సంక్షిప్త వార్తలు(8)

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌         రూ.105.56 కోట్ల మొత్తం ఆదాయం, రూ.17.32 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Updated : 28 Jan 2023 03:31 IST

తాజ్‌ జీవీకే లాభం రూ.17 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ రూ.105.56 కోట్ల మొత్తం ఆదాయం, రూ.17.32 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.82.04 కోట్లు, నికర లాభం రూ.12.47 కోట్లుగా ఉన్నాయి. తొమ్మిది నెలల కాలంలో మొత్తం లాభం రూ.65.38 కోట్లుగా నమోదైంది. తాజ్‌ శాంతాక్రూజ్‌ ముంబయి నిర్వహిస్తోన్న గ్రీన్‌వుడ్స్‌ ప్యాలెసెస్‌ అండ్‌ రిసార్ట్స్‌ రూ.52.89 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కార్పొరేట్‌ ప్రయాణాలు పెరగడం, సామాజిక వేడుకలూ అధికంగా ఉండటం మెరుగైన ఫలితాలకు కారణమని సంస్థ ఛైర్మన్‌ జీవీకే రెడ్డి తెలిపారు.


ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌ లాభం రూ.53 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్యాకేజింగ్‌ కంపెనీ ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌ రూ.53.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన లాభం రూ.29.44 కోట్లతో పోలిస్తే ఇది 81 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.396 కోట్ల నుంచి రూ.567 కోట్లకు పెరిగింది. మూడు త్రైమాసికాల్లో కలిపి ఆదాయం రూ.1,061 కోట్లు, నికర లాభం రూ.153 కోట్లుగా నమోదైంది. ప్యాకేజింగ్‌ ఆహార పదార్థాలకు గిరాకీ పెరగడంతో పాటు ఇతర విభాగాల నుంచీ ఆర్డర్లు అధికంగా ఉండటం కలిసొచ్చిందని సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) సందీప్‌ సొమానీ తెలిపారు.


ఎన్‌ఎమ్‌డీసీ స్టీల్‌ ప్రైవేటీకరణకు పలు బిడ్‌లు

దిల్లీ: ఎన్‌ఎమ్‌డీసీ స్టీల్‌ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వానికి పలు ప్రాథమిక బిడ్‌లు వచ్చాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. ఎన్‌ఎమ్‌డీసీ స్టీల్‌లో ప్రస్తుతం ప్రభుత్వానికి 60.79 శాతం వాటా ఉంది. చత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌లో అతిపెద్ద ఉక్కు తయారీ కేంద్రం సంస్థకు ఉంది. కంపెనీ యాజమాన్య నియంత్రణతో పాటు 50.79 శాతం వాటాను విక్రయించడానికి ప్రభుత్వం చూస్తోంది. 2022 డిసెంబరు 1న వాటా విక్రయానికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) లేదా ప్రాథమిక బిడ్‌లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు చివరితేదీగా జనవరి 27ను నిర్ణయించింది. వాటా కొనుగోలుకు పలు బిడ్‌లు రావడంతో లావాదేవీ రెండో దశకు చేరిందని పాండే ట్వీట్‌ చేశారు.

నేటి బోర్డు సమావేశాలు: ఎన్‌టీపీసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, కేర్‌ రేటింగ్స్‌, డీసీబీ బ్యాంక్‌, జెన్‌ టెక్నాలజీస్‌


వేదాంతా లాభంలో 41% క్షీణత

దిల్లీ: డిసెంబరు 2022తో ముగిసిన త్రైమాసికంలో వేదాంతా ఏకీకృత నికర లాభం 40.8% తగ్గి రూ.2,464 కోట్లుగా నమోదైంది. అధిక ముడిపదార్థాల వ్యయాలు, అదాటు పన్ను కారణంగా లాభాల్లో క్షీణత నమోదైంది. ఏడాది కిందట ఇదే మూడు నెలల కాలంలో లాభం రూ.4,164 కోట్లుగా ఉంది. ఏకీకృత ఆదాయం మాత్రం 0.4 శాతం పెరిగి రూ.34,674 కోట్ల నుంచి రూ.34,818 కోట్లకు చేరింది. కంపెనీ వ్యయాలు రూ.26,777 కోట్ల నుంచి రూ.31,327 కోట్లకు చేరాయి. జులై 2022లో విండ్‌ఫాల్‌ పన్నును ప్రవేశపెట్టడంతో రూ.333 కోట్ల మేర కంపెనీపై ప్రభావం పడింది. మరో పక్క, 2022-23 ఏడాదికి రూ.12.50 నాలుగో మధ్యంతర డివిడెండుకు బోర్డు ఆమోదం తెలిపింది.


1 నుంచి టాటా కార్లు ప్రియం

దిల్లీ: ప్రయాణికుల కార్ల విభాగంలో తమ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ కార్ల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. మోడల్‌ను బట్టి ఈ పెంపు సగటున 1.2% మేరకు ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ముడి సరకు ధరలు పెరగడం, మారుతున్న నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి భారం పెరుగుతోందని, అందుకే ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ తెలిపింది.


కార్స్‌24లో 500 ఉద్యోగాలు

దిల్లీ: తదుపరి దశ వృద్ధి నిమిత్తం వచ్చే మూడు నెలల్లో 500కు పైగా మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు ప్రీ-ఓన్డ్‌ వాహనాలను ఆన్‌లైన్‌లో కొనడం, అమ్మడం చేసే సంస ‘కార్స్‌24’ తెలిపింది. సాంకేతిక, సాంకేతికేతర సంబంధిత ఉద్యోగాలను టెక్‌, ప్రోడక్ట్‌, డేటా సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, బిజినెస్‌, కస్టమర్‌ సక్సెస్‌, మానవ వనరులు, ఆర్థిక, మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో తీసుకోనున్నట్లు తెలిపింది. గతేడాది దేశీయ వ్యాపార ఆదాయం రూ.6,008 కోట్లకు చేరుకోగా.. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్లుగా ఉంది.


బజాజ్‌ ఫైనాన్స్‌ రికార్డు లాభాలు

ముంబయి: రుణ అమ్మకాలు రాణించడంతో డిసెంబరు 2022తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.2,973 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో నమోదైన లాభంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం కావడం గమనార్హం. ఇక ప్రధాన నికర వడ్డీ ఆదాయం 28% వృద్ధి చెంది రూ.7,435 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు), నికర ఎన్‌పీఏలు వరుసగా 1.14%, 0.41 శాతానికి పరిమితమయ్యాయి.


సంక్షిప్తంగా

బంగాళాఖాతంలోని గ్రేట్‌ నికోబార్‌ ఐలాండ్‌లో రూ.41,000 కోట్ల ట్రాన్స్‌షిప్‌మెంట్‌ పోర్ట్‌ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించింది.

జమ్మూ కశ్మీర్‌లోని 7పట్టణాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను ప్రారంభించింది.

2022-23లో 751 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఓయో వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ తెలిపారు.

మల్టీపర్పస్‌ వెహికల్‌ ఇన్నోవా క్రిస్టల్‌లో కొత్త వెర్షన్‌ ముందస్తు బుకింగ్‌లను టయోటా ప్రారంభించింది. రూ.50,000 ముందస్తు చెల్లింపుతో బుకింగ్‌ చేసుకోవచ్చు.

బడ్డి తయారీ కేంద్రం నుంచి న్యూమోనియా ఔషధం సరఫరాకు గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది.

చైనా, తైవాన్‌ నుంచి దిగుమతి అయ్యే వినైల్‌ టైల్స్‌పై యాంటీ డంపింగ్‌ సుంకాన్ని విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని