ఐడీబీఐ బ్యాంకులో విదేశీకి మెజార్టీ వాటా!

ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతానికి మించి (మెజార్టీ) వాటా కలిగి ఉండేందుకు విదేశీ ఫండ్స్‌, పెట్టుబడుల సంస్థల బృందానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.

Published : 07 Dec 2022 03:59 IST

అనుమతి ఇవ్వనున్న ప్రభుత్వం

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతానికి మించి (మెజార్టీ) వాటా కలిగి ఉండేందుకు విదేశీ ఫండ్స్‌, పెట్టుబడుల సంస్థల బృందానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. కొత్త ప్రైవేట్‌ బ్యాంకులో విదేశీ సంస్థలకు మెజార్టీ ఉండకూడదు. అయితే ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఈ షరతు దీనికి వర్తించదని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) స్పష్టం చేసింది. ఐడీబీఐ బ్యాంకులో ఒక బ్యాంకింగేతర సంస్థను విలీనం చేస్తే.. షేర్లకు అయిదేళ్లపాటు లాక్‌-ఇన్‌ పీరియడ్‌ విధించే విషయంలోనూ సడలింపులు ఇవ్వడాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తోందని సమాచారం.

* ఐడీబీఐ బ్యాంక్‌లో మెజార్టీ వాటా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ కలిగిన సంస్థలు బిడ్‌ దాఖలు చేసేందుకు గడువు (డిసెంబరు 16) దగ్గర పడటంతో, ఈ విధమైన స్పష్టతను ప్రభుత్వం ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం, ఎల్‌ఐసీకి కలిపి 94.71 శాతం వాటా ఉంది. ఇందులో 60.72 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం, ఎల్‌ఐసీ భావిస్తున్నాయి.  

ఆ కార్యకలాపాలు కొనసాగుతాయ్‌: ఐడీబీఐ బ్యాంక్‌లో విదేశీ సంస్థలు మెజార్టీ వాటా కొనుగోలు చేసినప్పటికీ ప్రైమరీ డీలర్‌ (ప్రభుత్వ బాండ్ల క్రయ విక్రయాలు) వ్యాపారాన్ని బ్యాంకు కొనసాగిస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రైమరీ డీలర్‌ కార్యకలాపాల్లో భాగంగా టి-బిల్లులు సహా ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేస్తుంటారు. ఆర్‌బీఐ నమోదిత సంస్థలే వీటిని నిర్వహిస్తాయి. ఐడీబీఐ బ్యాంక్‌ కూడా వీటిల్లో ఉంది.

* విదేశీ సంస్థ విజయవంత బిడ్డర్‌గా నిలిచి.. మెజార్టీ వాటా దక్కించుకున్నప్పటికీ, ఐడీబీఐ బ్యాంక్‌ ‘భారతీయ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌’గానే కొనసాగుతుందని దీపమ్‌ స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు