2023లోనూ విదేశీ పెట్టుబడులు మనకే

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ, కొత్త ఏడాదిలో విదేశీ మదుపర్లు భారత్‌పైనే మక్కువ చూపే అవకాశం ఉందని ‘అంతర్జాతీయ పెట్టుబడులను పరిశీలించే యూఎన్‌సీటీఏడీ నివేదిక’ అంచనా వేసింది.

Published : 26 Dec 2022 01:12 IST

ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాల వల్లే

యూఎన్‌సీటీఏడీ నివేదిక అంచనా

దిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ, కొత్త ఏడాదిలో విదేశీ మదుపర్లు భారత్‌పైనే మక్కువ చూపే అవకాశం ఉందని ‘అంతర్జాతీయ పెట్టుబడులను పరిశీలించే యూఎన్‌సీటీఏడీ నివేదిక’ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది తరహాలోనే 2023లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారత్‌కు కొనసాగుతాయని ఆ నివేదికలో నిపుణులు అంచనా వేశారు. అమెరికాలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు కఠినంగా ఉన్నా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నా కూడా.. భారత్‌లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు, ఆరోగ్యకర ఆర్థిక వృద్ధి రేటు అంచనాల వంటివి ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తాయని నివేదిక పేర్కొంది.  

సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు, పుష్కలమైన సహజ వనరులు, సరళతర ఎఫ్‌డీఐ విధానాలు, భారీ దేశీయ విపణి, ఆరోగ్యకర జీడీపీ వృద్ధి వంటి సానుకూల అంశాలు విదేశీ పెట్టుబడులను 2023లో ఆకర్షిస్తాయని విశ్లేషించింది. ‘ఒప్పందాల అమలులో జాప్యం, గజిబిజి విధానాలు, అధిక వడ్డీ రేట్ల వంటివి’ మాత్రం ఇప్పటికీ ఇబ్బందికర అంశాలేనని తెలిపింది.

కొవిడ్‌ పరిణామాల అనంతరమూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ‘సరికొత్త పెట్టుబడుల పునరుద్ధరణ’ మాత్రం ఇప్పటికీ బలహీనంగానే ఉందని యూఎన్‌సీటీఏడీ 2022 నివేదిక వెల్లడించింది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభాలు రావడం, మళ్లీ హడలెత్తిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారి, వాతావారణ మార్పులు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.


జనవరి-సెప్టెంబరులో 42.5 బి.డాలర్లు

2022 జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో 42.5 బి.డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మన దేశంలోకి వచ్చాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2021లో ఇవి 51.3 బి.డాలర్లుగా నమోదయ్యాయి. 2021-22లో మన దేశం అత్యధిక మొత్తంలో 84.84 బి.డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించింది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో  ఈక్విటీల్లోకి ఎఫ్‌డీఐ పెట్టుబడులు 14 శాతం తగ్గి 26.9 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులు, రీఇన్వెస్టెడ్‌ ప్రతిఫలాలు, ఇతర మూలధనంతో కలిపి మొత్తం ఎఫ్‌డీఐలు 39 బి.డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఈ మొత్తం 42.86 బి.డాలర్లు కావడం గమనార్హం.

ప్రభుత్వం తీసుకుంటున్న సరళతర ఎఫ్‌డీఐ విధానాలు, సులభతర వ్యాపార నిర్వహణకు అవలంబిస్తున్న పద్ధతులు, నిబంధనల భారం తగ్గించడం, పీఎల్‌ఐ పథకాలు, సమ్మిళిత మౌలిక సదుపాయాల కోసం తీసుకొచ్చిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక.. వంటివి మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలిరావడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ వెల్లడించారు.

2000 ఏప్రిల్‌-2022 సెప్టెంబరు మధ్య మన దేశంలోకి 887.76 బి.డాలర్ల ఎఫ్‌డీఐలు తరలివచ్చాయి. సుమారు 26 శాతం ఎఫ్‌డీఐలు మారిషస్‌ మార్గంలో భారత్‌కు తరలివచ్చాయి. సింగపూర్‌ (23 శాతం), అమెరికా (9 శాతం), నెదర్లాండ్స్‌ (7 శాతం), జపాన్‌ (6 శాతం), యూకే (5 శాతం), యూఏఈ, జర్మనీ, సైప్రస్‌, కేమ్యాన్‌ ఐలాండ్‌ నుంచి 2 శాతం మేర ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి.


ఈ రంగాల్లోకి అధికం

సేవలు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, టెలికమ్యూనికేషన్స్‌, ట్రేడింగ్‌, నిర్మాణరంగం, వాహన, రసాయనాలు, ఔషధ రంగాల్లోకి అత్యధికంగా ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఆటోమేటిక్‌ పద్ధతిలో అధిక శాతం రంగాల్లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నా.. టెలికాం, మీడియా, ఔషధ, బీమా రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని