సరైన వ్యక్తి దొరికాక ట్విటర్ సీఈఓగా వైదొలుగుతా
సామాజిక మాధ్యమం ట్విటర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పదవికి సరైన వ్యక్తి దొరికితే, ఆ బాధ్యతల నుంచి తాను వైదొలుగుతానని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.
న్యూయార్క్: సామాజిక మాధ్యమం ట్విటర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పదవికి సరైన వ్యక్తి దొరికితే, ఆ బాధ్యతల నుంచి తాను వైదొలుగుతానని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ‘ట్విటర్ సీఈఓగా కొనసాగనా? వద్దా?’ అంటూ ఆయనే ట్విటర్‌లో ఓ పోల్ నిర్వహించగా, ఓటు వేసిన వారిలో 57.5 శాతం మంది మస్క్ ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ఆ ఫలితాన్ని గౌరవిస్తానని చెప్పిన మస్క్, తాజాగా ఇలా ప్రకటించారు. ‘ట్విటర్ సీఈఓ బాధ్యతలను చేపట్టేందుకు ఎవరైనా ఒక తెలివి తక్కువ వ్యక్తి దొరికితే, నేను సీఈఓ పదవికి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత నుంచి కేవలం ట్విటర్ సాఫ్ట్‌వేర్, సర్వర్ బృందాలను పర్యవేక్షించే బాధ్యతలకు పరిమితం అవుతాన’ని మస్క్ ట్వీట్ చేశారు.
* గత ఆదివారం సాయంత్రం ప్రారంభమై సోమవారం ఉదయం వరకు జరిగిన ట్విటర్ పోల్‌లో 1.7 కోట్ల మంది ఓటేసినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ఆధారంగా తెలుస్తోంది. ఇందులో ఎక్కువ మంది ఆయన వైదొలగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫలితంపై మస్క్ వెంటనే స్పందించకుండా, మంగళవారం ట్వీట్ చేశారు. గతంలోనూ ఆయన ట్విటర్ పోల్ ఫలితాలకు కట్టుబడి ఉండేవారు. ప్రజల అభిప్రాయమే దైవ అభిప్రాయమంటూ ఆయన లాటిన్ భాషలో తరచూ చెబుతుండేవారు.
* ఈ ఏడాది అక్టోబరు చివర్లో ట్విటర్‌ను కొనుగోలు చేశాక... మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. అందుకే ట్విటర్ సీఈఓగా తాను కొనసాగాలా? వద్దా? అంటూ పోల్ నిర్వహించారు. ట్విటర్‌కు సంబంధించి మున్ముందూ ఏదేని కీలక విధాన మార్పులు చేయదలిస్తే, ట్విటర్‌లో పోల్ ద్వారానే నిర్ణయం తీసుకుంటామని మస్క్ ప్రకటించారు. ఇతర సామాజిక మాధ్యమాలకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో తెరిచిన ఖాతాలన్నింటనీ మూసేయనున్నట్లు ట్విటర్ తెలిపింది. ‘మా వినియోగదార్లలో చాలా మంది ఇతర సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు మేం గుర్తించాం. ట్విటర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ సామాజిక మాధ్యమాలకు ఉచితంగా ప్రచారం చేయడాన్ని మేం అనుమతించబోమ’ని ట్విటర్ పేర్కొంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మాస్టోడాన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ లాంటి ప్లాట్‌ఫామ్‌ల యూజర్ నేమ్‌లు, లింక్‌ల కంటెంట్ ఉన్న ఖాతాలను మేం తొలిగిస్తున్నట్లు వివరించింది.
రెండేళ్ల కనిష్ఠానికి ఎలాన్ మస్క్ నికర సంపద
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నికర సంపద రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం టెస్లా షేరు భారీ నష్టాలను చవిచూడటంతో.. ఒక్కరోజే ఆయన సంపద 7.7 బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యింది. ఒక్క రోజులో మస్క్ నికర సంపద ఇంత గణనీయంగా తగ్గడం అక్టోబరు తర్వాత మళ్లీ ఇప్పుడే. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ప్రస్తుతం మస్క్ నికర సంపద 148 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాదిలోనే ఆయన నికర సంపద 122.60 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. 2021లో ఆయన పెంచుకున్న సంపద కంటే కూడా ఇదే ఎక్కువే. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానాన్ని మస్క్ కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.