సిమెంట్‌ వ్యాపారం నుంచి జేపీ గ్రూప్‌ నిష్క్రమణ

సిమెంట్‌ వ్యాపారం నుంచి జేపీ గ్రూప్‌ నిష్క్రమించింది.

Published : 13 Dec 2022 07:29 IST

దాల్మియా సిమెంట్‌కు 9.4 మి.ట. ప్లాంట్ల విక్రయం
లావాదేవీ విలువ రూ.5,666 కోట్లు

దిల్లీ: సిమెంట్‌ వ్యాపారం నుంచి జేపీ గ్రూప్‌ నిష్క్రమించింది. 20 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను 2014-17 మధ్య ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు విక్రయించగా, మిగిలిన 9.4 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్‌ ప్లాంట్‌లను దాల్మియా భారత్‌కు విక్రయిస్తున్నట్లు జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ (జేఏఎల్‌), గ్రూప్‌ సంస్థలు సోమవారం ప్రకటించాయి. ఈ లావాదేవీ ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5,666 కోట్లు. రుణభారం తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే సిమెంట్‌ రంగం నుంచి జేపీ గ్రూప్‌ వైదొలిగింది.

దాల్మియా సిమెంట్‌ సామర్థ్యం 45.3 మి.ట.కు: పలు రాష్ట్రాల్లో జేపీ గ్రూప్‌ ప్రధాన సంస్థ జేఏఎల్‌, అనుబంధ సంస్థల నుంచి 9.4 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్‌ ప్లాంట్లతో పాటు థర్మల్‌ ప్లాంట్‌ను దాల్మియా భారత్‌ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుతో దాల్మియా భారత్‌ వార్షిక సిమెంట్‌ తయారీ సామర్థ్యం 35.9 మిలియన్‌ టన్నుల నుంచి 45.3 మిలియన్‌ టన్నులకు చేరుతుంది. దేశంమొత్తం కార్యకలాపాలు సాగించే  కంపెనీగా ఎదగాలనుకుంటున్న దాల్మియా భారత్‌కు ఈ లావాదేవీ దోహదపడుతుంది. జేఏఎల్‌, అనుబంధ కంపెనీల నుంచి క్లింకర్‌, సిమెంట్‌, విద్యుత్‌ ప్లాంట్‌ల కొనుగోలుకు అనుబంధ సంస్థ దాల్మియా భారత్‌ సిమెంట్‌ బైండింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దాల్మియా భారత్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ లావాదేవీలో 9.4 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ తయారీ కేంద్రాలు, 6.7 మిలియన్‌ టన్నుల క్లింకర్‌, 280 మెగావాట్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కూడా భాగమే.

* ఈ కొనుగోలుతో దేశ మధ్య ప్రాంతంలోనూ దాల్మియా విస్తరించనుంది. జేఏఎల్‌ ఆస్తులు మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ల్లో ఉన్నాయి. 2026-27కు 75 మిలియన్‌ టన్నులు, 2030-31కు 110-130 మిలియన్‌ టన్నుల వార్షిక సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యానికి విస్తరించాలన్న కంపెనీ లక్ష్యానికి దోహదపడనుంది.

* ప్రస్తుతం దేశంలో అల్ట్రాటెక్‌, అదానీ సిమెంట్‌ (ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కొనుగోలు తర్వాత), శ్రీ సిమెంట్‌ తర్వాత నాలుగో అతిపెద్ద సిమెంట్‌ తయారీ సంస్థగా దాల్మియా సిమెంట్‌ ఉంది.

రుణాలు తగ్గించుకునేందుకే రుణ భారాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా 2014-17 మధ్య 20 మిలియన్‌ టన్నులకు పైగా తయారీ సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లను అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు జేఏఎల్‌ విక్రయించింది. 2015లో 2 మిలియన్‌ టన్నులకు పైగా సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లలో నియంత్రణ వాటాను దాల్మియా గ్రూప్‌నకు జేపీ గ్రూప్‌ అమ్మేసింది.

* 2018 సెప్టెంబరులో జేఏఎల్‌పై ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రూ.6893.15 కోట్లు వసూలు కావాల్సి ఉన్నందున, జేఏఎల్‌పై ఎన్‌సీఎల్‌టీలో ఎస్‌బీఐ కూడా ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని