వచ్చేస్తోంది హరిత ఇంధనం

పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువు (గ్యాస్‌)కు ప్రత్యామ్నాయ ఇంధనం వచ్చేస్తోంది. పైగా కాలుష్యం వెదజల్లదు కూడా. వ్యక్తిగత, వాణిజ్య రవాణాకు,   పారిశ్రామిక అవసరాలకూ వినియోగించే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. అదే ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’.

Published : 19 Jan 2023 03:46 IST

‘గ్రీన్‌ హైడ్రోజన్‌’ విధానానికి కేంద్ర ప్రభుత్వ అండ
ఇంజిన్లు, ప్లాట్‌ఫామ్‌ల ఆవిష్కరణపై కార్పొరేట్‌ సంస్థల కసరత్తు
ఈనాడు - హైదరాబాద్‌

పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువు (గ్యాస్‌)కు ప్రత్యామ్నాయ ఇంధనం వచ్చేస్తోంది. పైగా కాలుష్యం వెదజల్లదు కూడా. వ్యక్తిగత, వాణిజ్య రవాణాకు,   పారిశ్రామిక అవసరాలకూ వినియోగించే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. అదే ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’. ఈ ఇంధన ఉత్పత్తి త్వరలోనే పట్టాలెక్కేలా, కేంద్ర మంత్రివర్గం ఈనెల మొదటి వారంలో ‘నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌’ కు ఆమోద ముద్ర వేసింది. 2030 నాటికి 50 లక్షల టన్నుల వార్షిక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనేది లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమలు, పరిశోధనా సంస్థలను ప్రోత్సహించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించారు. ఫలితంగా, ఈ రంగంలోకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు లభిస్తాయని అంచనా. దీంతోపాటు రూ.1 లక్ష కోట్ల విలువైన కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమూ ఉంది.

భవిష్యత్తు ఇం‘ధనం’

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి లభించిన విద్యుత్తును ఉపయోగించి, ఎలక్ట్రోలైజింగ్‌ ప్రక్రియ ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. నీటిని విడదీసినప్పుడు ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ లభిస్తాయి. పెట్రోలు, డీజిల్‌ మండించినప్పుడు వెలువడే కర్బన ఉద్గారాలు.. హైడ్రోజన్‌ మండినప్పుడు ఉత్పత్తి కావు.  ప్రస్తుతం ఒక కిలో హైడ్రోజన్‌ ఉత్పత్తికి 2-3 డాలర్లు ఖర్చవుతోంది. ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఈ ఖర్చు దిగివస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే దీన్ని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నారు.

సవాళ్లు లేకపోలేదు

గ్రీన్‌ హైడ్రోజన్‌ను నిల్వ - రవాణా చేయడం కొంత సంక్లిష్ట వ్యవహారమే. దీన్ని వివిధ రంగాల్లో వినియోగించడానికి అనువైన ఉపకరణాలు, యంత్రాలు ఆవిష్కరించాల్సి ఉంది. వీటిని త్వరగా ఆవిష్కరించగలిగితే, ప్రపంచ మార్కెట్‌కు అందించి లబ్ధి పొందొచ్చు.


ఎంజీ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌-సెల్‌ టెక్నాలజీ

ఎంజీ మోటార్‌ ఇండియా మూడో తరం హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ టెక్నాలజీని మనదేశంలో ప్రవేశపెట్టనుంది. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌తో నడిచే కారును  తాజాగా ఆవిష్కరించింది. అత్యధిక శక్తి, దీర్ఘకాల మన్నిక, భద్రత, నమ్మకమైన టెక్నాలజీ, పర్యావరణానికి అనుకూలంగా ఉండటం దీని ప్రత్యేకత.


‘కమిన్స్‌‘ హైడ్రోజన్‌ ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌ !

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇంధనంగా పనిచేసే ఇంజిన్లను ఆవిష్కరించడంలో కమిన్స్‌ ఇండియా తొలి అడుగు వేసింది. మీడియం- టు- హెవీ డ్యూటీ ట్రక్కులకు అనువైన హైడ్రోజన్‌ ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌ను ‘బి6. 7హెచ్‌ ఇంజిన్‌’ పేరుతో రూపొందించింది. దీనికి అనుబంధంగా 700 బార్‌ హైడ్రోజన్‌ ట్యాంక్‌ను కమిన్స్‌ ఇండియా తయారు చేసింది. దీనివల్ల ఇంధనాన్ని త్వరగా నింపడానికి వీలువుతుంది. ఈ ఇంజిన్‌తో హెవీ డ్యూటీ ట్రక్కులు, బస్సులు సుదూర ప్రాంతాలకు వెళ్లగలుగుతాయి.


వరుసలో కార్పొరేట్‌ దిగ్గజాలు

పలు కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు ఈ విభాగంలో పెద్దఎత్తున అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

* ఒక కిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ను 1 డాలర్‌ కంటే తక్కువ ధరలో ఉత్పత్తి చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. భారీ స్థాయిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం కోసం రూ.75,000 కోట్ల పెట్టుబడికి ఈ సంస్థ సిద్ధమవుతోంది.

* ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. యూఎస్‌లోని బ్లూమ్‌ ఎనర్జీ  సాంకేతికతను వినియోగిస్తోంది. ఈ పైలెట్‌ ప్రాజెక్టును విశాఖపట్నంలోని ఎన్టీపీసీ సింహాద్రి పవర్‌ప్లాంట్‌ ప్రాంగణంలో చేపట్టారు.

* ఆక్మే గ్రూపు ‘సౌరశక్తి నుంచి గ్రీన్‌ హైడ్రోజన్‌, దాని నుంచి గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంటును రూ.52,000 కోట్లతో కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది. 2027కు పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల ఏటా 12 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు.

* గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు చేపట్టడానికి రెన్యూ పవర్‌, ప్రభుత్వ రంగ సంస్థ  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

* అదానీ గ్రూపు సంస్థ అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ ఎనర్జీస్‌తో కలిసి గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు చేపట్టనుంది. పదేళ్లలో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని