మధ్యతరహా కంపెనీల్లో పెట్టుబడుల కోసం..

మదుపర్లు మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా.. కార్పొరేట్‌ పాలన మెరుగ్గా ఉన్న సంస్థలను సూచించే ఓ సూచీని ఐరావత్‌ ఇండిసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించింది.

Published : 25 Jan 2023 02:52 IST

30 కంపెనీలతో ‘ఆటమ్‌’ సూచీ
సెబీ మాజీ ఛైర్మన్‌ ఎం.దామోదరన్‌

దిల్లీ: మదుపర్లు మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా.. కార్పొరేట్‌ పాలన మెరుగ్గా ఉన్న సంస్థలను సూచించే ఓ సూచీని ఐరావత్‌ ఇండిసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించింది. ఆటమ్‌ (ఐరావత్‌ టచ్‌స్టోన్‌ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌)గా వ్యవహరించే ఇందులో స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన 30 మధ్య తరహా కంపెనీలు ఉంటాయి. యూటీఐ, ఐడీబీఐ, సెబీకి గతంలో ఛైర్మన్‌గా  వ్యవహరించిన ఎం.దామోదరన్‌, డెసిమల్‌ పాయింట్‌ అనలటిక్స్‌ సంయుక్త ఆధ్వర్యంలోని ఐరావత్‌ ఇండిసెస్‌ ఈ సూచీని ఏర్పాటు చేసింది. భారత మ్యూచువల్‌ఫండ్‌ సంస్థల సంఘం (యాంఫీ) జాబితాలోని 150 మధ్య తరహా కంపెనీల నుంచి పై 30 కంపెనీలను ఐరావత్‌ ఇండిసెస్‌ ఎంపిక చేసింది. ఇందుకు ఆర్థిక నాణ్యత, కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకున్నారు. యాంఫీ 150 కంపెనీల జాబితాలో చేసే సవరణల ఆధారంగా, ప్రతి ఆరు నెలలకోసారి ఈ సూచీలో మార్పు చేర్పులు జరుగుతాయి. ‘సాధారణంగా మధ్య తరహా కంపెనీల్లో పెట్టుబడులు ముప్పుతో కూడుకున్నవన్న భావన ఉంది. ఈ అభిప్రాయాన్ని తొలగించేందుకు, కార్పొరేట్‌ పాలన బలంగా ఉండే కంపెనీలను గుర్తించేందుకు రూపొందించిందే ఆటమ్‌ సూచీ’ అని దామోదరన్‌ పేర్కొన్నారు. దేశంలో ఆస్తుల నిర్వహణ సేవల్లో గణనీయ వృద్ధి ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఎన్ని సూచీలున్నా తక్కువేనని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని