నవంబరులో 3% పెరిగిన విమాన ప్రయాణికులు

దేశీయ విమాన ప్రయాణికులు గత నెలలో 3 శాతం పెరిగి 2.34 కోట్లకు చేరారని క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా గురువారం వెల్లడించింది.

Published : 09 Dec 2022 03:55 IST

దేశీయంగా 2.34 కోట్ల మంది
సెలవుల సీజను వల్లే: ఇక్రా

ముంబయి: దేశీయ విమాన ప్రయాణికులు గత నెలలో 3 శాతం పెరిగి 2.34 కోట్లకు చేరారని క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా గురువారం వెల్లడించింది. ప్రయాణాలకు పెరిగిన గిరాకీకి తోడు సెలవుల సీజను కావడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. కొవిడ్‌కు ముందు ఇదే నెలతో (2019 నవంబరు) పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7 శాతం తక్కువగా ఉందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దేశీయ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోందని వెల్లడించింది. ప్రయాణ పరిమితులు సడలించడం, కార్యాలయాలు మళ్లీ తెరుచుకోవడం, వ్యాపార, విహార ప్రయాణాలు పెరగడంతో విమాన ప్రయాణికులు పెరిగారని వివరించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 2021 నవంబరుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 13 శాతం పెరిగారని తెలిపింది.

అంతర్జాతీయంగా గత నెలలో 49 లక్షల మంది ప్రయాణించారని, నెలవారీగా 3 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. కొవిడ్‌ ముందుతో పోలిస్తే క్రమంగా ప్రయాణికులు పెరిగి 81 శాతానికి చేరారని వివరించింది. నెలవారీగా చూస్తే మొత్తం ప్రయాణికుల సంఖ్య 3 శాతం మేర పెరిగి నవంబరులో 2.83 కోట్లకు చేరిందని ఇక్రా వెల్లడించింది. బలమైన రికవరీ ఉండటంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు 2022-23లో 71-73 శాతం పెరిగి 3.24-3.27 కోట్లకు (కొవిడ్‌కు ముందుతో పోలిస్తే 95-96 శాతం) చేరే అవకాశం ఉందని ఇక్రా కార్పొరేట్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వినయ్‌కుమార్‌.జి. వెల్లడించారు. ఇందులో దేశీయ ప్రయాణికులు 97-98 శాతం, అంతర్జాతీయ ప్రయాణికులు 87-90 శాతం మధ్య ఉంటాయని ఇక్రా అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని