2024కు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లు

ప్రభుత్వ నియంత్రణలోని సీఎస్‌సీ ఇ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ 2024 ఆఖరుకు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను నిర్మించాలనుకుంటోంది. ఇందుకోసం అక్టోబర్‌ సినిమాస్‌తో జట్టు కట్టినట్లు సోమవారం వెల్లడించింది.

Updated : 06 Dec 2022 10:57 IST

అక్టోబర్‌ సినిమాస్‌తో సీఎస్‌సీ జట్టు
రూ.15 లక్షల పెట్టుబడి చాలు
గ్రామీణ ఆంత్రపెన్యూర్లకు అవకాశాలు

దిల్లీ: ప్రభుత్వ నియంత్రణలోని సీఎస్‌సీ ఇ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ 2024 ఆఖరుకు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను నిర్మించాలనుకుంటోంది. ఇందుకోసం అక్టోబర్‌ సినిమాస్‌తో జట్టు కట్టినట్లు సోమవారం వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ) అయిన సీఎస్‌సీ, అక్టోబర్‌ సినిమాస్‌ మధ్య ఆ మేరకు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు లక్ష సినిమా థియేటర్లను ప్రారంభించనున్నాయి. ఇందులో 100-200 సీట్ల సామర్థ్యం ఉండేలా చూసుకుంటాయి. ఈ ఒప్పంద గడువునకు సంబంధించిన సమయాన్ని స్పష్టం చేయలేదు. ‘గ్రామాల్లో సినిమా హాళ్లు అనే కాన్సెప్ట్‌ ఇంకా కొత్తదే. 100 సీట్లతో చిన్న సినిమా హాళ్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాం. గ్రామ స్థాయి ఆంత్రప్రెన్యూర్లకు (వీఎల్‌ఈలు) ఇది కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. దేశంలో వినోద రంగం దూసుకెళుతోంది. వీఎల్‌ఈలు ఈ రంగ వృద్ధికి గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో మద్దతు ఇస్తారు. సీఎస్‌సీ సినిమా హాళ్లు వాణిజ్య హబ్‌లుగానూ పని చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందిస్తాయ’ని సీఎస్‌సీ ఎండీ సంజయ్‌ కుమార్‌ రాకేశ్‌ వెల్లడించారు. 2023 ఆఖరుకు కనీసం 1500 సినిమా హాళ్లను ప్రారంభించాలని సీఎస్‌సీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2024 డిసెంబరు కల్లా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను నిర్మించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అక్టోబర్‌ సినిమాస్‌ ఎండీ పునీత్‌ దేశాయ్‌ వివరించారు. వీడియో పార్లర్‌ లైసెన్స్‌ ఉన్న ఈ సినిమా హాళ్లను నడపడానికి రూ.15 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని ఆయన వెల్లడించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు