సంక్షిప్త వార్తలు(8)
ఇండియన్ బ్యాంక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.1396 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.690 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు.
ఇండియన్ బ్యాంక్ లాభం రెట్టింపు
దిల్లీ: ఇండియన్ బ్యాంక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.1396 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.690 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు. వడ్డీ ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గడమే ఇందుకు కారణం. మొత్తం ఆదాయం రూ.11,482 కోట్ల నుంచి రూ.13,551 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం రూ.4,395 కోట్ల నుంచి 25% వృద్ధితో రూ.5,499 కోట్లకు పెరగడం లాభంపై సానుకూల ప్రభావాన్ని చూపింది. బ్యాంకు స్థూల నికర నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) 9.13 శాతం నుంచి 6.53 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.72 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. దీంతో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,439 కోట్ల నుంచి రూ.1,474 కోట్లకు తగ్గించారు. నికర వడ్డీ మార్జిన్ 3.03 శాతం నుంచి 3.74 శాతానికి పెరిగింది.
సిప్లా లాభం రూ.808 కోట్లు
దిల్లీ: ఔషధ దిగ్గజం సిప్లా డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.808 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.757 కోట్లతో పోలిస్తే ఇది 7% ఎక్కువ. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,479 కోట్ల నుంచి రూ.5,810 కోట్లకు వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో కంపెనీ రూ.2,311 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,176 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.16,503 కోట్ల నుంచి రూ.17,014 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికంలో కీలకమైన భారత్, అమెరికా వ్యాపారాల్లో వృద్ధి జోరు కొనసాగిందని, మొత్తం ఆదాయ వృద్ధిలో ఇవి 6%, 11% తోడ్పాటు అందించినట్లు సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈఓ ఉమాంగ్ వోహ్రా తెలిపారు. ఉత్తర అమెరికా ప్రాంతంలో అత్యధిక త్రైమాసిక ఆదాయమైన 195 మి.డాలర్లకు కంపెనీ నమోదుచేసింది.
ఉద్యోగులకు 98 కోట్ల షేర్లు: ఎయిరిండియా
ముంబయి/దిల్లీ: స్టాక్ ఆప్షన్ పథకంలో భాగంగా శాశ్వత ఉద్యోగులకు దాదాపు 98 కోట్ల షేర్లను ఎయిరిండియా ఆఫర్ చేసింది. ఎంప్లాయీస్ షేర్ బెనిఫిట్ (ఈఎస్‌బీ) పథకం 2022లో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ శాశ్వత ఉద్యోగులకు కూడా షేర్లను అందించనున్నారు. ఈ పథకంతో దాదాపు 8,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. 2022 జనవరి 27న ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పగ్గాలను టాటా గ్రూప్ చేపట్టింది. ఈ కొనుగోలు ప్రక్రియలోనే షేరు కొనుగోలు ఒప్పందం కూడా ఉంది. ఒక్కో షేరును 27 పైసల చొప్పున కేటాయిస్తారు. సంస్థ కొనుగోలు సమయంలో షేరు పుస్తక విలువ 87-90 పైసలు కాగా, అంతకంటే తక్కువ మొత్తానికే కేటాయిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం
దిల్లీ: మైక్రోసాఫ్ట్ సేవల్లో బుధవారం కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడినట్లు ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదార్ల నుంచి ఫిర్యాదులొచ్చాయి. అయితే తమ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ‘టీమ్స్’, ఇ మెయిల్ సిస్టమ్ ‘అవుట్‌లుక్’ వంటి ఆన్‌లైన్ సేవల్లో సమస్యలు తగ్గినట్లు కొద్ది గంటల అనంతరం కంపెనీ పేర్కొంది. వేల మంది వినియోగదార్లు.. టీమ్స్, అవుట్‌లుక్, ద అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్, ఎక్స్‌బాక్స్ లైవ్ ఆన్‌లైన్ గేమింగ్ సేవల్లో సమస్యలను ఎదుర్కొన్నారంటూ డౌన్‌డిటెక్టర్ అనే వెబ్‌సైట్ ప్రకటించింది. చాలా మంది వినియోగదార్లు సైతం సేవలు నిలిచిపోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అయితే ఆ తర్వాత చాలా వరకు సమస్యలు క్రమంగా తగ్గాయని డౌన్‌డిటెక్టర్ తెలిపింది. ‘అన్ని సేవలు పుంజుకునేలా మేం కృషి చేస్తున్నాం. రికవరీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సేవలను అదనపు మౌలిక వసతులకు అనుసంధానం చేస్తున్నామ’ని మైక్రోసాప్ట్ 365 స్టేటస్ ట్విటర్ ఖాతా వెల్లడించింది.
28, 29 తేదీల్లో ‘స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూపు’ సమావేశం
ఈనాడు, హైదరాబాద్: జీ20 కూటమికి మనదేశం నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ‘స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూపు’ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అంకుర సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి, తగిన సిఫారసులు చేయడం ఈ సమావేశ ప్రధానోద్దేశం. ఈ నెల 28- 29 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి జీ20 దేశాల ప్రతినిధులు, తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, మనదేశానికి చెందిన పలువురు అంకుర సంస్థల వ్యవస్థాపకులు హాజరవుతారని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థ మనదేశంలో ఉన్నందున, ఈ విభాగంలో మన అనుభవాలను, ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను పోల్చిచూసుకుని, మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఈ సమావేశం వీలు కల్పిస్తుందని స్టార్టప్ 20 ఇండియా ఛైర్ చింతన్ వైష్ణవ్ వివరించారు.
అమరరాజాకు రూ.302 కోట్ల లాభం
ఈనాడు, హైదరాబాద్: డిసెంబరు త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్ రూ.2,637 కోట్ల ఆదాయాన్ని, రూ.302 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.2,365 కోట్లు, నికరలాభం రూ.197 కోట్లు ఉన్నాయి. వాహన, టెలికాం విభాగాల్లో అధిక అమ్మకాల వల్లే ఆదాయాలు, లాభాలు పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. లిథియమ్- ఆయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, ఛార్జర్ల అమ్మకాల్లోనూ ఆకర్షణీయ వృద్ధి ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ముప్పు పొంచి ఉన్నా, దేశీయంగా మెరుగైన అమ్మకాలు సాధించినట్లు, తమ ఉత్పత్తులపై వినియోగదార్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అమరరాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా వివరించారు. ఇంధనం, మొబిలిటీ విభాగాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు ఆయన తెలిపారు.
థ్రైవ్ క్యాపిటల్‌లో ముకేశ్‌కు వాటా
ముంబయి: అమెరికా వ్యాపారవేత్త జోష్ కుష్నర్ స్థాపించిన వెంచర్ క్యాపిటల్ సంస్థ థ్రైవ్ క్యాపిటల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ వాటా కొనుగోలు చేస్తున్నారు. ముకేశ్‌తో పాటు బ్రెజిల్‌కు చెందిన జార్జ్ పాలో లెమాన్, ఫ్రాన్స్‌కు చెందిన జేవియర్ నీల్, కేకేఆర్ అండ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు హెన్రీ క్రావిస్, వాల్ డిస్నీ కంపెనీ సీఈఓ రాబర్ట్ ఐజర్ కలిసి 175 మిలియన్ డాలర్లు వెచ్చించి థ్రైవ్ క్యాపిటల్‌లో 3.3% వాటా కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. 2021లో గోల్డ్‌మ్యాన్ శాక్స్ గ్రూప్‌నకు వాటా విక్రయించిన సమయంలో, థ్రైవ్ ఒప్పంద విలువలు 3.6 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు ఆ మొత్తం 5.3 బి.డాలర్లకు చేరిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ సంస్థ నిర్వహణలో గత ఏడాది ఆఖరుకు 15 బి.డాలర్ల ఆస్తులున్నాయి. 2009లో కుష్నర్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌కు ఈయన తమ్ముడు.
ఫ్యూచర్ రిటైల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగిన కిశోర్ బియానీ
దిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్ద దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్) సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పదవి నుంచి కిశోర్ బియానీ వైదొలిగారు. ఈ కంపెనీ బోర్డును ఇప్పటికే సస్పెండ్ చేయగా, సీఎండీ పదవికి ఆయన తాజాగా రాజీనామా చేశారు. 2007లో సంస్థ ప్రారంభం నుంచి ఫ్యూచర్ రిటైల్‌తో కొనసాగిన ఆయన బంధం తాజాగా ముగియడంతో భావోద్వేగ వీడ్కోలు పలికారు. ‘కంపెనీ ఎదుగుదల కోసం నేను చేయాల్సిందంతా చేశాను. దురదృష్టవశాత్తు వ్యాపార పరిస్థితులు తలకిందులయ్యాయి. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంద’ని తన రాజీనామా లేఖలో బియానీ పేర్కొన్నారు. ఆ లేఖను కంపెనీ పరిష్కార వృత్తి నిపుణుడికి పంపించారు. ప్రతిని స్టాక్ ఎక్స్చేంజీలకూ పంపించారు.
* ఫ్యూచర్ రిటైల్.. బహుళ రిటైల్ ఫార్మాట్లలో విక్రయ కేంద్రాలను నిర్వహించింది. బిగ్ బజార్, ఈజీడే, ఫుడ్ హాల్ తదితర బ్రాండ్ల కింద హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్లను నడిపింది. ఒక దశలో సుమారు 430 నగరాల్లో 1,500కు పైగా విక్రయ కేంద్రాలను ఎఫ్‌ఆర్‌ఎల్ నిర్వహించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!