89% మంది చిన్న మదుపర్లకు నష్టాలే

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈక్విటీ ఫ్యూచర్స్‌, ఆప్షన్ల (ఎఫ్‌&ఓ) విభాగంలో ట్రేడ్‌ చేసిన చిన్న మదుపర్లలో 89 శాతం మంది నష్టాలనే చవిచూశారని సెబీ అధ్యయనం వెల్లడించింది.

Published : 27 Jan 2023 05:41 IST

ఈక్విటీ ఎఫ్‌&ఓ ట్రేడింగ్‌పై సెబీ అధ్యయనం

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈక్విటీ ఫ్యూచర్స్‌, ఆప్షన్ల (ఎఫ్‌&ఓ) విభాగంలో ట్రేడ్‌ చేసిన చిన్న మదుపర్లలో 89 శాతం మంది నష్టాలనే చవిచూశారని సెబీ అధ్యయనం వెల్లడించింది. అంటే ప్రతి 10 మందిలో తొమ్మిది మందికి నష్టాలేనన్నమాట. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని.. నష్టముప్పు నివారణకు సంబంధించి బ్రోకర్లు, ఎక్స్ఛేంజీలు చేపట్టాల్సిన అదనపు చర్యలపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని సెబీ పేర్కొంది. ఎప్పటికప్పుడు మదుపర్ల లాభ/నష్ట వివరాలను విశ్లేషించి, వెల్లడించడం ద్వారా.. మార్కెట్‌లో ఉన్న ముప్పుపై వాళ్లలో అవగాహన  మరింత పెంచే అవకాశం ఉంటుందని సెబీ పేర్కొంది. కొవిడ్‌-19 ముందు ఆర్థిక సంవత్సరమైన 2018-19; కొవిడ్‌-19 పరిణామాల తదుపరి సంవత్సరమైన 2021-22లలో ఈక్విటీ ఎఫ్‌ఖీఓ విభాగంలో చిన్న మదుపర్లకు నికరంగా వచ్చిన లాభం లేదా నష్టం ఆధారంగా సెబీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందుకోసం అత్యుత్తమ 10 మంది స్టాక్‌ బ్రోకర్లకు చెందిన మదుపర్ల ట్రేడింగ్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ అధ్యయనం ప్రకారం..

2021-22లో ఈక్విటీ ఎఫ్‌ఖీఓలో 89 శాతం మంది చిన్న మదుపర్లు నష్టపోయారు. సగటున ఒక్కొక్కరి నష్టం రూ.1.1 లక్షలు. బాగా క్రియాశీలకంగా ఉండే ట్రేడర్లలో 90 శాతం మంది సగటున రూ.1.25 లక్షలు పోగొట్టుకున్నారు.

కేవలం 11 శాతం మందే లాభాలు ఆర్జించారు. వీరి సగటు లాభం రూ.1.5 లక్షలు. క్రియాశీలకంగా ట్రేడ్‌ చేసే వారి విషయానికొస్తే.. లాభాలొచ్చిన వాళ్లు 10 శాతం మంది ఉండగా, సగటు లాభం రూ.1.9 లక్షలు.

అత్యుత్తమ 10 బ్రోకరేజీ సంస్థల వద్ద ఈక్విటీ ఎఫ్‌ఖీఓ విభాగంలో ట్రేడ్‌ చేస్తున్న చిన్న మదుపర్ల సంఖ్య 2021-22లో 45.2 లక్షలుగా ఉంది. 2018-19లోని 7.1 లక్షల మందితో పోలిస్తే ఈ సంఖ్య 6 రెట్లకు పైగా పెరిగింది.  

ట్రేడింగ్‌ చేసే చిన్న మదుపర్లలో 30-40 ఏళ్ల వయస్సున్న వాళ్లే ఎక్కువ మంది. మొత్తం సంఖ్యలో వీళ్లు 39 శాతం. ఇక 20-30 ఏళ్ల వయస్సున్న వాళ్లు 36 శాతం మంది ఉంటారు. 2018-19లో వీళ్లు 11 శాతమే.

2018-19లోను, 2021-22లోనూ ఈక్విటీ ఎఫ్‌ఖీఓ ట్రేడింగ్‌ చేస్తున్న వాళ్లలో మగవాళ్లే ఎక్కువ (80%).

2021-22లో ఆప్షన్లలో ట్రేడ్‌ చేసిన చిన్న మదుపర్లు 98 శాతం మంది కాగా.. ఫ్యూచర్లలో ట్రేడ్‌ చేసిన వాళ్లు 11 శాతం మంది. 2018-19లో ఆప్షన్ల ట్రేడర్లు 89%, ఫ్యూచర్ల ట్రేడర్లు 43 శాతంగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు