భారత్‌ వృద్ధి అంచనాలు పైకి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మళ్లీ పెంచింది. జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Published : 07 Dec 2022 04:04 IST

2022-23లో 6.9 శాతం
ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక  

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మళ్లీ పెంచింది. జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్జాతీయ కుదుపుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని బ్యాంకు పేర్కొంది. రెండో త్రైమాసికం వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదుకావడమూ వృద్ధి అంచనాలను సవరించడానికి కారణంగా వివరించింది. 2023-24లో భారత వృద్ధి రేటు కాస్త నెమ్మదించి    6.6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. కాగా.. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత వృద్ధి రేటు అంచనాలను పెంచిన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ ప్రపంచ బ్యాంకు కావడం గమనార్హం. 2022-23కు భారత వృద్ధి రేటు అంచనాను తొలుత   7.5% గా ప్రకటించినా, గత అక్టోబరులో 6.5 శాతానికి ప్రపంచ బ్యాంకు తగ్గించిన సంగతి తెలిసిందే.

ద్రవ్యలోటు లక్ష్యాన్ని భారత్‌ సాధిస్తుంది

ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో  6.4% లోపునకు కట్టడి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించేలా కనిపిస్తోందని ప్రపంచ బ్యాంక్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. పన్నుల వసూళ్లలో బలమైన వృద్ధే ఇందుకు కారణమని పేర్కొంది. ఇంధనంపై పన్ను రేట్లలో కోత విధించినప్పటికీ.. జీఎస్‌టీ వసూళ్ల అండతో తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ జీడీపీ వృద్ధిని భారత్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఎరువులు, ఆహార రాయితీలకు ప్రభుత్వం వ్యయ కేటాయింపులు పెంచినప్పటికీ.. 2022-23లో 6.4% ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుంది. సాధారణ ప్రభుత్వ లోటు 2021-22లోని 10.3 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గుతుంద’ని ప్రపంచబ్యాంకు నివేదిక వివరించింది. ఈ నివేదిక ప్రకారం ..

* 2022-23లో ప్రభుత్వ అప్పు జీడీపీలో 84.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2020-21లో ఇది  87.6 శాతంగా ఉంది.

* కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 9.5 శాతం వృద్ధి ఉండగా.. వ్యయాలు 12.2 శాతం పెరుగుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 2022-23 తొలి అర్ధభాగంలో ద్రవ్యలోటు వార్షిక లక్ష్యంలో 37.3 శాతానికి చేరింది. కిందటేడాది ఇదే సమయంలోని 35 శాతం కంటే ఇది ఎక్కువ.

* 2020-21లో కరెంటు ఖాతా మిగులు ఉండగా... 2021-22లో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.1 శాతానికి చేరింది. 2022-23లో ఇది మరింత పెరగనుంది. దిగుమతులు పెరగడమే ఇందుకు కారణం.

* 2022-23 మొదటి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జీడీపీలో 1.6 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. 2021-22లో ఇవి సగటున 1.2 శాతంగా నమోదయ్యాయి.

* విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు నికరంగా జీడీపీలో 1.7 శాతం మేర వెనక్కి వెళ్లిపోయాయి.

* ఇటీవలి కాలంలో కమొడిటీ ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అదుపులోకి రానున్నాయి.

* ఈ ఏడాదిలో విదేశీ మారకపు నిల్వలు సుమారు 13 శాతం తగ్గినప్పటికీ.. ఎనిమిది నెలలకు సరిపడా దిగుమతుల విలువకు ఇవి సరిపోతాయని తెలిపింది. గత నాలుగు త్రైమాసికాల్లో మొత్తం దిగుమతులను ఆధారంగా చేసుకొని ఈ లెక్కగట్టింది.

* ఇతర వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత రూపాయిపై ఒత్తిడి స్తబ్దుగానే ఉండే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు