సంక్షిప్త వార్తలు(9)

పూర్తిస్థాయి విమానయాన సేవల సంస్థ విస్తారా 2024 మధ్య కల్లా మొత్తం విమానాల సంఖ్యను 70కి పెంచుతామని తెలిపింది.

Updated : 25 Jan 2023 06:47 IST

2024 మధ్య కల్లా విస్తారాకు 70 విమానాలు
మరిన్ని అంతర్జాతీయ మార్గాలు: సీఈఓ వినోద్‌ కన్నన్‌

దిల్లీ: పూర్తిస్థాయి విమానయాన సేవల సంస్థ విస్తారా 2024 మధ్య కల్లా మొత్తం విమానాల సంఖ్యను 70కి పెంచుతామని తెలిపింది. అంతర్జాతీయ మార్గాల సంఖ్యను పెంచుకోనుంది. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ల సంయుక్త సంస్థ అయిన విస్తారా, 2015లో కార్యకలాపాలు ప్రారంభించాక  తొలిసారిగా 2022 డిసెంబరు త్రైమాసికంలో నిర్వహణ లాభాలు ప్రకటించగలిగింది. ‘అంతర్జాతీయంగా సామర్థ్య శాతాన్ని 25-30 శాతానికి పెంచుకున్నాం. ఇది మాకు సానుకూలతలను, గొప్ప మార్పును తీసుకురాగలద’ని కంపెనీ సీఈఓ వినోద్‌ కన్నన్‌ పేర్కొన్నారు. ఎయిరిండియాలో విస్తారా విలీనం కానున్న సంగతి తెలిసిందే. ‘వచ్చే ఏడాది మధ్య కల్లా ఏడు బోయింగ్‌ 787లతో కలిపి మొత్తం 70 విమానాలు సంస్థకు ఉంటాయి. ఇందులో 10 ఏ321, 53 ఏ 320 నియో విమానాలుంటాయ’ని కన్నన్‌ వివరించారు.


పీఎన్‌బీ హౌసింగ్‌ లాభంలో 43% వృద్ధి

ముంబయి: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం 43 శాతం పెరిగి రూ.269 కోట్లకు చేరింది. రుణాల్లో వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ.. వడ్డీ రేట్లు పెంచడం వల్ల,   నికర వడ్డీ ఆదాయం 67 శాతం పెరిగి రూ.734 కోట్లకు చేరింది. మొత్తం రుణాల్లో 92 శాతం వరకు వాటా ఉండే రిటైల్‌ రుణాలు 6.6 శాతమే పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.1,411 కోట్ల నుంచి రూ.1,713.64 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.06 శాతం నుంచి 4.87 శాతానికి తగ్గినా, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి ఎటువంటి మార్పు లేకుండా 3.22 శాతంగా నమోదైంది.  


32% పెరిగిన ఎస్‌బీఐ కార్డ్‌ లాభం

దిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ నికర లాభం అక్టోబరు- డిసెంబరులో 32 శాతం పెరిగి రూ.509 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం 386 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.3,140 కోట్ల నుంచి రూ.3,656 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయాలు రూ.1,719 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.1,974 కోట్లకు చేరాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.4 శాతం నుంచి 2.22 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 0.83 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గింది.


ఫెడెక్స్‌ సీఈఓ రాజేశ్‌ సుబ్రమణియమ్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

న్యూయార్క్‌: ఫెడెక్స్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన రాజేశ్‌ సుబ్రమణియన్‌కు 2023 ఏడాదికి ప్రతిష్ఠాత్మక ‘హొరాటియో ఆల్గర్‌ అవార్డ్‌’ లభించింది. ఉత్తర అమెరికాలో వ్యాపార, పౌర, సాంస్కృతిక రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డునిస్తారు. మొత్తం 13 మందిని దీనిని ఎంపిక చేశారు. తమ రంగంలోని సమస్యలను సమర్థంగా ఎదుర్కొని, విజయవంతం కావడంతో పాటు విద్య, ఇతరత్రా దాతృత్వ సేవలకు కట్టుబడి ఉండే వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ‘కఠిన శ్రమ, పట్టుదల ద్వారా, ఎవరైనా సరే ప్రతికూలతలను ఎదుర్కొని మరీ విజయం సాధించొచ్చ’ని 55 ఏళ్ల సుబ్రమణియమ్‌ పేర్కొన్నారు.


గ్రాన్యూల్స్‌ ఇండియా లాభం రూ.124 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా మూడో త్రైమాసికానికి రూ.1146 కోట్ల ఆదాయాన్ని, రూ.124 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.997 కోట్లు, నికరలాభం రూ.101 కోట్లు ఉన్నాయి. వీటితో పోల్చితే ఈసారి ఆదాయం 15%, నికరలాభం 23% పెరిగాయి. అమెరికాలో అధిక అమ్మకాల వల్లే ఆదాయాలు పెరిగినట్లు కంపెనీ వివరించింది. గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రధానంగా పారాసెట్మాల్‌ ఉత్పత్తి చేస్తోంది. సమీప భవిష్యత్తులో పారాసెట్మాల్‌ అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి తెలిపింది.

యాంఫెటమైన్‌ మిక్స్‌డ్‌ సాల్ట్స్‌ క్యాప్సూల్‌కు యూఎస్‌లో అనుమతి:  యాంఫెటమైన్‌ మిక్స్‌డ్‌ సాల్ట్స్‌ క్యాప్సూల్‌ను అమెరికాలో విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది. తకేడా ఫార్మాకు చెందిన అడెరాల్‌ అనే బ్రాండుకు ఇది బయోఈక్వలెంట్‌ మందు. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) వ్యాధికి చికిత్సలో వినియోగించే ఈ మందు, అమెరికాలో ఏడాదికి 1.56 బిలియన్‌ డాలర్ల మేర అమ్ముడవుతోంది.


కావేరీ సీడ్‌ కంపెనీకి రూ.37.54 కోట్ల త్రైమాసిక లాభం  

ఈనాడు, హైదరాబాద్‌: కావేరీ సీడ్‌ కంపెనీ డిసెంబరు త్రైమాసికానికి రూ.123.49 కోట్ల ఆదాయాన్ని, రూ.37.54 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.102.08 కోట్లు, నికరలాభం రూ.9.08 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 20.97%, నికరలాభం 313%  పెరిగాయి. హైబ్రిడ్‌ వరి విత్తనాల ఆదాయం 117% పెరగ్గా, పత్తి విత్తనాల విభాగంలో 6% వృద్ధి నమోదైనట్లు కావేరీ సీడ్‌ కంపెనీ వెల్లడించింది. విత్తనాల ఎగుమతులు పెరుగుతున్నాయని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తోంది.


మూడేళ్లలో 500 నియామకాలు
ట్యాలీ సొల్యూషన్స్‌

ముంబయి: అంతటా ఉద్యోగ కోతలు వినిపిస్తున్న వేళ 2 సంస్థలు నియామకాలు జరుపుతామని ప్రకటించాయి. రాబోయే మూడేళ్లలో 500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ట్యాలీ సొల్యూషన్స్‌ మంగళవారం ప్రకటించింది. వీరిలో 60 శాతం మందిని ఇంజినీరింగ్‌, సాంకేతికత బృందంలో.. మిగిలిన వారిని విక్రయాలు, మార్కెటింగ్‌, మానవ వనరులు, ఇతర విభాగాల్లో నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం సంస్థలో వివిధ విభాగాల్లో 1,000 మంది పనిచేస్తున్నారు.

జొమాటో... 800 మంది: ఆహార డెలివరీ చేసే జొమాటో కూడా 800 మందిని నియమించుకోనున్నట్లు పేర్కొంది. ఇంజినీర్లు, ప్రోడక్ట్‌ ఇంజినీర్లు, గ్రోత్‌ ఇంజినీర్ల హోదాల్లో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేశారు.


2022లో ఫాస్టాగ్‌ టోల్‌ వసూళ్లు రూ.50,855 కోట్లు

దిల్లీ: దేశంలో ఫాస్టాగ్‌ల ద్వారా టోల్‌ రుసుము వసూళ్లు 2022లో రూ.50,855 కోట్లుగా నమోదయ్యాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వెల్లడించింది. 2021లో  వసూలైన రూ.34,778 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం అధికం. 2022 డిసెంబరులో రోజువారీ సరాసరి టోల్‌ వసూళ్లు (ఫాస్టాగ్‌) రూ.134.44 కోట్లుగా నమోదయ్యాయి. క్రిస్మస్‌ ముందురోజైన 24న అత్యధికంగా రూ.144.19 కోట్ల మేర ఒక రోజు వసూళ్లు నమోదయ్యాయి.

* ఫాస్టాగ్‌ లావాదేవీలు కూడా వార్షిక ప్రాతిపదికన 2022లో 48 శాతం వృద్ధి చెందాయి. 2021లో 219 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, 2022లో 324 కోట్లకు చేరుకున్నాయి.

* ఇప్పటి వరకు 6.4 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేసినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్‌ ఉన్న టోల్‌ప్లాజాలు 922 నుంచి 1,181కు (323 రాష్ట్ర రహదారి ఫీజు ప్లాజాలతో కలిపి) చేరాయి. జాతీయ రహదారుల టోల్‌ ప్లాజాల వద్ద వేచి చూసే సమయాన్ని తగ్గించే ఉద్దేశంతో ఫాస్టాగ్‌ను తీసుకొచ్చారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి ప్రభుత్వం అన్ని ప్రైవేటు, వాణిజ్య వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. నిబంధనల ప్రకారం ఫాస్టాగ్‌ లేని వాహనాలు టోల్‌ ఫీజుకు రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంది.


ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు జేపీ ఇన్‌ఫ్రా రుణాల బదిలీ

దిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌ మినహా కన్సార్షియంలోని అన్ని బ్యాంకులు తమ రుణాలను ‘జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)కి బదిలీ చేశాయని దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రా మంగళవారం పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ అలహాబాద్‌ బెంచ్‌ 2017 ఆగస్టు 9న జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో, దివాలా స్మృతి నిబంధనల కింద కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్‌పీ)లో జేపీ ఇన్‌ఫ్రా (జేఐఎల్‌) ఉంది. జేఐఎల్‌ తమకు రూ.9,783 కోట్ల బకాయి ఉన్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌, ఐఐఎఫ్‌సీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఐఎఫ్‌సీఐ, జే అండ్‌ కే బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకులతో కూడిన కన్సార్షియం దరఖాస్తు చేసుకుంది. తొలి జాబితా కింద 12 కంపెనీలపై దివాలా ప్రక్రియలను ప్రాంభించడానికి ఎన్‌సీఎల్‌టీ వద్దకు వెళ్లాలని బ్యాంకులను ఆర్‌బీఐ గతంలో ఆదేశించింది. ఆ 12 కంపెనీల జాబితాలో జేఐఎల్‌ తొలి కంపెనీ కావడం గమనార్హం.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని