రూ.3295కోట్లతో విమానాల ఆధునికీకరణలో ఎయిరిండియా

టాటా గ్రూపునకు చెందిన విమానయాన సేవల సంస్థ ఎయిరిండియా తన వద్ద ఉన్న 40 పాత పెద్ద (వైడ్‌బాడీ) విమానాలను ఆధునికీకరించే యోచనలో ఉంది.

Updated : 09 Dec 2022 04:31 IST

ముంబయి: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సేవల సంస్థ ఎయిరిండియా తన వద్ద ఉన్న 40 పాత పెద్ద (వైడ్‌బాడీ) విమానాలను ఆధునికీకరించే యోచనలో ఉంది. ఇందుకోసం 400 మిలియన్‌ డాలర్లను (సుమారు రూ.3,295 కోట్లు) వెచ్చించనున్నట్లు గురువారం సంస్థ తెలిపింది. ఈ 40 విమానాల్లో 27.. బోయింగ్‌ 787-800ఎస్‌, 13.. బీ777ఎస్‌ విమానాలు ఉన్నాయి. వీటిని ఎయిరిండియా ప్రభుత్వ యాజమాన్య నిర్వహణలో ఉన్నప్పుడే కొనుగోలు చేసింది. ఈ ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా పై విమానాల్లోని కేబిన్‌ రూపురేఖలను (ఇంటీరియర్స్‌) పూర్తిగా మార్చేయనున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. దీనికి తోడు కొత్త రకం సీట్లను అమర్చడంతో పాటు అన్ని క్లాస్‌ల్లోనూ అత్యుత్తమ ఇన్‌ఫ్లైట్‌ వినోద సదుపాయాలను కల్పించనున్నట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. పై రెండు రకాల విమానాల్లో ప్రీమియమ్‌ ఎకానమీ కేబిన్‌లను అందుబాటులోకి తేనున్నామని పేర్కొంది. అలాగే బీ777 విమానాల్లో ఫస్ట్‌ క్లాస్‌ కేబిన్‌ను కొనసాగించనున్నట్లు వివరించింది. ఈ విమానాల ఆధునికీకరణ పనులు, కేబిన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ను మార్చే బాధ్యతను లండన్‌కు చెందిన ప్రోడక్ట్‌ డిజైన్‌ సంస్థలు జేపీఏ డిజైన్‌, ట్రెండ్‌వర్క్స్‌కు ఎయిరిండియా అప్పగించింది.

2024 నుంచి వాటి సేవలు: ఆధునికీకరణ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి విమానం సేవలు 2024 మధ్యకల్లా ప్రారంభం కావొచ్చని ఎయిరిండియా వివరించింది. ‘విమానాలను ఆధునికీకరించే ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా పూర్తయ్యేందుకు సంబంధిత భాగస్వాములతో కలిసి పనిచేస్తాం. ఇదే సమయంలో అధునాతన ఇంటరీయర్స్‌ ఉన్న 11 కొత్త వైడ్‌బాడీ విమానాలను లీజ్‌కు తీసుకుంటాం. తద్వారా తమ సేవలను మరింత మెరుగుపర్చుకుంటామ’ని ఎయిరిండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తెలిపారు.


విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించే ప్రణాళికలు
మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

దేశంలోని విమానాశ్రయాల వద్ద రద్దీని తగ్గించేందుకు ప్రణాళికను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఇటీవల కాలంలో విమానాశ్రయాల వద్ద భారీగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన లోకసభలో పైవిధంగా తెలియజేశారు. ప్రణాళికకు సంబంధించిన ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘విమానాశ్రయ నిర్వాహకులతో పాటు ఇమిగ్రేషన్‌, సీఐఎస్‌ఎఫ్‌ విభాగాల ప్రతినిధులతో నేను విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాను. విమానాశ్రయాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ సామర్థ్యాల ఆధారంగా కాకుండా రద్దీ ఎక్కువగా (పీక్‌ అవర్స్‌) ఉండే సమయంలో విమాన రాకపోకలను (అరైవల్స్‌, డిపార్చర్స్‌) దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందించాల్సిందిగా వాళ్లకు చెప్పాను. ప్రస్తుతం ఈ దిశగా కసరత్తు జరుగుతోంద’ని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని