100 సంస్థలు.. రూ.92.2 లక్షల కోట్లు

దేశీయంగా అగ్రశ్రేణి 100 సంస్థలు 2017-22 మధ్య కాలంలో ఏకంగా రూ.92.2 లక్షల కోట్ల సంపద సృష్టించాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక పేర్కొంది.

Updated : 09 Dec 2022 10:11 IST

2017-22 మధ్య సృష్టించిన సంపద ఇది
ఆర్‌ఐఎల్‌, అదానీ సంస్థలదే హవా
మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక

ముంబయి: దేశీయంగా అగ్రశ్రేణి 100 సంస్థలు 2017-22 మధ్య కాలంలో ఏకంగా రూ.92.2 లక్షల కోట్ల సంపద సృష్టించాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక పేర్కొంది. 27వ ‘వార్షిక సంపద సృష్టి అధ్యయనం’లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు..

* ఇప్పటి వరకు సంప్రదాయ దిగ్గజంగా కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  (ఆర్‌ఐఎల్‌)ను మించి 2 అదానీ గ్రూప్‌ కంపెనీలు (అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌) 2022లో సంపదను సృష్టించాయి. 2017-22 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆర్‌ఐఎల్‌ అన్ని రికార్డులను తిరగరాసింది.

* గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీలు ఈ ఏడాదిలో బలమైన ర్యాలీ కనబరిచాయి. ఈ ర్యాలీతో సెప్టెంబరు 16న అదానీ ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో (ఫోర్బ్స్‌ రియల్‌-టైమ్‌ బిలియనీర్స్‌) 155.7 బిలియన్‌ డాలర్ల నికర విలువతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. అదే రోజున అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌లు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. కాగా, ఎలాన్‌ మస్క్‌ 253.5 బి.డాలర్లతో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

* పైన పేర్కొన్న 3 అదానీ కంపెనీల్లో అదానీకి 75% వాటా ఉంది. ఈ సంస్థల నుంచే 2022లో 70 బి.డాలర్ల సంపద అదానీకి లభించింది.

* ఆసియాలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముకేశ్‌ అంబానీ స్థానాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ దక్కించుకున్నారు. ఏప్రిల్‌ నాటికి 100 బి.డాలర్ల సంపద క్లబ్‌లో చేరారు. గత నెలలో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో నాలుగో స్థానానికి ఎదిగారు. అదానీ టోటల్‌ గ్యాస్‌లో 37 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 61 శాతం వాటా కూడా అదానీ చేతిలో ఉంది. 92.3 బి.డాలర్ల నికర విలువతో ముకేశ్‌ అంబానీ ప్రపంచ ధనికుల జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు.

* 2017-22లో ఆర్‌ఐఎల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు అతి పెద్ద, అత్యంత వేగవంత, స్థిరమైన సంపద సృష్టి చేసిన కంపెనీలుగా నిలిచాయి.

* సాంకేతిక రంగం అత్యధికంగా సంపద సృష్టించింది. దీని తర్వాత ఆర్థిక రంగం నిలిచింది.

* 2017-22 మధ్య సంపద సృష్టిలో రిలయన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అత్యంత వేగంగా సంపద సృష్టించిన కంపెనీగా అదానీ ట్రాన్స్‌మిషన్‌ నిలిచింది. 106% వార్షిక సంచిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)తో వరుసగా రెండోసారి ఈ సంస్థ నిలిచింది. అత్యంత స్థిరమైన సంపద సృష్టిలో వరుసగా రెండోసారి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్థానం దక్కించుకుంది. గత 5 ఏళ్లుగా 97% సీఏజీఆర్‌తో సెన్సెక్స్‌ను మించి ఈ షేరు పెరిగింది.

* 8 ఏళ్ల విరామం తర్వాత సాంకేతిక రంగం అత్యధిక సంపద సృష్టి జాబితాలో నిలిచింది. ప్రభుత్వ రంగ కంపెనీలు పేలవమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ రంగంలో గుజరాత్‌ గ్యాస్‌ ఒక్కటే సంపద సృష్టించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని