వడ్డీ రేట్లు.. వృద్ధి భయాలు పడేశాయ్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడం, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాను తగ్గించడంతో సూచీల నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి.

Published : 08 Dec 2022 02:49 IST

సమీక్ష

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడం, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాను తగ్గించడంతో సూచీల నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా బలపడి 82.47 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.56 శాతం తగ్గి 78.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు రాణించాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,615.52 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఆర్‌బీఐ నిర్ణయాల తర్వాత లాభాల్లోకి వచ్చిన సూచీ 62,759.97 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మళ్లీ నష్టాల్లోకి జారుకుని ఒకదశలో 62,316.65 పాయింట్లకు పడిపోయింది. చివరకు 215.68 పాయింట్ల నష్టంతో 62,410.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు కోల్పోయి 18,560.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,528.40- 18,668.30 పాయింట్ల మధ్య కదలాడింది.

వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌ షేర్లలో ఫెడరల్‌ బ్యాంక్‌ 1.93%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.64%, కోటక్‌ బ్యాంక్‌ 1.24% నష్టపోయాయి. వాహన షేర్లలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో 1.54%, టీవీఎస్‌ 1.38%, హీరో మోటో 1.35%, ఐషర్‌ 1.01% వరకు డీలాపడ్డాయి. స్థిరాస్తి షేర్లలో శోభా 5.59%, ఒబెరాయ్‌ రియాల్టీ 3.66%, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ 2.35%, డీఎల్‌ఎఫ్‌ 1.28% నీరసపడ్డాయి.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 డీలాపడ్డాయి. ఎన్‌టీపీసీ 2%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.73%, సన్‌ఫార్మా 1.55%, టాటా స్టీల్‌ 1.46%, రిలయన్స్‌ 1.43%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.38%, విప్రో 1.16%, అల్ట్రాటెక్‌ 1.12% చొప్పున నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 2.10%, హెచ్‌యూఎల్‌ 2.01%, ఎల్‌ అండ్‌ టీ 1.42%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.12%, ఐటీసీ 0.82% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు, వాహన 1.11% పడ్డాయి. బీఎస్‌ఈలో 2038 షేర్లు నష్టాల్లో ముగియగా, 1478 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 125 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

అగ్రగామి వైన్‌ తయారీ సంస్థ సులా వైన్‌యార్డ్స్‌ ఐపీఓ ఈనెల 12న మొదలై 14న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా ఒక్కో షేరుకు రూ.340- 357గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.960.35 కోట్లు సమీకరించనుంది.

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రమోటర్‌ సంస్థల్లో ఒకటైన ఏబీఆర్‌డీఎన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ తమకున్న మొత్తం 10.21 శాతం వాటాను విక్రయించడానికి చూస్తోంది. ఈ ప్రతిపాదిత వాటా విక్రయం తర్వాత ఏబీఆర్‌డీఎన్‌ కో-స్పాన్సర్‌గా మారుతుంది.

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఆన్‌లైన్‌ రిటైల్‌ ట్రేడింగ్‌ వ్యాపారాన్ని విలీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు 5పైసా క్యాపిటల్‌ వెల్లడించింది.

ఆర్సెలార్‌మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా నుంచి తమ నిర్మాణ సంస్థ ‘మెగా’ ఆర్డరు అందుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. కంపెనీ రూ.7000 కోట్లకు పైగా విలువ కలిగిన వాటిని ‘మెగా’ ఆర్డర్లుగా పరిగణిస్తుంది. ఆర్డరులో భాగంగా ఆర్సెలార్‌మిత్తల్‌ గుజరాత్‌, ఒడిశా విస్తరణ ప్రాజెక్టులను ఎల్‌ అండ్‌ టీ చేపట్టనుంది.

ఓఎన్‌జీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బీపీసీఎల్‌ మాజీ ఛైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ నియమితులయ్యారు. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థకు అధిపతిగా పదవీ విరమణ పొందిన వ్యక్తిని నియమించడం ఇదే తొలిసారి. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని