో ‘భారీ’ ఆర్డరు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. ఇందులో భాగంగా గుజరాత్‌లో దాదాపు 82 హెక్టార్లలో డిపోను ఏర్పాటు చేయనుంది. ఆర్డరు విలువను కంపెనీ ప్రకటించలేదు. అయితే రూ.2500- 5000 కోట్ల శ్రేణిని భారీ ప్రాజెక్టులుగా ఎల్‌ అండ్‌ టీ పరిగణిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని