Cafe coffee day: కాఫీడేకు సెబీ రూ.26 కోట్ల జరిమానా

అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలపై, కేఫ్‌ కాఫీడే లను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.26 కోట్ల జరిమానా విధించింది.

Updated : 25 Jan 2023 09:33 IST

దిల్లీ: అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలపై, కేఫ్‌ కాఫీడే లను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.26 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. మైసూర్‌ అమాల్గమేటెడ్‌ కాఫీ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌ (ఎంఏసీఈఎల్‌), దాని అనుబంధ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ, వడ్డీతో కలిపి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. బకాయిల వసూలు నిమిత్తం సమర్ధమైన చర్యలు చేపట్టేందుకు, ఒక స్వతంత్ర న్యాయ సంస్థను నియమించుకోవాలని సూచించింది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏడు అనుబంధ సంస్థల నుంచి కాఫీ డే ప్రమోటరుకు చెందిన మైసూర్‌ అమాల్గమేటెడ్‌ కాఫీ ఎస్టేట్‌కు రూ.3,535 కోట్లు మళ్లించారని సెబీ గుర్తించింది. ఆ ఏడు అనుబంధ సంస్థలు- కాఫీ డే గ్లోబల్‌, టాంగ్లిన్‌ రిటైల్‌ రియాల్టీ డెవలప్‌మెంట్స్‌, టాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌, గిరి విద్యుత్‌ (ఇండియా), కాఫీ డే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌, కాఫీ డే ట్రేడింగ్‌, కాఫీ డే ఎకాన్‌. ‘ఎంఏసీఈఎల్‌కు ఏడు అనుబంధ సంస్థల నుంచి బదిలీ చేసిన నిధులు వి.జి.సిద్దార్ధ, ఆయన కుటుంబీకులు, సంస్థలకు బదిలీ అయ్యాయ’ని సెబీ పేర్కొంది. బదిలీ చేసిన రూ.3,535 కోట్లలో.. 2022 సెప్టెంబరు 30 నాటికి రూ.110.75 కోట్లనే అనుబంధ సంస్థలు వసూలు చేయగలిగాయని సెబీ పేర్కొంది. అనైతిక వ్యాపార విధానాలు, మోసపూరిత కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని, రూ.25 కోట్ల జరిమానాను సెబీ విధించింది. అలాగే నమోదిత, వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను మరో రూ.1 కోటి విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని