Budget 2023: మధ్య తరగతికి తీపి కబురందేనా?

దేశంలో మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన ప్రభావాన్ని చూపే స్థాయికి మధ్యతరగతి చేరింది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు మధ్యతరగతికి చెందిన వారుండగా.. వచ్చే పాతికేళ్లలో వీరి సంఖ్య రెట్టింపు కానుంది.

Updated : 27 Jan 2023 09:16 IST

బడ్జెట్‌ 2023-24

దేశంలో మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన ప్రభావాన్ని చూపే స్థాయికి మధ్యతరగతి చేరింది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు మధ్యతరగతికి చెందిన వారుండగా.. వచ్చే పాతికేళ్లలో వీరి సంఖ్య రెట్టింపు కానుంది. ఇంత కీలకమైన మధ్యతరగతి ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వాలు నెరవేర్చడం లేదనే నిరాశ ప్రతి బడ్జెట్‌ (Budget 2023) సమయంలోనూ వ్యక్తమవుతోంది.  

మా సంపాదనపై కడుతున్న పన్ను భావ్యమేనా?

మధ్య తరగతి ప్రజలు ఎపుడూ చేసే ఫిర్యాదు ఏమిటంటే.. తాము సంపాదిస్తున్న మొత్తంతో పోలిస్తే, కడుతున్న పన్నుల శాతం ఎక్కువ అని. సంపన్నులతో పోలిస్తే తామే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నామనే ఆవేదన వ్యక్తమవుతోంది. అసంఘటిత రంగంలో, తమకంటే ఎంతో ఎక్కువ సంపాదిస్తున్న వారు పైసా పన్ను చెల్లించకపోగా, ప్రభుత్వ రాయితీలు పొందుతుండటాన్ని ఎత్తి చూపుతున్నారు. సంపన్నులకేమో వేర్వేరు పన్ను రాయితీలూ లభిస్తున్నాయి. కానీ నెలవారీ ఖర్చులు గడవడమే, గగనమవుతున్న తమ సంపాదనపై పన్నులు అధికం కావడంతో పాటు, ఏ విధమైన ప్రభుత్వ సాయానికీ నోచుకోక, అనారోగ్యం వస్తే అప్పుల పాలవుతున్నామని చెబుతున్నారు.

పొదుపు తగ్గితే ఏమవుతుందంటే

దేశీయ గృహస్థుల పొదుపు 2021-22లో అయిదేళ్ల కనిష్ఠానికి చేరింది. స్థూలంగా వ్యక్తుల ఆర్థిక పొదుపు 2020-21లో 15.9 శాతంగా నమోదైంది. ధరలు పెరుగుతున్నందున, ఖర్చులకే సంపాదనలో అధికమొత్తం వెచ్చిస్తున్నందున, పొదుపు కాస్తా 2021-22 నాటికి 10.8 శాతానికి పరిమితమైంది.  ‘పొదుపు తగ్గడం వల్ల, దిగువ మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితి మరింత దిగజారుతుంద’ని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసర ఖర్చు వస్తే, ఇంట్లోని బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం, లేదా చిన్నపాటి ఆస్తులను అమ్ముకోవడమే వీరికి దిక్కవుతోంది.

దిగువ మధ్యతరగతిపైనే భారమంతా: రఘురామ్‌ రాజన్‌

‘కొవిడ్‌ సమయంలో ఎగువ మధ్య తరగతి ప్రజలు (సంస్థల నిర్వాహకులు, ఉన్నతాధికారులు)  ఇంటి నుంచే పని చేసి సంపాదించారు. అయితే నేరుగా వెళ్లి పనిచేయాల్సిన దిగువ మధ్యతరగతి ప్రజలు, ఏమీ చేయలేకపోయారు. పని చేయనందున, ఇలాంటి వారికి ప్రైవేటు కంపెనీలు జీతాలు చెల్లించలేదు. అదే పేదలుగా నమోదైన వారికి, ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా కేంద్రం రేషన్‌ ఉచితంగా అందజేసింది. ఎటువంటి సాయం అందక దిగువ మధ్య తరగతి ప్రజలే ఎక్కువ బాధలు పడ్డారు, పడుతున్నారు. అందుకే వారిపైనే ఎక్కువ దృష్టి సారించాల’ని ఆర్‌బీఐ పూర్వ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచిస్తున్నారు.

వినియోగం తగ్గుతోంది..

మధ్యతరగతి వర్గాల వినియోగం పెరిగితేనే, దేశాన్ని ‘నిజమైన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ’గా తీర్చిదిద్దొచ్చని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇటీవల చూస్తే ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ కంపెనీలు భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఇలా బాధితులవుతున్న వారిలో ఎక్కువమంది మధ్యతరగతి వారే. గ్రామీణ రైతుల స్థితీ ఇంతే. మధ్యతరగతిలోని అన్ని వృత్తుల వారికీ మేలు చేయాల్సిన బాధ్యత  బడ్జెట్‌ (Budget 2023)పై ఉంది.

ఇవి అవసరం

‘అసంఘటిత రంగంలో గిరాకీని పెంచాలి. ఫలితంగా మందగమనం పాలవుతున్న సంస్థాగత రంగం వేగంగా పుంజుకుంటుంది. ఇందు కోసం జీఎస్‌టీని సంస్కరించాలి. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక కేటాయింపులు జరగాలి’ అని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.

మధ్యతరగతిపై కొత్త పన్నులు విధించబోవడం లేదని ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. అయితే పన్ను మినహాయింపు పరిమితి, స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచాలనే డిమాండ్‌ అత్యధికుల నుంచి వస్తోంది.

డిపాజిట్లు, బాండ్లు, గృహ రుణం, పీపీఎఫ్‌ వంటి పెట్టుబడులపై వర్తించే మినహాయింపు పరిమితిని పెంచాలని; మూలధన పన్ను నిబంధనలను సరళీకరించడంతో పాటు వైద్య-జీవిత బీమా ప్రీమియానికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటున్నారు.

సమస్యలు పరిష్కరిస్తేనే..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం ‘నేనూ మధ్య తరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలన’నని ఇటీవల పేర్కొన్నారు. ఇందువల్ల వచ్చే బడ్జెట్‌ (Budget 2023)లో ఏవైనా ప్రయోజనాలు కల్పిస్తారా.. అనే ఆకాంక్ష మధ్యతరగతి నుంచి వ్యక్తమవుతోంది.

 

బడ్జెట్‌పై మరిన్ని కథనాల కోసం క్లిక్‌ చేయండి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని