ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఎదురుదెబ్బ

కొవిడ్‌-19 వైరస్‌పై వినియోగిస్తున్న ఆస్ట్రాజెనెకా సంస్థకు చెందిన ఎవియుషీల్డ్‌ వ్యాక్సిన్‌ వినియోగాన్ని అమెరికా ఉపసంహరించుకుంది.

Published : 28 Jan 2023 02:12 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 వైరస్‌పై వినియోగిస్తున్న ఆస్ట్రాజెనెకా సంస్థకు చెందిన ఎవియుషీల్డ్‌ వ్యాక్సిన్‌ వినియోగాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. గతంలో ఆల్ఫా, బీటా తదితర వేరియంట్లపై ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పని చేసింది. కానీ, ప్రస్తుతం కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంట్లపై అంతగా ప్రభావం చూపడం లేదన్న కారణంతో ఈ వ్యాక్సిన్‌ వినియోగాన్ని నిలిపి వేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో డిసెంబరు 2021లో అత్యవసర వినియోగం కింద ఈ వ్యాక్సిన్‌కు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే, మ్యుటేషన్‌ కారణంగా ఏర్పడిన కొత్త వైరస్‌లపై ఇది అంతగా ప్రభావం చూపడం లేదని తాజా పరిశోధనల్లో తేలింది.

విట్రో సుడోవైరస్‌ అస్సే లేబొరేటరీ డేటా ప్రకారం బీక్యూ1, బీక్యూ1.1, బీఎఫ్‌-7, బీఫ్‌-11, బీఏ5.2, బీఏ 4.6, బీఏ 2.75.2, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ1.5 తదితర వేరియంట్లపై ఈ వైరస్‌ ప్రభావం చూపడం లేదు. మరోవైపు ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఎక్స్‌బీబీ1.5 కరోనా వేరియంట్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ఈ వేరియంట్‌ మూలంగా ఏర్పడినవేనని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఈ నెల 20న వెల్లడించింది. ఇంకో వైపు అమెరికా అహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రభావం చూపుతున్న వైరస్‌ వేరియంట్లలో కేవలం 10 శాతం వాటిపైనే ఎవియుషీల్డ్‌ ప్రభావం చూపిస్తోందని తేలింది. దీంతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదన్న కారణంతో తాజాగా అమెరికా ఈ వ్యాక్సిన్‌ వాడకాన్ని ఉపసంహరించుకుంది. కాగా, రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో దీర్ఘకాలిక ఉపశమనం కోసం కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పరిశోధనలు పూర్తయ్యాయని, అయితే కొన్ని అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున ఈ ఏడాది మధ్యలో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు