హిండెన్‌బర్గ్‌పైౖ న్యాయ పరమైన చర్యలకు చూస్తున్నాం

అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Published : 27 Jan 2023 04:53 IST

అదానీ గ్రూప్‌  
దిల్లీ

మెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. అదానీ గ్రూప్‌, తమ కంపెనీల షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతా పుస్తకాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువరించింది. ఈ నివేదిక అదానీ గ్రూప్‌, వాటాదార్లు, మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపిందని, భారత పౌరుల్లో అనవసర భయాలను సృష్టించిందని అదానీ గ్రూప్‌ లీడ్‌ హెడ్‌ జతిన్‌ జలుంధ్వాలా పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువలపై ప్రతికూల ప్రభావం పడేలా, నివేదికలోని అంశాలను రూపొందించారని, ఇందుకోసం నిరాధార అంశాలను పొందుపర్చారని తెలిపారు. పెట్టుబడిదార్ల సమూహాన్ని, అదానీ గ్రూప్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఒక విదేశీ సంస్థ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం బాధ కలిగించిందని వెల్లడించారు. భారత, అమెరికా చట్టాల ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అదానీ గ్రూప్‌ ప్రధాన సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓ (ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈనెల 27న ప్రారంభం కానున్న నేపథ్యంలో, దానికి ఆదరణ దక్కకూడదనే ఉద్దేశంతోనే హిండెన్‌బర్గ్‌ ఇలా చేసిందని   పేర్కొన్నారు.

కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారే కానీ, హిండెన్‌బర్గ్‌పై అదానీ గ్రూప్‌ దావా వేసే ఆలోచనలు ఉన్నట్లు సంస్థ ప్రకటన స్పష్టం చేయలేదు.


ఒకరోజులో రూ.48,000 కోట్ల నష్టం  

హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు బుధవారం ఒక్కరోజే 3-8 శాతం కుదేలయ్యాయి. ఫలితంగా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో గౌతమ్‌ అదానీ సంపద విలువ 6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.48,600 కోట్లు) తగ్గింది. ప్రస్తుతం 113 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో అదానీ ఉన్నారు.


అజర్‌  బైజాన్‌లో అదానీ పెట్టుబడులు

జర్‌బైజాన్‌లో పెట్రోరసాయనాలు, గనుల ప్రాజెక్టులను దక్కించుకోవాలని అదానీ గ్రూప్‌ చూస్తోంది. భారత వెలుపల కూడా వ్యాపారాన్ని విస్తరించాలని సంస్థ భావిస్తోంది. గతవారం దావోస్‌లో అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హాం అలియెవ్‌తో జరిగిన భేటీలో, అదానీ ఈ ప్రణాళికలపై చర్చించారని అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది.  


అదానీ గ్రూప్‌పై నివేదికకు కట్టుబడి ఉన్నాం: హిండెన్‌బర్గ్‌

న్యాయపరమైన చర్యలు చేపట్టే మార్గాలు పరిశీలిస్తున్నట్లు, అదానీ గ్రూప్‌ హెచ్చరించిన నేపథ్యంలో హిండెన్‌బర్గ్‌ స్పందించింది. అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు ఆధారాలుగా తమ వద్ద పలు పత్రాలు ఉన్నాయని గురువారం స్పష్టం చేసింది. నివేదికలో తాము సూటిగా వేసిన 88 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అదానీ గ్రూప్‌ సమాధానం ఇవ్వలేదని వెల్లడించింది. ‘నివేదిక విడుదల చేసి 36 గంటలు గడిచినా, కంపెనీ పారదర్శకంగా ఉందని చెప్పడానికి అడిగిన 88 ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేదు’ అని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. తమపై ఏ న్యాయపరమైన చర్యకు ప్రయ త్నించినా, అది సఫలం కాదని అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌ కనుక అమెరికా కోర్టులో దావా వేస్తే, ఆ కంపెనీకి చెందిన మరిన్ని పత్రాలు ఇమ్మని కోరతామని తేల్చి చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని