నవంబరులో ‘రికార్డు’ రయ్‌రయ్‌

దేశీయంగా నవంబరులో వాహన రిటైల్‌ అమ్మకాలు అత్యుత్తమంగా నమోదయ్యాయి. ద్విచక్ర, వాణిజ్య - ప్రయాణికుల వాహనాలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ అధిక అమ్మకాలు జరిగాయి.

Updated : 10 Dec 2022 04:26 IST

23.8 లక్షల వాహన అమ్మకాలు
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజను: ఫాడా

దిల్లీ: దేశీయంగా నవంబరులో వాహన రిటైల్‌ అమ్మకాలు అత్యుత్తమంగా నమోదయ్యాయి. ద్విచక్ర, వాణిజ్య - ప్రయాణికుల వాహనాలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ అధిక అమ్మకాలు జరిగాయి. 2021 నవంబరులో అన్ని రకాల వాహనాలు కలిసి 18,93,647 విక్రయం కాగా, గత నెలలో 26 శాతం పెరిగి 23,80,465కు చేరాయి. ‘దేశీయ వాహన చరిత్రలోనే గత నెలలో అత్యధిక రిటైల్‌ అమ్మకాలు నమోదయ్యాయి. 2020 మార్చి (బీఎస్‌ 4 నుంచి బీఎస్‌ 6కు మారుతున్న సమయం) మాత్రం ఇందుకు మినహాయింపు’ అని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా పేర్కొన్నారు. ‘ఈ ఏడాది పండగ సీజను పూర్తయ్యాకా అమ్మకాలు భారీగా కొనసాగాయి. పెళ్లిళ్ల సీజను ప్రారంభం కావడం సహకరించింద’ని అన్నారు.

డిసెంబరులోనూ రాణిస్తాయ్‌: ‘చాలా వరకు కంపెనీలు జనవరి నుంచి ధరల పెంపు ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు ప్రకటించనున్నాయి. సంవత్సరాంత నిల్వలను వదిలించుకోవడం కోసం అంతగా అమ్మకాలు లేని, ప్రారంభస్థాయి మోడళ్లకు ఇవి రాయితీలూ ఇస్తున్నాయి. అందు వల్ల డిసెంబరులోనూ అమ్మకాలు రాణించొచ్చ’ని ఫాడా అంచనా వేసింది.

వడ్డీ రేట్ల ప్రభావం పడొచ్చు: ‘రెపో రేటు పెంపు వల్ల ద్విచక్ర, ప్రారంభ స్థాయి కార్ల  అమ్మకాలపై ప్రభావం పడొచ్చు. దీంతో పాటు చైనా లాక్‌డౌన్‌ వల్ల సెమీకండక్టర్ల సరఫరాలో వేగం తగ్గొచ్చు. ఇది కూడా ప్రతికూలంగా మారొచ్చు. ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్‌పై ఆశావహంగా ఉన్నప్పటికీ.. జాగ్రత్త తప్పద’ని ఫాడా అంటోంది.

* త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాల్లో వరుసగా 81%, 57% మేర వృద్ధి నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని