మార్కెట్లో భాజపా ‘గెలుపు’ లాభాలు

సూచీల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్‌, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ నాలుగు రోజుల తర్వాత లాభాలు నమోదు చేశాయి.

Published : 09 Dec 2022 04:17 IST

సమీక్ష

సూచీల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్‌, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ నాలుగు రోజుల తర్వాత లాభాలు నమోదు చేశాయి. గుజరాత్‌లో అధికార భాజపా రికార్డు విజయాన్ని నమోదు చేయడం సానుకూల ప్రభావం చూపింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు లాభాలను పరిమితం చేశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 82.38 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 77.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

సెన్సెక్స్‌ ఉదయం 62,504.04 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 62,320.18 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, అనంతరం పుంజుకుంది. ఒకదశలో 62,633.56 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 160 పాయింట్ల లాభంతో 62,570.68 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 48.85 పాయింట్లు పెరిగి 18,609.35 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.71%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.31%, ఎల్‌ అండ్‌ టీ 2.06%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.02% రాణించాయి.

* గుజరాత్‌లోని సన్‌ఫార్మా హలోల్‌ ప్లాంట్‌ను దిగుమతి హెచ్చరిక జాబితాలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ చేర్చింది. ఈ ప్లాంట్‌లో తయారైన ఉత్పత్తులను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సన్‌ఫార్మా 3.57% నష్టపోయింది. పవర్‌గ్రిడ్‌ 1.56%, టీసీఎస్‌ 0.90%, ఎన్‌టీపీసీ 0.84% నష్టపోయాయి.

* సంస్థాగత మదుపర్లకు షేర్లను విక్రయించడం ద్వారా దాదాపు రూ.3500 కోట్లు సమీకరించడానికి మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ ప్రమోటర్లు సన్నాహాలు చేస్తున్నారు. లోధా బ్రాండ్‌ కింద కంపెనీ ఆస్తులను విక్రయిస్తుంది.

* గత పక్షం రోజుల్లో తమ సంస్థలు దాదాపు రూ.1,500 కోట్లు సమీకరించినట్లు ఐనాక్స్‌ జీఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ ప్రకటించింది.

*  ధర్మాజ్‌ క్రాప్‌ గార్డ్‌ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.237తో పోలిస్తే 12.24% లాభపడి రూ.266 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.278.90 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు రూ.266.40 వద్ద ముగిసింది.

*  ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ ఐపీఓ 13న ప్రారంభమై 15వ తేదీన ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా ఒక్కో షేరుకు రూ.481- 506  నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.552 కోట్లు సమీకరించనుంది.

*  వచ్చే క్యాలెండర్‌ సంవత్సరంలో కల్యాణ్‌ జువెలర్స్‌ ఇండియా కొత్తగా 52 విక్రయశాలలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్కువగా దక్షిణ భారతేతర ప్రాంతంలోనే నెలకొల్పనున్నారు.

* భారత ఆర్థిక సేవల రంగంపై విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) సానుకూలత కనబరుస్తున్నారు. బలమైన రుణాల వృద్ధి, నిరర్థక ఆస్తులు తగ్గడంతో నవంబరులో ఈ రంగంపై రూ.14,205 కోట్లు (2.1 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. అక్టోబరులో లాభాల స్వీకరణ కారణంగా ఆర్థిక సేవల షేర్ల నుంచి వీరు రూ.4,686 కోట్లు ఉపసంహరించుకున్నారు.

* హిందుజా గ్రూప్‌ సంస్థ అశోక్‌ లేలాండ్‌ తన ఎండీ, సీఈఓగా శేణు అగర్వాల్‌ను నియమించింది. తక్షణం ఈ నియామకం అమల్లోకి వస్తుంది.

* ఒజివాలో మెజారిటీ వాటా(51%)ను; వెల్‌బీయింగ్‌ న్యూట్రిషన్‌లో 19.8 శాతం వాటాను మొత్తం మీద రూ.335 కోట్ల పెట్టుబడులతో సొంతం చేసుకున్నట్లు హెచ్‌యూఎల్‌ గురువారం ప్రకటించింది. తద్వారా ఆరోగ్య, వెల్త్‌బీయింగ్‌ విభాగంలోకి అడుగుపెట్టింది.

* త్రివేణి ఇంజినీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటరు అయిన ధృవ్‌ మన్మోహన్‌ సానే బహిరంగ విపణిలో 7 శాతం వాటాను రూ.477 కోట్లకు విక్రయించారు.

* రూ.600 కోట్ల మూలధనాన్ని ఇవ్వాలంటూ మాతృ సంస్థ రిలయన్స్‌ క్యాపిటల్‌ను రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కోరినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని