రిలయన్స్ లాభం రూ.15,792 కోట్లు
సవాలుభరిత వాతావరణంలోనూ మా అన్ని వ్యాపారాలూ బలంగా రాణించాయి. జియో రికార్డు స్థాయి ఎబిటా, ఆదాయాలను అందించింది. 5జీ సేవలు ఆవిష్కరించి, 134 నగరాలకు విస్తరించాం.
ఆర్థిక వ్యయాల కారణంగా 15% క్షీణత
ఆదాయం రూ.2.2 లక్షల కోట్లు
28% పెరిగిన జియో లాభం
కొత్తగా 789 రిటైల్ స్టోర్లు
రూ.3,03,530 కోట్లకు స్థూల రుణాలు
సవాలుభరిత వాతావరణంలోనూ మా అన్ని వ్యాపారాలూ బలంగా రాణించాయి. జియో రికార్డు స్థాయి ఎబిటా, ఆదాయాలను అందించింది. 5జీ సేవలు ఆవిష్కరించి, 134 నగరాలకు విస్తరించాం. రిటైల్ వ్యాపారం మెరుగ్గా సాగుతోంది. దేశీయ ఇంధన మార్కెట్లో ఊగిసలాటలున్నా.. సరైన ఇంధన భద్రతను అందించేలా ఎమ్‌జే క్షేత్రాన్ని ప్రారంభించాం. జామ్ నగర్‌లో గిగా ఫ్యాక్టరీల ఏర్పాటులో వేగవంత ప్రగతి ఉంది. మా బలమైన బ్యాలెన్స్ షీట్లు, నగదు నిల్వలు.. ప్రస్తుత వ్యాపార వృద్ధికి, కొత్త అవకాశాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) రూ.2,20,592 కోట్ల ఆదాయంపై రూ.15,792 కోట్ల నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.23.34) ఆర్జించింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.1,91,271 కోట్ల ఆదాయంపై రూ.18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.28.08) పొందింది. అంటే నికర లాభం 15% తగ్గితే, ఆదాయాలు 15% పెరిగాయి.
లాభం ఎందుకు తగ్గిందంటే..
రుణ వ్యయాలు పెరగడం, తరుగుదల కారణంగా లాభం తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక వ్యయాలు 36.4% పెరిగి రూ.5,201 కోట్లకు: ఇతర వ్యయాలు రూ.5,421 కోట్ల మేర పెరిగాయి. అన్ని వ్యాపారాల్లో ఆస్తులను విస్తృతం చేయడంతో, తరుగుదల 32.6% పెరిగి రూ.10,187 కోట్లకు చేరింది. డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై విధించిన పన్ను వల్ల, లాభంపై రూ.1898 కోట్ల ప్రభావం కనిపించింది.
జిల్‌జిల్.. జియో
రిలయన్స్ జియో నికర లాభం రూ.3,615 కోట్ల నుంచి 28.3% వృద్ధితో రూ.4638 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.19,347 కోట్ల నుంచి 18.8% పెరిగి రూ.22,998 కోట్లుగా నమోదైంది. వినియోగదార్ల సంఖ్య 17.5% పెరిగి 43.3 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) రూ.151.6 నుంచి రూ.178.2కు చేరింది. ‘పరిమాణం పరంగా భారత్ వంటి ఏ దేశంలోనూ లేని విధంగా, అత్యంత వేగంతో కూడిన 5జీ సేవలను 3 నెలల్లోనే 134 నగరాలకు అందుబాటులోకి తెచ్చాం. డిసెంబరు కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తామ’ని జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
ఇ-కామర్స్‌లో 38% వృద్ధి
రిలయన్స్ రిటైల్ నికర లాభం 6.4% వృద్ధితో రూ.2,400 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.50,654 కోట్ల నుంచి 18.64% వృద్ధితో రూ.60,096 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో 789 జతచేరడంతో, మొత్తం స్టోర్ల సంఖ్య 17,225కు చేరింది. ఈ త్రైమాసికంలో 20.1 కోట్ల మంది తమ స్టోర్లను సందర్శించారని కంపెనీ తెలిపింది. డిజిటల్ కామర్స్, సరికొత్త కామర్స్ వ్యాపారాలు 38% పెరిగి ఆదాయంలో 18% వాటా అందించాయని పేర్కొంది. ‘సోస్యో, లోటస్ చాక్లెట్ కొనుగోళ్లతో పాటు ‘ఇండిపెండెన్స్’ బ్రాండ్ ఆవిష్కరణతో పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం అయిన’ట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది.
రూ.20,000 కోట్ల సమీకరణ
హరిత ఇంధన ఉత్పత్తి నిమిత్తం గిగా ఫ్యాక్టరీల నిర్మాణంతో పాటు 5జీ సేవలు, రిటైల్ వ్యాపారాల విస్తరణ నిమిత్తం రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌సీడీల జారీ ద్వారా సంస్థ సమీకరించనుంది. ఈ విభాగాలపై ఇప్పటికే పెట్టిన భారీ పెట్టుబడుల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థూల రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే రూ.59,000 కోట్లు పెరిగి రూ.3,03,530 కోట్లకు చేరుకున్నాయి. నగదు నిల్వలు రూ.1,93,282 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర రుణాలు వార్షిక ఎబిటా కంటే తక్కువగా నమోదయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!