‘ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌’కు ‘ఎన్‌ఐఐఎఫ్‌’ పెట్టుబడి

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ- జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌) చేపట్టిన 3 విమానాశ్రయాల ప్రాజెక్టుల్లో, ఎన్‌ఐఐఎఫ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ లిమిటెడ్‌) పెట్టుబడి పెట్టనుంది.

Published : 08 Dec 2022 02:46 IST

గోవా విమానాశ్రయానికి రూ.631 కోట్లు

భోగాపురం, నాగ్‌పూర్‌ విమానాశ్రయాలకూ నిధులు

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ- జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌) చేపట్టిన 3 విమానాశ్రయాల ప్రాజెక్టుల్లో, ఎన్‌ఐఐఎఫ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ లిమిటెడ్‌) పెట్టుబడి పెట్టనుంది. తొలిదశలో గోవా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (మోప)లో రూ.631 కోట్లు పెట్టుబడి సమకూర్చేందుకు ఎన్‌ఐఐఎఫ్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌, ఎన్‌ఐఐఎఫ్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పెట్టుబడి భాగస్వామ్యం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం (విశాఖపట్నం), మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయాలకూ విస్తరించే అవకాశం ఉంది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు ఎన్‌ఐఐఎఫ్‌, కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (సీసీడీ) రూపంలో రూ.631 కోట్లు సమకూర్చుతుంది. ఈ ప్రాజెక్టును 2016లో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ దక్కించుకుంది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. దీన్ని వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. తొలిదశలో ఈ విమానాశ్రయం నుంచి ఏటా 44 లక్షల మంది రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయి విస్తరణ తర్వాత ఏటా 4 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.

దేశీయ విమానాశ్రయాల రంగంలో ఎన్‌ఐఐఎఫ్‌ చేస్తున్న మొదటి పెట్టుబడి ఇదే. ఎన్‌ఐఐఎఫ్‌లో కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశీయ, విదేశీ పెట్టుబడి సంస్థలు వాటాదార్లుగా ఉన్నాయి. జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తాము పెట్టుబడులు పెడుతున్నట్లు ఎన్‌ఐఐఎఫ్‌- మాస్టర్‌ ఫండ్‌ ఎండీ వినోద్‌ గిరి వివరించారు.

ఎన్‌ఐఐఎఫ్‌తో భాగస్వామ్యం గోవా విమానాశ్రయానికే పరిమితం కాకుండా, మరో రెండు విమానాశ్రయాలకు విస్తరిస్తుందని జీఎంఆర్‌ గ్రూపు బిజినెస్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌ రాజు తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు