ఔత్సాహికులకు మార్గనిర్దేశం

ప్రతిష్ఠాత్మక టై (ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సు హైదరాబాద్‌లో ఈ నెల 12న ప్రారంభం కానుంది.

Updated : 10 Dec 2022 10:23 IST

3 రోజుల పాటు హైదరాబాద్‌లో టై గ్లోబల్‌ సదస్సు
శంతను నారాయణ్‌, కిరణ్‌ పటేల్‌ ఉపన్యాసాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక టై (ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సు హైదరాబాద్‌లో ఈ నెల 12న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఐటీ రంగ ప్రముఖులు, అంకుర సంస్థల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. రెండు వేల మందికి పైగా ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి దాదాపు 500 మంది టై సభ్యులు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు దీనికి విచ్చేస్తారని అంచనా. తొలి రోజున జరిగే ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరవుతారు. అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓ శంతను నారాయణ్‌, గ్రీన్‌కో గ్రూపు ఎండీ, సీఈఓ అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి పాల్గొంటారు. ఎన్నో అంకుర సంస్థలు యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల సంస్థ)లుగా ఎదిగేందుకు దోహదపడిన కిరణ్‌ పటేల్‌ ప్రత్యక్షోపన్యాసం చేస్తారు. మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన స్ఫూర్తినిచ్చేందుకు ‘ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ పై చర్చాగోష్టి ఏర్పాటు చేశారు. ఈ సదస్సు స్థానికంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు దోహదపడుతుందని టై గ్లోబల్‌ వైస్‌ఛైర్మన్‌ మురళీ బుక్కపట్నం అన్నారు. టై సభ్య సంస్థల ద్వారా కొన్నేళ్లలో దాదాపు కోటి ఉద్యోగాలు కల్పించినట్లు, లక్ష కోట్ల డాలర్ల విలువ సృష్టించినట్లు టై హైదరాబాద్‌ అధ్యక్షుడు సురేష్‌ రాజు వివరించారు. టై గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, ఉయ్‌ఫౌండ్‌ సర్కిల్‌, గ్రీన్‌కో, కేపీఎంజీ, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌, కైరేటీ వెంచర్స్‌, టీ-హబ్‌ భాగం పంచుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని