స్థిరాస్తిలోకి రూ.64,000 కోట్ల పెట్టుబడులు

దేశంలో స్థిరాస్తి పెట్టుబడులు భారీగా ఊపందుకుంటున్నాయి. గత ఏడాది ఇవి జీవన కాల గరిష్ఠమైన 7.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్లు)కు చేరాయని కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ దక్షిణాసియా నివేదిక వెల్లడించింది.

Updated : 27 Jan 2023 09:43 IST

జీవన కాల గరిష్ఠానికి చేరిక
2022లో 32% పెరిగాయ్‌
సీబీఆర్‌ఈ దక్షిణాసియా నివేదిక

దిల్లీ: దేశంలో స్థిరాస్తి పెట్టుబడులు భారీగా ఊపందుకుంటున్నాయి. గత ఏడాది ఇవి జీవన కాల గరిష్ఠమైన 7.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్లు)కు చేరాయని కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ దక్షిణాసియా నివేదిక వెల్లడించింది. భారత స్థిరాస్తి పెట్టుబడులు 2022 అక్టోబరు-డిసెంబరులో 2.3 బి.డాలర్లుగా నమోదయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన 64 శాతం, వార్షిక ప్రాతిపదికన 115 శాతం ఇవి పెరిగాయని ‘ఇండియా మార్కెట్‌ మానిటర్‌ 2022’ పేరుతో రూపొందించిన నివేదికలో సీబీఆర్‌ఈ తెలిపింది. దీని ప్రకారం..

2022లో మొత్తం స్థిరాస్తి పెట్టుబడుల పరిమాణంలో విదేశీ పెట్టుబడిదార్లు 57 శాతం వాటాతో ముందున్నారు. కెనడా నుంచి విదేశీ నిధులు 37 శాతం వచ్చాయి. అమెరికా నుంచి 15 శాతం పెట్టుబడులు దేశీయ స్థిరాస్తి రంగంలోకి తరలివచ్చాయి.

దేశీయ పెట్టుబడిదార్ల నుంచి 40 శాతం పెట్టుబడులు వచ్చాయి.

మొత్తం పెట్టుబడుల్లో సంస్థాగత మదుపర్ల వాటా 51 శాతంగా ఉంది. డెవలపర్లు 32 శాతం పెట్టుబడులు పెట్టారు.

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెట్టుబడి కార్యకలాపాలు ఎక్కువగా జరిగాయి. తర్వాత స్థానంలో ముంబయి ఉంది. ఈ రెండు నగరాలు కలిపి 56 శాతం పెట్టుబడుల్ని ఆకర్షించాయి.

భూమి, డెవలప్‌మెంట్‌ సైట్లలోకి అధికంగా 48 శాతం పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయ విభాగంలోకి 35 శాతం నిధులు వచ్చాయి.

ఇళ్ల నిర్మాణం/అభివృద్ధి కోసం స్థలం/భూమి కొనుగోలు కోసం 44 శాతం నిధులు వెచ్చించారు. మిశ్రమ వినియోగ డెవలప్‌మెంట్‌ కోసం 25 శాతం నిధులు చొప్పించారు.

‘స్థిరాస్తి రంగంలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలి రావడం విశేషం. భారత స్థిరాస్తి రంగంలో వృద్ధికి ఉన్న అవకాశాలను ఇది సూచిస్తోంద’ని సీబీఆర్‌ఈ (ఇండియా, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా) ఛైర్మన్‌, సీఈఓ అన్షుమాన్‌ మాగజైన్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని