డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.1247 కోట్ల లాభం

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ డిసెంబరు త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.6,770 కోట్ల ఆదాయంపై రూ.1,247 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 26 Jan 2023 02:32 IST

అమెరికాలో 64%, రష్యాలో 45% పెరిగిన ఆదాయం
దేశీయంగా 10 శాతం వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ డిసెంబరు త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.6,770 కోట్ల ఆదాయంపై రూ.1,247 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈపీఎస్‌ రూ.74.95గా నమోదైంది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.5,319 కోట్లు, నికరలాభం రూ.706 కోట్లే ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 27%, నికరలాభం 77% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలలకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఆదాయం రూ.18,291 కోట్లు, నికరలాభం రూ.3,548 కోట్లుగా ఉన్నాయి.

అమెరికా, రష్యాల్లో: డిసెంబరు త్రైమాసికంలో ఉత్తర అమెరికా ఆదాయాల్లో 64%, దేశీయంగా 10% వృద్ధి నమోదైంది. ఉత్తర అమెరికాలో 5 కొత్త ఔషధాలు విడుదల చేసింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద 78  ఔషధాలకు అనుమతి కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో 41 ఔషధాలకు పారా-4 అనుమతి కోరింది. రష్యా నుంచి ఆదాయాలు 45% పెరిగినట్లు కంపెనీ వివరించింది. ధరలు పెంచడం, కొత్త మందులు ప్రవేశపెట్టడం, మందులు ఎక్కువగా విక్రయించడం వల్ల రష్యా ఆదాయాలు బాగా పెరిగే అవకాశం కలిగినట్లు పేర్కొంది. యూకే, కొన్ని ఇతర ఐరోపా దేశాల్లోనూ ఆదాయాలు పెరిగాయి. కానీ జర్మనీ, రుమేనియా వంటి దేశాల్లో ఆదాయాలు క్షీణించాయి. యూఎస్‌, రష్యా మార్కెట్లో విక్రయాలు పెరిగినందునే మెరుగైన ఫలితాలు నమోదు చేశామని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ-ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేయడం ద్వారా ,కొత్త మందులను ఆవిష్కరించి ప్రపంచ మార్కెట్‌కు అందించాలనేది తమ లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు అక్టోబరు-డిసెంబరులో సంస్థ రూ.480 కోట్లు వెచ్చించింది. త్రైమాసిక ఆదాయంలో ఇది 7.1 శాతానికి సమానం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని