Adani Stocks: అదానీ మదుపర్లు లబోదిబో
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు...అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్నాయి. శుక్రవారం మరో 5- 20% వరకు ఇవి పతనమయ్యాయి.
గ్రూపు కంపెనీల షేర్లకు హిండెన్‌బర్గ్ ఆరోపణల సెగ
శుక్రవారం 5- 20% వరకు పతనం
రెండు రోజుల్లోనే రూ.4.17 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరి
స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం
ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడో స్థానానికి దిగొచ్చిన గౌతమ్!
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు...అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్నాయి. శుక్రవారం మరో 5- 20% వరకు ఇవి పతనమయ్యాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నివేదికను విడుదల చేశారని అదానీ గ్రూపు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ శుక్రవారమూ షేర్ల పతనం ఆగలేదు. దీంతో రెండో రోజుల్లోనే అదానీ గ్రూపునకు చెందిన నమోదిత కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ.4.17 లక్షల కోట్ల మేర ఆవిరైంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం నిన్న ప్రారంభమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) పైనా పడింది. అదానీ గ్రూపు షేర్ల పతనంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తున్నాయి. నివేదికలో అదానీ గ్రూపు రుణాల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు ఉండటంతో బ్యాంకింగ్ షేర్లు డీలాపడటం సూచీల నష్టాలకు ఆజ్యం పోసిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ, ఆర్‌బీఐలు దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ డిమాండు చేస్తున్నారు.
100 బి.డాలర్ల దిగువకు గౌతమ్ సంపద
గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తోంది. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడైన బుధవారం నాడు షేర్ల పతనంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో గౌతమ్ అదానీ సంపద విలువ దాదాపు 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.48,600 కోట్లు) తగ్గి 113 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. శుక్రవారమూ షేర్లకు భారీ నష్టాలు కొనసాగడంతో ఆయన సంపద 100 బి.డాలర్ల దిగువకూ వచ్చింది. బుధవారం నాటితో పోలిస్తే 15% పతనమైంది. దీంతో ఫోర్బ్స్ రియల్‌టైం ప్రపంచవ్యాప్త శ్రీమంతుల జాబితాలో ఏడో స్థానానికి ఆయన దిగివచ్చినట్లు తెలుస్తోంది.
ఆరోపణలపై స్పందన సంతృప్తినివ్వలేదా!
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూపు ఇచ్చిన వివరణ మదుపర్లకు సంతృప్తినివ్వలేదనే విషయం.. శుక్రవారం నాటి షేర్ల పతనంతో అర్థం చేసుకోవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ అదానీ గ్రూపు భారీ రుణ భారంపై ఫిచ్ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌సైట్స్ లాంటి సంస్థలు కూడా ఆందోళనలు వెలిబుచ్చాయి. అటు అదానీ గ్రూపు కూడా వాటిని ఖండించుకుంటూనే వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా హిండెన్‌బర్గ్ కూడా అదే తరహా ఆరోపణలు చేయడంతో.. మదుపర్లు ఈ వ్యవహారంపై అదానీ గ్రూపు నుంచి పూర్తి స్పష్టతను కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదే రెండో రోజూ షేర్ల పతనానికి దారి తీసిందని విశ్లేషిస్తున్నారు. దీనిపై సెబీ ఎలా స్పందిస్తుందోనని కూడా మదుపర్లు గమనిస్తున్నారు. ఒకవేళ అదానీ గ్రూపు షేర్ల పతనం మున్ముందూ కొనసాగితే.. ఆ ప్రభావం మార్కెట్‌పై ఉండకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూచీల్లో పటిష్ఠమైన మూలాలున్న కంపెనీలు ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే రుణాలపై ఆందోళనలకు కంపెనీ నుంచి సరైన సమాధానం రాకుంటే.. బ్యాంకింగ్ షేర్లకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని, ఆ ప్రభావం మార్కెట్‌పైనా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
గతంలోనూ ఇదే తరహా నివేదికలు
ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అవకతవకలను, మోసాలను గుర్తించేందుకు ఒక ‘ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ పరిశోధన’ కంపెనీని 2017లో నాథన్ అండర్‌సన్ ఏర్పాటు చేసి.. దానికి హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌గా నామకరణం చేశారు. ఈ సంస్థ తన పరిశోధనల ఆధారంగా షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. అంతకుముందు లార్డ్‌స్టోన్ మోటార్స్ కార్ప్ (యూఎస్), కండి (చైనా), నికోలా మోటార్ కంపెనీ (యూఎస్), క్లోవర్ హెల్త్ (యూఎస్), టెక్నోగ్లాస్ (కొలంబియా)లపైనా ఇదే తరహా అవకతవకలను గుర్తించి షార్ట్ సెల్లింగ్ చేసింది. ఇప్పుడు తాజాగా అదానీ గ్రూపుపై అవకతవకలు ఆరోపణలు చేసి భారత స్టాక్ మార్కెట్లో కలకలం సృష్టిస్తోంది.
టీ+1 సెటిల్‌మెంట్ విధానం అమల్లోకి
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నుంచి పూర్తిగా టీ+1 సెటిల్‌మెంట్ విధానంలోకి మారాయి. టీ+1 సెటిల్‌మెంట్ వ్యవస్థ వల్ల మదుపర్లు షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపిన తర్వాత ఖాతాలోకి షేర్లు/నిధులు వేగంగా జమవుతాయి. మదుపర్లు ఎక్కువ లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం కలుగుతుంది. టీ+1 సెటిల్‌మెంట్‌తో లావాదేవీ జరిగిన ఒకరోజులోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటివరకు టీ+2 సెటిల్‌మెంట్ పద్ధతి అమలవుతోంది. జనవరి 27 నుంచి అన్ని లావాదేవీల సెటిల్‌మెంట్ టీ+1 పద్ధతిలో పూర్తిచేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది.
* ఫిబ్రవరి 1 నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు టీ+2 సెటిల్‌మెంట్ వ్యవస్థకు మారనున్నాయి. ప్రస్తుతం రెడెమ్షన్ ప్రక్రియ పూర్తయిన 3 రోజుల్లోగా మదుపర్ల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు బదిలీ అవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి