మే నుంచి పెరిగిన రెపో రేటు 2.25%

‘‘భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. రబీ పంట దిగుబడులు బాగున్నాయి. పట్టణ గిరాకీ ఎక్కువగా ఉండగా, గ్రామీణ పరిస్థితులూ మెరుగవుతున్నాయి. సేవలు, తయారీ రంగం పుంజుకోవడం, రుణాల్లో వృద్ధి లాంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి.

Updated : 08 Dec 2022 05:14 IST

తాజాగా 0.35% పెంపుతో 6.25 శాతానికి

2022-23కు వృద్ధి అంచనా 7% నుంచి 6.8 శాతానికి తగ్గింపు

2023 మార్చి కల్లా 6% దిగువకు ద్రవ్యోల్బణం

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష

‘‘భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. రబీ పంట దిగుబడులు బాగున్నాయి. పట్టణ గిరాకీ ఎక్కువగా ఉండగా, గ్రామీణ పరిస్థితులూ మెరుగవుతున్నాయి. సేవలు, తయారీ రంగం పుంజుకోవడం, రుణాల్లో వృద్ధి లాంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి. ప్రపంచ దేశాల తరహాలోనే ఇక్కడా అధిక స్థాయుల్లో ఉన్న ద్రవ్యోల్బణంపై పోరాటం కొనసాగిస్తాం. కరెంటు ఖాతా లోటు నియంత్రిత స్థాయిలోనే ఉంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి క్షీణత తక్కువే.’’

శక్తికాంత దాస్‌, ఆర్‌బీఐ గవర్నరు

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపోరేటును మరో 35 బేసిస్‌ పాయింట్ల (0.35%) మేర పెంచి, 6.25 శాతానికి చేర్చింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) మరింత భారం అవుతాయి. ఈ ఏడాది మే నుంచి 5 విడతల్లో మొత్తంగా 225 బేసిస్‌ పాయింట్ల (2.25%) మేర రెపోరేటును ఆర్‌బీఐ పెంచింది. గత మూడు సందర్భాల్లో 50 బేసిస్‌ పాయింట్ల చొప్పున పెంచగా, అయితే దూకుడును కాస్త తగ్గించింది. తద్వారా రెపోరేటు గరిష్ఠ స్థాయికి సమీపిస్తున్నదేనే సంకేతాన్ని ఇచ్చింది. 0.35% పెంపు నిర్ణయానికి పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లోని ఆరుగురు సభ్యుల్లో అయిదుగురు ఓటేశారు. సర్దుబాటు విధాన వైఖరిని ఉపసంహరించే ప్రతిపాదనకు నలుగురు మద్దతు తెలిపారు. సోమవారం నుంచి జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంతదాస్‌ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ముఖ్యాంశాలివీ..

వృద్ధిరేటు అంచనాల్లో మళ్లీ కోత

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బీఐ మరోసారి తగ్గించింది. 2022-23లో వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదు కావొచ్చని తాజాగా పేర్కొంది. వృద్ధిరేటు 7.8 శాతంగా ఉండొచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేయగా, ఏప్రిల్‌లో 7.2 శాతానికి, సెప్టెంబరులో 7.0 శాతానికి ఆర్‌బీఐ సవరించింది. ఇప్పుడు మరింత తగ్గించిది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచే విషయంలో దూకుడుగా వెళ్తుండటాన్ని పరిగణనలోకి తీసుకుని వృద్ధి అంచనాలను తగ్గించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అయినా కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దిగ్గజ ఆర్థిక వ్యవస్థ దేశాల్లో ఒకటిగా భారత్‌ కొనసాగుతుందని ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ చెప్పారు.  


ద్రవ్యోల్బణ అంచనా యథాతథం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాల్లో మార్పు చేయకుండా 6.7 శాతంగానే ఆర్‌బీఐ కొనసాగించింది. 2023 మార్చి లోగా ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్య శ్రేణిలోని గరిష్ఠమైన 6 శాతం దిగువకు వస్తుందని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి అక్టోబరు వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం పైనే నమోదవుతూ వచ్చింది. కమొడిటీ - చమురు ధరలు దిగిరావడం వల్ల క్లిష్ట పరిస్థితులు తొలగినట్లేనని పేర్కొంటూనే, అధిక ధరలపై పోరాటం కొనసాగుతుందని పేర్కొంది. వచ్చే 12 నెలల్లో ద్రవ్యోల్బణం 4 శాతం ఎగువనే కొనసాగుతుందని దాస్‌ తెలిపారు.  


రూపాయి క్షీణత పరిమితంగానే..

అమెరికా డాలరు బలోపేతం కావడంతో, ప్రధాన దేశాల కరెన్సీలన్నీ క్షీణించాయని, వీటితో పోలిస్తే రూపాయి క్షీణత పరిమితంగానే ఉందని ఆర్‌బీఐ గవర్నరు చెప్పారు. 2022 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు రూపాయి విలువ 3.2% పెరిగిందన్నారు. దేశీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక, ఫైనాన్షియల్‌ మార్కెట్‌ పరిణామాలను గమనిస్తూ రూపాయి కదలికలపై ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవడం ముఖ్యమని దాస్‌ తెలిపారు. మార్కెట్‌ ఆధారంగానే రూపాయి విలువ ఉంటుందని స్పష్టం చేశారు.


9 నెలల దిగుమతులకు సరిపడా ఫారెక్స్‌ నిల్వలు: విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు సౌకర్యవంత స్థాయిలో ఉన్నాయని చెప్పారు. 2022 డిసెంబరు 2 నాటికి ఇవి 561.20 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2022-23లో తొమ్మిది నెలల దిగుమతుల విలువకు ఇవి సమానం. భారత విదేశీ రుణాల నిష్పత్తి  తక్కువగానే ఉంది. 2021-22కు మించి కరెంటు ఖాతా లోటు నమోదైనా, నియంత్రిత స్థాయిగానే భావించవచ్చని దాస్‌ వివరించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్యలభ్యత మిగులు కొనసాగుతోంది.

సాధారణంతో పోలిస్తే రబీ దిగుబడులు ఇప్పటివరకు 6.8 శాతం అధికంగా ఉన్నాయి.


ఇ-కేవైసీ చేస్తే మళ్లీ శాఖల్లో అడగకూడదు

వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా కేవైసీ (ఇ-కేవైసీ) పూర్తి చేసుకుంటే.. మళ్లీ బ్యాంకు శాఖల్లో వెరిఫికేషన్‌ అడగకూడదని ఆర్‌బీఐ తెలిపింది. సెంట్రల్‌ కేవైసీ (సీ-కేవైసీ) పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేసిన వినియోగదారుల విషయంలోను బ్యాంకులు వెరిఫికేషన్‌ అడగకూడదని సూచించింది. వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని తరచు బ్యాంకులకు తెలియజేస్తున్నామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు రవి శంకర్‌ చెప్పారు.


పలు చెల్లింపులకు ఒకేసారి ఆదేశాలు

యూపీఐలో కొత్త సదుపాయం

యూపీఐ ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. ‘సింగిల్‌ బ్లాక్‌ అండ్‌ మల్టిపుల్‌ డెబిట్స్‌’గా వ్యవహరించే దీని ద్వారా సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు మరింత సులభం అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. ఉదాహరణకు హోటల్‌ గది బుక్‌ చేసుకున్నప్పుడు, అడ్వాన్స్‌ కింద కొంత, మిగిలింది రోజువారీ-చివరన ఇస్తుంటాం. ఇందుకు ఎంత అవుతుందో అంచనా ఉంటుంది కనుక, ఒకేసారి ఆ మొత్తానికి అనుమతి ఇస్తే, విడతలుగా నిధులను మన ఖాతా నుంచి హోటల్‌ యాజమాన్యం విత్‌డ్రా చేసుకుంటుంది. ఇ-కామర్స్‌లో వస్తువులు లేదా సేవలు డెలివరీ అయ్యే వరకు మన ఖాతాలోనే డబ్బులు ఉంటాయని, అవసరమైన సమయంలో ఇవి డెబిట్‌ అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను ఉపయోగించి ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకూ  ఉపయోగపడుతుంది. యూపీఐలో ఈ కొత్త సదుపాయాన్ని చేర్చడానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తామని తెలిపారు.

పన్నులు, విద్యాసంస్థలకు ఫీజుల చెల్లింపు వంటి అన్ని రకాల చెల్లింపులకు వీలు కల్పించేలా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ (బీబీపీఎస్‌) పరిధిని పెంచనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని