ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గింది: ఖరీదైన మార్కెట్‌గా ముంబయి.. అందుబాటులో హైదరాబాద్‌

రుణాల వడ్డీ రేట్లు, ఇళ్ల ధరల్లో పెరుగుదల కారణంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు స్తోమత స్థాయి క్షీణించిందని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

Updated : 06 Dec 2022 07:50 IST

జేఎల్‌ఎల్‌ నివేదిక

దిల్లీ: రుణాల వడ్డీ రేట్లు, ఇళ్ల ధరల్లో పెరుగుదల కారణంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు స్తోమత స్థాయి క్షీణించిందని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ముంబయి అతి ఖరీదైన మార్కెట్‌గా మారిందని పేర్కొంది. హైదరాబాద్‌, కోల్‌కతా, పుణేల్లో నివాస గృహాల మార్కెట్‌ అందుబాటులోనే ఉందని పేర్కొంది. ‘హోమ్‌ పర్చేజ్‌ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ (హెచ్‌పీఏఐ)’ నివేదికలో ఈ వివరాలను తెలిపింది. సగటు వార్షిక ఆదాయాన్ని ఆర్జించే కుటుంబం ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఆయా నగరాల్లో ఒక ఆస్తిపై ఎంత మేరకు గృహరుణం పొందగలరు అనే విషయాన్ని ఇది సూచిస్తుంది. గృహరుణ వడ్డీ రేట్లు, సగటు కుటుంబ ఆదాయం, నివాస గృహాల ధరల ఆధారంగా స్తోమత సూచీని నిర్ణయిస్తుంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం 1,000 చదరపు అడుగుల ఫ్లాట్‌పై గృహరుణం కోసం అర్హత సాధించేందుకు ఒక కుటుంబం సంపాదించాల్సిన కనీస ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా నిర్వచించింది. 100 విలువ అంటే ఒక కుటుంబానికి రుణం తీసుకునేందుకు సరిపోయే ఆదాయం ఉన్నట్లు అర్థం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే కొనుగోలు శక్తి అంత ఎక్కువగా ఉన్నట్లు. 100కు తక్కువగా ఉంటే.. ఆ కుటుంబానికి రుణం తీసుకునేందుకు కావాల్సినంత ఆదాయం లేదని అర్థం. నివేదిక ప్రకారం హెచ్‌పీఏఐలో కోల్‌కతా 193 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో పుణేలో 183, హైదరాబాద్‌ 174, బెంగళూరు 168, చెన్నై 162, దిల్లీ 125 ఉన్నాయి. ముంబై 92 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. గత ఏడాది ఈ నివేదికలో హైదరాబాద్‌ 196 పాయింట్లతో ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు