మొండి బకాయిలు తగ్గాయి.. కానీ

భారత బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 5 శాతానికి తగ్గాయి.. అయితే ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితి మాత్రం బ్యాంకుల పై ప్రభావం చూపించొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది.

Published : 28 Dec 2022 01:21 IST

ప్రస్తుతస్థితి వల్ల బ్యాంకులపై ప్రభావం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ముంబయి: భారత బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 5 శాతానికి తగ్గాయి.. అయితే ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితి మాత్రం బ్యాంకుల పై ప్రభావం చూపించొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. 2017-18లో గరిష్ఠానికి చేరిన జీఎన్‌పీఏలు, ఈ ఏడాది సెప్టెంబరు ఆఖరుకు 5 శాతానికి పరిమితం అయ్యాయని‘ట్రెండ్స్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ ఇన్‌ ఇండియా’ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం..

భారత బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుతం బలంగా ఉంది. 2022 మార్చి చివరకు జీఎన్‌పీఏలు 5.8 శాతంగా ఉండగా.. సెప్టెంబరు ముగిసే సరికి 5 శాతానికి పరిమితమాయ్యయి. బలమైన మూలధన నిల్వలూ ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను విధానకర్తలు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు.

రికవరీలు, రైటాఫ్‌లు, అప్‌గ్రెడేషన్ల కారణంగా జీఎన్‌పీఏలు తగ్గాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తులు తగ్గడమూ కలిసొచ్చింది.

అందరు రుణ స్వీకర్తలకు పునర్నిర్మాణ ఆస్తుల నిష్పత్తి 1.1 శాతంగా పెరగ్గా.. భారీ రుణ స్వీకర్తలకు ఇది 0.5 శాతం మేర పెరిగింది. రుణ పునర్నిర్మాణం కారణంగా వ్యక్తులు, చిన్న వ్యాపారులకు సహాయం లభించింది.

మొత్తం రుణాల్లో భారీ మొత్తం రుణం తీసుకునే వారి వాటా తగ్గింది. రూ.5కోట్ల పైన రుణ ఖాతాలు 2020-21లో 48.4 శాతం కాగా, 2021-22లో 47.8 శాతానికి తగ్గాయి. మొత్తం ఎన్‌పీఏల్లో ఈ ఖాతాల ఎన్‌పీఏలు  66.4 శాతం నుంచి 63.4 శాతానికి తగ్గాయి.

2021-22లో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకు(ఎస్‌సీబీ)ల ఏకీకృత బ్యాలెన్స్‌ షీట్లు ఏడేళ్ల అనంతరం రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. రుణ వృద్ధి ఇందుకు దోహదం చేసింది.

దివాలా ప్రక్రియల్లో రుణ విలువ కంటే చాలా తక్కువ విలువకు అనుమతించడంపై ఉన్న ఆందోళనల నేపథ్యంలో.. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నగదీకరణ విలువతో పరిష్కార విలువను పోల్చుకోవాలని ఆర్‌బీఐ పునరుద్ఘాటించింది. 2022 సెప్టెంబరు చివరికి ఐబీసీ ద్వారా చేపట్టిన దివాలా ప్రక్రియల్లో నగదీకరణ విలువలో 201 శాతాన్ని దక్కించుకున్నట్లు వివరించింది.

రిటైల్‌ రుణాలకూ నష్టభయం పొంచి ఉందని ఆర్‌బీఐ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు