అక్టోబరు-మార్చిలో వృద్ధి 4- 4.5 శాతమే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్థంలో దేశీయంగా, అంతర్జాతీయంగా సవాళ్లు పెరగొచ్చని.. దీంతో జీడీపీ వృద్ధి సగానికి పైగా తగ్గి 4- 4.5 శాతానికి పరిమితం కావచ్చని ఇండియా రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది.

Published : 07 Dec 2022 03:46 IST

సవాళ్లు పెరగొచ్చు: ఇండియా రేటింగ్స్‌

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్థంలో దేశీయంగా, అంతర్జాతీయంగా సవాళ్లు పెరగొచ్చని.. దీంతో జీడీపీ వృద్ధి సగానికి పైగా తగ్గి 4- 4.5 శాతానికి పరిమితం కావచ్చని ఇండియా రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. 2022-23 ప్రథమార్థంలో భారత వృద్ధి 9.7 శాతంగా నమోదైంది. జూన్‌ త్రైమాసికంలో 13.5 శాతం, సెప్టెంబరు త్రైమాసికంలో 6.3 శాతం చొప్పున భారత్‌ వృద్ధి చెందింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి వృద్ధి 6.6- 7 శాతంగా నమోదు కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ప్రథమార్థంలో ఆర్థిక రికవరీ మెరుగ్గా, ఆకర్షణీయంగా ఉన్నా.. అధిక ద్రవ్యోల్బణం, బలహీన గిరాకీ వంటి కారణాల వల్ల వృద్ధి అక్టోబరు-మార్చిలో 4- 4.5 శాతానికి తగ్గిపోవచ్చని ఇండియా రేటింగ్స్‌ అభిప్రాయపడింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇండియా రేటింగ్స్‌ అంచనాలు ప్రకటించలేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి, మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత్‌ బలంగా రాణించిందని తెలిపింది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సౌదీ అరేబియా 8.6 శాతం వృద్ధి తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించింది.

* కరోనా సంక్షోభంతో వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయాలంటే భారత్‌ ఇంకా చాలా దూరంలో ఉంది. 2019-20 మొదటి త్రైమాసికం నుంచి 2022-23 రెండో త్రైమాసికం మధ్య వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 2.5 శాతంగా నమోదైంది. 2016-17 రెండో త్రైమాసికం నుంచి 2019-20 రెండో త్రైమాసికం మధ్య సీఏజీఆర్‌ 5.3 శాతం కంటే ఇది చాలా తక్కువ.

* ఇటువంటి పరిస్థితుల్లో కీలక ఉపాధి రంగాలైన తయారీ, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌లు వరుసగా 2 శాతం, 0.7 శాతం వృద్ధి నమోదు చేశాయి. 2016-17 రెండో త్రైమాసికం నుంచి 2019-20 రెండో త్రైమాసికం మధ్య ఇవి 3.4 శాతం, 8.1 శాతం చొప్పున పెరిగాయి.

* వేతనాల వృద్ధి స్తబ్దుగా ఉండటంతో వినియోగదారు గిరాకీపై ప్రభావం పడిందని, స్థిరమైన వృద్ధి గిరాకీ రికవరీ చాలా అవసరమని నివేదిక తెలిపింది. నీ 2022-23 రెండో త్రైమాసికంలో పారిశ్రామికోత్పత్తి 8 త్రైమాసికాల కనిష్ఠమైన 1.5 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది 9.5 శాతంగా ఉంది. చాలా దేశాల్లో వృద్ధి మందగమనంతో ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయని, పారిశ్రామిక రంగాలు ప్రతికూలతలు ఎదుర్కోవచ్చని సంస్థ అంచనా వేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని